కలెక్టర్ గారూ.. గడిచిన మూడు నెలల్లో 17 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘అనంత విషాదంలో అన్నదాత’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన రోజే మీరు స్పందించారు.
సాక్షి ప్రతినిధి, అనంతపురం : కలెక్టర్ గారూ.. గడిచిన మూడు నెలల్లో 17 మంది రైతులు అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయాన్ని ‘అనంత విషాదంలో అన్నదాత’ శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన రోజే మీరు స్పందించారు. ఆగమేఘాలపై రెవెన్యూ యంత్రాంగం ఆత్మహత్యలు చేసుకున్న రైతుల వివరాలు సేకరించి కలెక్టరేట్‌కు నివేదికలు
అన్యాయం!
పంపింది. ఆ నివేదికల మేరకు ఆత్మహత్యలు చేసుకున్న ఆరు కుటుంబాలకు మాత్రమే జీవో 421 ప్రకారం పరిహారం అందుతుందని మీరు ప్రకటన చేశారు. ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన ఒక సమస్యపై మీరు స్పందించిన తీరును అభినందిస్తూనే.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు సాయం అందించే విషయంలో మీ క్షేత్ర స్థాయి అధికారుల విచక్షణను అభిశంసించక తప్పడం లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో421 స్ఫూర్తికే విరుద్ధంగా.. బాధిత కుటుంబాలకు ఏ విధంగా సాయం నిరాకరించడానికి అవకాశం ఉందన్న ‘రంధ్రాన్వేషణే’ అధికారుల్లో కనిపిస్తోంది.
ఇంటి పెద్దను కోల్పోయి.. పుట్టెడు కష్టంలో ఉన్న ఆ పేద కుటుంబాలను ఆదుకోవడంలో ఉదారంగా ఉండాల్సింది పోయి.. చిన్న, చిన్న సాంకేతిక కారణాలను చూపుతూ 11 కుటుంబాలను పరిహారానికి దూరం చేయడం బాధాకరం. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా కలుగ చేసుకుని ఆయా కుటుంబాలు ప్రభుత్వ సాయానికి అర్హమైనవో? కాదో? పునః పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
జీవో 421లో ఏముంది ?
గడిచిన పదేళ్లలో అత్యంత మానవీయ కోణంలో వెలువడిన జీవో ఏదైనా ఉందంటే అది 421 మాత్రమే. జీవో మొదట్లోనే..‘కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోవడమనేది ఆ కుటుంబాలకు జరుగుతున్న విషాదమే కాకుండా దేశం ఒక రైతును కోల్పోతుంది’ అంటూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతుల పట్ల అపారమైన సానుభూతిని చూపే జీవో అది. ఈ జీవో ప్రకారం రైతు ఆత్మహత్య రిపోర్టయిన 24 గంటల్లోనే ఆర్‌డీవో, డీఎస్పీ, వ్యవసాయ శాఖ ఏడీలతో కూడిన డివిజన్ స్థాయి కమిటీ గ్రామానికి వెళ్లి, చనిపోయిన రైతు కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు, అప్పుల వారిని పిలిపించి రూ.50 వేలతో ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’కింద అప్పు తీర్చేయాలి. మరో లక్ష రూపాయలు సంబంధిత తహశీల్దార్, చనిపోయిన రైతు కుటుంబంలోని సభ్యుల పేర్లపై జాయింట్ అకౌంట్‌లో ఉంచాలి. ఆ సొమ్మును చనిపోయిన రైతు కుటుంబం తిరిగి వ్యవసాయం చేసేందుకు వినియోగించాలి.
అడుగడుగునా జాగ్రత్త .. చనిపోయిన రైతు కుటుంబం పరిహారానికి అర్హమైందా.. కాదా అన్నవిషయం తేల్చేందుకు మండల స్థాయి అధికారులతో కాకుండా డివిజన్ స్థాయి అధికారులతో కమిటీ ఏర్పాటు చేయడం గమనార్హం. మండల స్థాయి అధికారుల కన్నా డివిజన్ స్థాయి అధికారులైతే కాస్త నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తారనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు జరిగింది. అప్పట్లో దివంగత నేత వైఎస్ ఈ విషయాలను పేర్కొన్నారు కూడా. అలాగే జీవోలో ఎక్కడా ‘రైతు ఆత్మహత్య’ అని పేర్కొనకుండా... ‘వ్యవసాయ సంబంధిత విషయాల్లో ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు’ అని ప్రస్తావించడం వెనక కూడా అప్పటి ప్రభుత్వ దూర దృష్టి కనిపిస్తుంది.
జీవోలో రైతు ఆత్మహత్య అని పేర్కొంటే చనిపోయిన రైతు పేర భూమి లేకుంటే, చనిపోయిన వ్యక్తి కౌలు రైతు అయి ఉంటే, చనిపోయే నాటికి ఆ వ్యక్తి వ్యవసాయంతో పాటు.. ఏ హమాలీ పనో, ఇతర చేతి వృత్తులో చేస్తున్నట్లయితే మన ఘనత వహించిన రెవెన్యూ అధికార గణం ఈ జీవోను వారికి వర్తింప చేయకుండా పోయే ప్రమాదాన్ని పసిగట్టే.. ‘రైతు ఆత్మహత్య’కు బదులు ‘వ్యవసాయ సంబంధిత విషయాల్లో ఆత్మహత్యలు’ అని పేర్కొన్నారు. అప్పట్లో ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఏం ప్రయోజనం...? ఇప్పటికీ ఏదో ఒక వంక పెట్టి రెవెన్యూ అధికారులు చనిపోయిన రైతు కుటుంబాలు పరిహారానికి నోచుకోకుండా చేస్తూనే ఉన్నారు.
ఆ పరంపరలోనే ప్రస్తుతం జిల్లాలో గడిచిన మూడు నెలల్లో 17 ఆత్మహత్యలు జరిగితే అందులో కేవలం ఆరింటిని మాత్రమే పరిహారానికి అర్హమైనవిగా తేల్చారు. ఇలా మరణించిన రైతు కుటుంబాలను పరిహారానికి నోచుకోకుండా చేయడం ఆ కుటుంబాల పట్ల నిర్దయగా వ్యవహరించడమే కాదు, జీవో 421 ఉల్లంఘన కూడా అవుతుంది. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ స్వయంగా కలుగ చేసుకుంటే తమకు కూడా న్యాయం జరుగుతుందని మిగిలిన రైతు కుటుంబాలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాయి.
పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన పుల్లారెడ్డి ఆత్మహత్య విషయంలోనూ అధికారులు అవాస్తవాలు పేర్కొన్నారు. ఇతను ఆత్మహత్య చేసుకోలేదని, కరెంట్ షాక్ వల్ల చనిపోయాడని చెప్పారు. అయితే ఈ సంఘటనపై జూన్ 14 న పామిడి పోలీస్ స్టేషన్‌లో (107/2014)కేసు రిజిస్టర్ ఆయ్యింది. పుల్లారెడ్డి విష గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నట్లు అందులో పేర్కొన్నారు. విష గుళికలు తిన్న పుల్లారెడ్డిని గుత్తి ఆస్పత్రికి తరలిస్తే చికిత్స పొందుతూ మరణించాడు. ఆ మేరకు పుల్లారెడ్డి కుమారుడు లక్ష్మిరెడ్డి తన ఫిర్యాదులో కూడా పేర్కొన్నాడు. మరి ఈ మరణాన్ని రెవెన్యూ అధికారులు ఆత్మహత్య కాదని, విద్యుత్ షాక్ వల్ల చనిపోయాడని ఎలా నిర్ధారించారో వారికే తెలియాలి.
చెన్నేకొత్తపల్లి మండలం మేడారం చిన్న బయన్న ఆత్మహత్యకు కూడా రెవెన్యూ అధికారులు వక్రభాష్యం చెప్పారు. అసలు ఇతను రైతే కాదన్నారు. వాస్తవంగా ఇతని పేరుపై 65 సెంట్ల పొలం ఉంది. ఆ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ, కూలి పనులకు కూడా వెళ్లే వాడు. కుమార్తెల పెళ్లిళ్లు, వ్యవసాయంలో నష్టాలు ఈ కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయి.
ఈ ఫొటోలో ఉన్న మహిళ పేరు పూజారి పుణ్యవతి. భర్త పుల్లయ్య. ఇద్దరు మగ పిల్లలు. స్వగ్రామం తాడిపత్రి మండలంలోని కావేటి సముద్రం. రెండెకరాల పొలం ఉంది. దీనికితోడు మరో ఐదెకరాల పొలం కౌలుకు తీసుకుని పుల్లయ్య వ్యవసాయం చేశాడు. సొంత పొలంలో బోర్ల కోసం రూ.2 లక్షలు అప్పులయ్యాయి. పంటలు పండలేదు. ఒక్క వ్యవసాయం మీదే అప్పులు తీర్చడం సాధ్యం కాదనుకుని భార్యా పిల్లలతో తాడిపత్రిలో సంసారం పెట్టాడు. పాలిష్ బండల ఫ్యాక్టరీలో కూలీగా పని చేస్తూనే... గ్రామంలో పైరు సాగు చేశాడు. పంటల సాగుకు తాను పని చేస్తున్న పాలీష్ బండల ఫ్యాక్టరీ యజమాని వద్దా అప్పు చేశాడు. మళ్లీ ప్రకృతి వెక్కిరించింది.
అప్పుల వారి ఒత్తిడి ఎక్కువయ్యింది. మనసు వికలమయ్యింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. కాసేపటికి పుణ్యవతి నురగలు కక్కుతున్న పుల్లయ్యను గమనించి తాడిపత్రి ఆస్పత్రికి తీసుకెళ్లింది. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల తర్వాత, ప్రాణాపాయం లేదని డాక్టర్లు చెప్పడంతో తిరిగి తాడిపత్రి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే పుల్లయ్య జూలై 18న తాడిపత్రి ఆస్పత్రిలో మరణించాడు. అధికారులు ఈ కుటుంబానికి కూడా పరిహారం నిరాకరించారు. ఇందుకు వారు చూపే కారణం.. పుల్లయ్య పాలిష్ బండల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు కాబట్టి ఇతను రైతు కాదని. ఈ విషయం తెలిసిన పుణ్యవతి ‘నా భర్త రైతే. ఆయన పేరు మీద పాస్ బుక్కు కూడా ఉంది. మాకు అప్పులన్నీ వ్యవసాయయంలోనే అయినాయి. వాటిని తీర్చేందుకే ఇక్కడ కూలి పనికి వచ్చినాం.. ఇప్పుడు సాయం లేదంటోంది ప్రభుత్వం’ అంటూ కన్నీరు పెట్టుకుంటోంది.