జన్మభూమి రసాభాస | janma bhoomi fire | Sakshi
Sakshi News home page

జన్మభూమి రసాభాస

Jun 5 2015 3:00 AM | Updated on Aug 10 2018 9:42 PM

ఏం చేశారని మళ్లీ వచ్చారు. గత జన్మభూమిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టా..

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి- మా ఊరు సభలు రసాభాసగా మారుతున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలు ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియక టీడీపీ నేతలు బిక్కముఖం వేస్తున్నారు. ఇంత వరకు ఏం చేశారు.. ఇక మీదట ఏం చేస్తారు.. చేసింది చాలు.. అంటూ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 ఏం చేశారని మళ్లీ వచ్చారు {పొద్దుటూరులో నిలదీసిన మహిళలు
 ప్రొద్దుటూరు టౌన్ : ఏం చేశారని మళ్లీ వచ్చారు. గత జన్మభూమిలో రేషన్ కార్డు కోసం దరఖాస్తు పెట్టా.. ఏమైనా ఇచ్చారా.. అంటూ జన్మభూమి సభలో మహిళలు మున్సిపల్ చైర్మన్ ఉండేల గురివిరెడ్డిని నిలదీశారు. పట్టణంలోని 38వ వార్డులో గురువారం ఉదయం జరిగిన జన్మభూమి - మా ఊరు సభకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హాజరయ్యారు. గత జన్మభూమిలో ఇచ్చిన దరఖాస్తులలో ఎన్నింటిని పరిష్కరించారో చెప్పాలని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో మహిళలు ఒక్క సారిగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్మన్ ముందుకు దూసుకెళ్లారు.

ఏ సమస్య పరిష్కరించకుండా మళ్లీ జన్మభూమి అంటూ వచ్చారా అని ప్రశ్నించారు. రుణాలు మాఫీ చేస్తామని చెప్పి సమావేశానికి మమ్మల్ను పిలచుకొచ్చారని, ఏ రుణం మాఫీ చేశారో చెప్పాలన్నారు. దీంతో చైర్మన్ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరికొంత మంది మహిళలు ముందుకు వచ్చి ప్రశ్నల వర్షం కురిపించారు. తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసినందుకు మాకు తగిన బుద్ధి చెప్పారని ఓ మహిళ ధ్వజమెత్తింది. రూ.120లు కందిబేడలు ధర ఉన్నాయని, ఎలా తిని బతకాలని మహిళలు ప్రశ్నించారు. ఇంతలో టూటౌన్ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, త్రీటౌన్ ఎస్‌ఐ పాండురంగ, సిబ్బంది అక్కడికి వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా మహిళలు వినిపించుకోలేదు.
 
 ఒక్క హామీ అమలు చేయలేదు కడపలో మహిళల ధ్వజం
 కడప కార్పొరేషన్ : జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలుగా పిలువబడుతున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు చుక్కెదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారని గొప్పలు చెబుతున్నారు.. అసలు ఏ హామీ అమలు చేశారో చెప్పాలని మహిళలు నిలదీయడంతో టీడీపీ నేతలు అవాక్కయ్యారు. కడప నగరం 40వ డివిజన్ పరిధిలోని మరియాపురం చర్చి ఆవరణంలో గురువారం ఉదయం జన్మభూమి- మాఊరు కార్యక్రమం నిర్వహించారు.

నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరె డ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మిహ ళల్లో చైతన్యం తెచ్చారని, ఎన్నికల్లో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తున్నారని చెబుతుండగానే శౌరీలు అనే మహిళ లేచి తన కుమార్తెకు వంద శాతం వికలత్వముందని, ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా పింఛన్ రాలేదని నిలదీసింది.

ఆ తర్వాత కార్తీ అనే మహిళ మాట్లాడుతూ చౌకదుకాణాల్లో వేలి ముద్రలు సరిపోలేదని తమకు బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని చెప్పింది. ఆమెకు సభికులంతా చప్పట్లతో సంఘీభావం ప్రకటించడంతో వేదిక పై ఉన్న నాయకుల నోట మాట రాలేదు. దీనిపై తహశీల్దార్ ఇచ్చిన వివరణను ఏ ఒక్కరూ వినిపించుకోలేదు. ఇదే సమయంలో తమ సమస్యలు పరిష్కరించాలంటూ మహిళలు వేదికపైకి దూసుకురావడంతో గందరగోళం నెలకొంది.  మరికొంతమంది మహిళలను పోలీసులు, సిబ్బంది అడ్డుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement