జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సంకల్పం సడలలేదు. జోరు వానను సైతం లెక్కచేయకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేస్తున్నారు.
సాక్షి, కడప : జిల్లాలో మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల సంకల్పం సడలలేదు. జోరు వానను సైతం లెక్కచేయకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రిలే దీక్షలు చేస్తున్నారు. పులివెందులలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్లలో గొడుగులతో నిరసన చేపట్టారు.
సమైక్య శంఖారావం సభను విజయవంతం చేసేందుకు అన్ని నియోజకవర్గాలలో పార్టీ ముఖ్య నేతలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. సభకు ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. భారీ ఎత్తున హైదరాబాదుకు తరలేందుకు వాహనాలు సమకూర్చుకుంటున్నారు. కొంతమంది అభిమానులు ముందుగానే బయలుదేరి హైదరాబాదుకు చేరుకుంటున్నారు.
జమ్మలమడుగులో 13 మంది అంబవరం గ్రామస్తులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్లలో జోరువానలో సైతం రిలే దీక్షలను సాగించారు. మహబూబ్‌నగర్ కాలనీ యువకులు 15 మంది పాల్గొన్నారు. వర్షంలో గొడుగులు పట్టుకుని నిరసన తెలిపారు.
రైల్వేకోడూరులో ఓబులవారిపల్లె మండలం బాలిరెడ్డిపల్లెకు చెందిన వైఎస్సార్ సీపీ నేతలు చంద్రారెడ్డి, బాబుల్‌రెడ్డి నేతృత్వంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాజంపేటలో నందలూరు మండలం నల్లతిమ్మాయపల్లెకు చెందిన గంగిరెడ్డి, సుదర్శన్ ఆధ్వర్యంలో 30 మంది దీక్షల్లో పాల్గొన్నారు.
పులివెందులలో వర్షంలో తడుస్తునే వైఎస్సార్ సీపీ కార్యకర్తలు బస్టాండు నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పూల అంగళ్ల కూడలిలో గొడుగులతో మానవహారంగా ఏర్పడ్డారు.
కమలాపురంలో బయనపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత సుధా శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో పలువురు కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
కడపలో ఎండీ ఆల్ఫోన్స్ నేతృత్వంలో 15 మంది మహిళలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
రాయచోటిలో సంబేపల్లెమండలం మోటకట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత, డీసీసీబీ డెరైక్టర్ వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు.