అటకెక్కిన ‘ఆన్‌లైన్’! | Incomplete panchayats 'online' registration | Sakshi
Sakshi News home page

అటకెక్కిన ‘ఆన్‌లైన్’!

Nov 14 2013 12:25 AM | Updated on Sep 2 2017 12:34 AM

పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆన్‌లైన్ సేవలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

వికారాబాద్, న్యూస్‌లైన్: పంచాయతీల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆన్‌లైన్ సేవలు ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. పంచాయతీలకు విడుదలవుతున్న నిధులు, వాటి వినియోగం తదితర వివరాలు ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు వీలుగా అన్నిం టినీ కంప్యూటరీకరించి ఉంచాలన్నది కేంద్ర ప్రభుత్వం సూచన. ఆన్‌లైన్ సేవలు అందుబాటులోకి వస్తేనే 13వ ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని స్పష్టంచేసినా అధికారుల్లో మాత్రం చలనం కన్పించడం లేదు. ఆన్‌లైన్ విధానంపై పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. జిల్లాలో 705 పంచాయతీలు ఉన్నాయి. వీటికి సంబంధించి మాస్టర్ ఎంట్రీలు, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఓచర్ల సంఖ్య తదితర వాటి వివరాలను 2013మార్చి నెలాఖరు వరకు పంచాయతీరాజ్ సంస్థల ఆడిటింగ్ సాఫ్ట్‌వేర్ (ప్రియా సాప్ట్) ద్వారా ఆన్‌లైన్‌లో ఉంచితే నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సూచించింది.
 
 క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఇలా..
 కేంద్ర  ప్రభుత్వం పంచాయతీల అభివృద్ధికి రూ.కోట్లాది నిధులు కుమ్మరిస్తున్నా ఆశించిన ప్రగతి కన్పించడం లేదు. నిధులు పక్కదారి పడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి దీపాలు, తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు సైతం చెల్లించలేని పరిస్థితులున్నాయి. ఇప్పటికే 13వ ఆర్థిక సంఘం నిధులు ఒక విడత విడుదలయ్యాయి. మిగిలిన నిధుల విడుదలకు పంచాయతీల పద్దుల వివరాలు, ఆదాయ, వ్యయాలు, కావాల్సిన నిధులు తదితర వాటిని ఆన్‌లైన్‌లో పెట్టాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కాగా, వీటిని ఆన్‌లైన్‌లో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులు కుస్తీ పడుతున్నారు. అయితే కంప్యూటర్ల కొరత, విద్యుత్ కోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం అంటీముట్టనట్టు వ్యవహరిస్తోంది. ఈ వివరాలు నమోదు చేయని పంచాయతీలకు నిధులు నిలిచిపోయి అభివృద్ధికి విఘాతం కలిగే అవకాశం ఉంది. తాగునీటి పథకాలకు విద్యుత్ బిల్లులు చెల్లించకపోతే ఆ శాఖ అధికారులు కనెక్షన్లు తొలగిస్తే నీటి సరఫరా నిలిచిపోతుంది. ఇప్పటికే పలు గ్రామాల్లో ప్రజలు నీటికి కటకట ఎదుర్కొంటున్నారు.
 
 కారణాలు అనేకం..
 పంచాయతీల ఆదాయ, వ్యయాలు, నిధులు విడుదల, వినియోగం తదితర వాటిని ఆన్‌లైన్‌లో పెట్టేందుకు పంచాయతీ కార్యదర్శులకు ఎలాంటి శిక్షణ ఇవ్వలేదు. దీంతో వారికి అవగాహన లేక వివరాల నమోదుకు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో 705 గ్రామ పంచాయతీలుండగా కేవలం 35 పంచాయతీల్లో మాత్రమే కంప్యూటర్లున్నాయి. దీంతో మిగతా గ్రామాల వారు వివరాలు నమోదు చేసేందుకు ఇంటర్నెట్ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. పలువురు పంచాయతీ కార్యదర్శులు తమ స్నేహితుల దగ్గర అదే విధంగా సమీప బంధువుల ఇళ్లకు వెళ్లి నమోదు చేయాల్సి వస్తోంది. అవగాహన రాహిత్యంతో పలువురు కార్యదర్శులు ఓపెనింగ్ బ్యాలెన్స్‌లను పూర్తిస్థాయిలో ఆన్‌లై న్‌లో పొందుపరచకుండా మమ అంటున్నారు. దీంతో పూర్తి వివరాలు ఆన్‌లైన్‌లో లభించడం లేదు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్ సేవల కోసం మరి కొంత కాలం ఆగాల్సిందేనని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.
 
 ఇప్పటివరకు నమోదైనవి..
 జిల్లాలోని 705 పంచాయతీల్లో 189 గ్రామ పంచాయతీల్లో మాత్రమే ఆన్‌లైన్‌లో వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. మిగతా పంచాయతీల్లో ఇంకా ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభమే కాలేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసి ఆరు నెలలు దాటుతున్నా ఇంకా ఆన్ లైన్ పనులు పూర్తి కాకపోవడంతో 516 గ్రామాలకు ఆర్థిక సంఘం నిధులు అందేది అనుమానమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement