
అవతార పురుషుడు జగన్నాథుడు
జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు అనకాపల్లి పట్టణం ముస్తాబయింది.
- రేపు తొలి రథయాత్ర
- నేడు స్వామి కల్యాణం
- 8న తిరుగు రథయాత్ర
అనకాపల్లి : జగన్నాథ రథయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్సవాలకు అనకాపల్లి పట్టణం ముస్తాబయింది. గవరపాలెంలోని అగ్గిమర్రిచెట్టు వద్ద ఉన్న శ్రీ సుభద్ర బలభద్రా సమేత జగన్నాథ స్వామి దేవస్థానం రథయాత్ర మహోత్సవాలకు వేదిక కానుంది.
ఈ నెల 29 నుంచి జూలై 8వ తేదీ వరకూ నిర్వహించనున్న మహోత్సవాలలో భాగంగా స్వావి దశావతారాలలో దర్శనం ఇవ్వ నున్నారు. గూడ్స్‌షెడ్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్నహాల్‌లో స్వామి రోజుకో అవతారంలో భక్తులకు దర్శనమి స్తారు. ఇందులో భాగంగా శనివారం రాత్రి జగన్నాథస్వామి దేవాలయంలో శ్రీ రుక్మీణి, సత్యభామ సమేత వేణుగోపాల స్వామివారి కల్యాణాన్ని నిర్వహించనున్నారు.
29న తొలి రథయాత్ర...
ఈ నెల 29న తొలి రథయాత్రను నిర్వహించనున్నారు. ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు,ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణలు తొలి రథాయాత్రాను లాంఛనంగా ప్రారంభించనున్నారని ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ పి. వెంకటరావు తెలిపారు. ఈ యాత్ర పట్టణంలోని జగన్నాథస్వామి ఆలయం నుంచి గంగిరేవిచెట్టు,సతకంపట్టు, చినరామస్వామి కోవెల, పెదరామస్వామి కోవెల, సంతబయలు, సంతోషిమాత ఆలయం, పార్కు సెంటర్ మీదుగా రైల్యే స్టేషన్ వద్ద ఉన్న ఇంద్రద్యుమ్నహల్ వద్దకు చేరుకుంటుందని ఆలయ కార్యనిర్వాహణాధికారి బండారు ప్రసాద్ తెలిపారు. ఇంద్రద్యుమ్నహాల్‌లో రోజూ సాయంత్రం ధార్మిక ప్రవచనాలు, భక్తి సంగీతం వంటి కార్యక్రమాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
తిరుగు రథయాత్ర...
రథయాత్ర ఉత్సవాల ముగింపులో భాగంగా జూలై 8న ఉదయం 09-15 గంటలకు రథారోహణ, 09-45 గంటలకు తిరుగు రథాయాత్ర నిర్వహించనున్నారు.ఈమేరకు ఆరోజు మధ్యాహ్నం ఇంద్రద్యుమ్నహాల్ వద్ద అన్నసమారాధన ఏర్పాటు చేశారు.