తెలంగాణ ఏర్పాటులో కీలక ఘట్టాలు.. | Key events in Formation of Telangana | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఏర్పాటులో కీలక ఘట్టాలు..

Feb 19 2014 2:35 AM | Updated on Aug 15 2018 8:57 PM

ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ, డిసెంబర్ 9 న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన... వెరసి తెలంగాణ ఏర్పాటు సాకారమవుతోంది.

ప్రజల సుదీర్ఘ ఆకాంక్ష, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ, డిసెంబర్ 9 న కేంద్ర మంత్రి చిదంబరం ప్రకటన... వెరసి తెలంగాణ ఏర్పాటు సాకారమవుతోంది. తెలంగాణ ఏర్పాటును కోరుతూ 29 నవంబర్ 2009 న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగా, దానిపై అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు చేసిన ప్రకటన మొత్తం ఈ ఘట్టంలో కీలకంగా మారింది. చిదంబరం ప్రకటన చేయడానికి కేసీఆర్ దీక్ష ఒక కారణమైతే, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా 2008 లో ఇచ్చిన లేఖ, చివరి వరకు దానికే కట్టుబడి ఉన్నామంటూ చెబుతూ వచ్చిన వైఖరి... చివరకు విభజన బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది.


 కీలక ఘట్టాలివీ...
 అక్టోబర్ 18, 2008: తెలంగాణ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ చేసిన తీర్మానానికి అనుగుణంగా కేంద్రానికి చంద్రబాబు లేఖ.
 నవంబరు 29, 2009: తెలంగాణ కోసం కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రారంభం.
 డిసెంబరు 9, 2009: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం ప్రయత్నాలు ప్రారంభిస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం ప్రకటన.
 డిసెంబర్ 23, 2009: కేంద్ర హోంశాఖ తెలంగాణ అంశంలో డిసెంబర్ 9న చేసిన ప్రకటనను సవరించుకుంటూ తెలంగాణ అంశం మరింత విసృ్తత స్థాయిలో సంప్రదింపులు కొనసాగుతాయని చిదంబరం మరో ప్రకటన
 జనవరి 5, 2010: ప్రత్యేక, సమైక్య ఆందోళనల నేపథ్యంలో రాష్ట్రంలోని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సమావేశం.
 జనవరి 28, 2010: రాష్ట్ర పరిస్థితుల అధ్యయనానికి కమిటీ నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రకటన.
 ఫిబ్రవరి 3, 2010: కమిటీ సారథిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శ్రీకృష్ణ, మరో నలుగురు సభ్యులు, కమిటీ విధివిధానాల ఖరారు.
 డిసెంబర్ 30, 2010: జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ తమ నివేదికను కేంద్ర హోంశాఖకు సమర్పణ.. ఆరు పరిష్కారాలు సూచించిన శ్రీకృష్ణ కమిటీ
 జనవరి 6, 2011: శ్రీకృష్ణ నివేదిక రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకు తెలియజేసేందుకు కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో రెండోసారి ఢిల్లీలో అఖిలపక్ష భేటీ... టీఆర్‌ఎస్, బీజేపీతో పాటు టీడీపీ కూడా భేటీకి దూరం.
 సెప్టెంబర్ 26, 2012: తెలంగాణకు అనుకూలంగా 2008లో తీర్మానం చేసి కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు ఈ అంశంపై వెంటనే అఖిలపక్ష సమావేశం జరపాలని కోరుతూ ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ.
 డిసెంబర్ 28, 2012: కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన 8 పార్టీలతో భేటీ..
 జూలై 12, 2013: తెలంగాణ ప్రక్రియకు సంబంధించి రోడ్‌మ్యాప్ ఖరారు చేయడానికి ఉద్దేశించిన కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశానికి హాజరైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ.
 జూలై 31, 2013: ఢిల్లీలో యూపీఏ మిత్రపక్షాల సమావేశం. 50 నిమిషాల పాటు కొనసాగిన సమావేశం. అనంతరం ఐదున్నర గంటలకు సీడబ్ల్యూసీ భేటీ..హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం. సీమాంధ్రలో పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపునకు నిర్ణయం.
 అక్టోబరు 3, 2013: సీడబ్యూసీ నిర్ణయానికనుగుణంగా తెలంగాణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం..
 అక్టోబరు 8, 2013: విభజనపై కేంద్ర మంత్రులతో జీవోఎం ఏర్పాటు..
 2013 నవంబరు 12, 13: రాష్ట్రంలోని ఎనిమిది పార్టీలతో విడివిడిగా జీవోఎం భేటీలు.. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన టీడీపీ గైర్హాజరు. తొలిరోజు తెలంగాణకు అనుకూలంగా ఉన్న సీపీఐ, టీఆర్‌ఎస్, బీజేపీలతో పాటు ఎంఐఎం, కాంగ్రెస్ హాజరు, రెండో రోజు సమైక్యవాదాన్ని వినిపించిన వైఎస్‌ఆర్ సీపీ, సీపీఎం హాజరు.
 డిసెంబర్ 13, 2013: తెలంగాణ ఏరా్పాటుకు సంబంధించి కేంద్రం రూపొందించిన బిల్లుపై రాష్ట్ర శాసనసభ అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్రపతి బిల్లు ప్రతులను రాష్ట్ర శాసనసభకు పంపారు.
 జనవరి 30, 2014: అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై చర్చ పూర్తి, బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసనసభ ఆమోదం.
 ఫిబ్రవరి 13, 2014: లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన కేంద్రం
 ఫిబ్రవరి 18, 2014: లోక్‌సభలో బిల్లుకు ఆమోదం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement