వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం తగ్గినా ఎక్కడి నీరు అక్కడే ఉంది.
అరసవల్లి, న్యూస్‌లైన్: వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలతో పట్టణంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం తగ్గినా ఎక్కడి నీరు అక్కడే ఉంది. పారిశుద్ధ్యం మెరుగుకు మున్సిపల్ సిబ్బంది చర్యలు చేపట్టలేదు. దోమలు స్వైరవిహారం చేస్తున్నాయి. వ్యాధులు ప్రబలుతున్నాయి. మలేరియా, డెంగీ బారిన ప్రజలు పడుతున్నా అధికారులు స్పందించడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. గుజరాతీపేటలోని నాయుడు చెరువు గట్టు, చౌదరి సత్యనారాయణ కాలనీ, హయతినగరం, యాదవుల వీధి, పెసలవీధిలో ఇప్పటికే రెండు డెంగీ, మలేరియా కేసులు నమోదయ్యాయి. అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరిన ఇద్దరికి డెంగీ,మలేరియా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. వ్యాధులు మరింత ఉధృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
రోగులతో ఆస్పత్రుల కిటకిట
పలాస : ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలతో తాగునీటి వనరులు కలుషితమయ్యాయి. కలుషిత నీటిని తాగి పలువురు వ్యాధులకు గురవుతున్నారు. రెండు రోజుల నుంచి పలాస కమ్యూనిటీ ఆస్పత్రికి అతిసార, విషజ్వరాల బారిన పడిన రోగులు అధిక సంఖ్యలో వస్తున్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు వైద్యసేవలందడం లేదనే గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీలో జయరామచంద్రపురం గ్రామానికి చెందిన ఇద్దరు డయేరియాతో పలాస ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందారు. నందిగాం మండలం మద్యగోపాలపురం గ్రామానికి చెందిన వరిశ లక్ష్మీనారాయణ అతిసారతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ముంపునకు గురైన ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది.
లోతట్టు గ్రామాలు నీటిలో ఉండడంతో ప్రజలురోగాల బారినపడుతున్నారు. పలాస నియోజకవర్గంలోని గిరిజన గ్రామాలకు వైద్యసేవలంద డకపోవడంతో సంచి వైద్యులను ఆశ్రయించాల్సి వస్తోం దని గిరిజనులు తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది ముంపు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా మిగిలిన గ్రామాలను పట్టించుకోవడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో కూడా వైద్య సిబ్బంది వైద్యసేవలందించాలని కోరుతున్నారు.