
ఇక్కడా కక్కుర్తే..!
హుద్‌హుద్ తుఫాన్‌కు ఒక్క విశాఖలోనే లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. నేటికీ వేలాది మంది నిలువ నీడ లేక పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్నారు
♦ ఐఏవై ఇళ్లను కుదించిన రాష్ట్ర సర్కార్
♦ సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ఎత్తుగడ
♦ {పజాప్రతినిధుల నుంచి వ్యతిరేకత
ఎన్టీఆర్ గృహ నిర్మాణం పేరిట కేంద్రం మంజూరు చేసిన ఐఏవై ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కుదించేసింది. తద్వారా సబ్సిడీ భారం రాష్ట్రంపై పడకుండా సర్దుబాటు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ పరిణామాలతో హుద్‌హుద్ బాధితులకు తీవ్ర నష్టం జరగనుంది. మరోవైపు ఈ నిర్ణయంపై ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నూతన మార్గదర్శకాలతో జాబితాలో అర్హులను తొలగిస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని వారు మండిపడుతున్నారు. ఇటీవల జరిగిన జెడ్పీ సమావేశంలో కూడా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది.
సాక్షి, విశాఖపట్నం : హుద్‌హుద్ తుఫాన్‌కు ఒక్క విశాఖలోనే లక్షా 18 వేల ఇళ్లు దెబ్బతిన్నాయి. నేటికీ వేలాది మంది నిలువ నీడ లేక పరాయి పంచన కాలం వెళ్లదీస్తున్నారు. ఐఏవై కింద 66,390 ఇళ్ల కోసంకేంద్రానికి ప్రతిపాదనలు పంపితే.. యూనిట్ కాస్ట్ రూ.75 వేల అంచనాతో జిల్లాకు 16,890 మంజూరు చేసిం ది. కాగా ఇటీవల రాష్ర్ట ప్రభుత్వం ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రకటించింది. ఈ పథకం ద్వారా రాష్ర్టంలో రెండు లక్షల గృహాలు నిర్మిస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్న సర్కా ర్.. హుద్‌హుద్ వల్ల తీవ్రంగా దెబ్బతిన్న విశాఖకు కేవలం 1,821 ఇళ్లను మాత్రమే మంజూరు చేసింది.
ఇప్పటికే దాతల సహకారంతో ఆరువేల ఇళ్ల నిర్మాణం చేపడుతున్నందున.. ఐఏవై ఇళ్లలో కోత పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాకు మంజూరైన 16,890 ఐఏవై ఇళ్లను 9,929 ఇళ్లకు కుదించేసింది. ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకంలో మంజూరు చేసిన 1,821 ఇళ్లతో కలిపి మొత్తం 11,750 ఇళ్లను యూనిట్ కాస్ట్ రూ.2.75లక్షలతో నిర్మించాలని నిర్ణయిం చింది. యూనిట్ కాస్ట్‌లో ఎస్సీ, ఎస్టీలకైతే సబ్సిడీ రూపంలో రూ.37,500 కేం ద్రం, రూ.1.37,500 రాష్ర్టం భరించనుండ గా, మరో లక్ష రుణం రూపం లో మంజూరు చేయనుంది.
ఇతరులకైతే కేం ద్రం రూ.37,500, రాష్ర్టం రూ.87,500 భరించనుం డగా, రూ. 1.50 లక్షలు రుణంగా అందజేయనుం ది. అంటే కేంద్రం వాటా పోను.. రాష్ర్టం సబ్సిడీ భరించాల్సి ఉంది. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఐఏవై ఇళ్ల కింద మంజూరు చేసిన సొమ్మును సర్దుబాటు చేసుకుని ఇళ్ల సంఖ్య కుదించిందనే వాదన విన్పిస్తోంది. ఐఏవై ఇళ్లను కుదించడం వల్ల కేంద్రం వాటా, రుణం పోగా జిల్లాకు మంజూరు చేసిన ఇళ్లకు సంబంధించి రాష్ర్టంపై అదనంగా పడే భారం కేవలం రూ.65 కోట్ల లోపే ఉంటుందని అంచనా.
హుద్ హుద్ బాధితులకు తీవ్ర నష్టం
జిల్లా వ్యాప్తంగా హుద్‌హుద్ బాధితుల కోసం కేంద్రం ఐఏవై ఇళ్లు మంజూరు చేసింది. కానీ ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం మార్గదర్శకాలను పరిశీలిస్తే 75 శాతం పూర్తిగా ఒకే ప్రాంతంలో లే అవుట్ సైట్‌లోనై నిర్మించాలి. గ్రామా ల్లో ఇళ్లు నిర్మించుకోకుండా అక్కడక్కడా ఉన్న లబ్ధిదారుల్లో కేవలం 25 శాతం మందికి మాత్రమే మంజూరు చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన హుద్‌హుద్‌కు బాధితులకు నష్టం జరిగే పరిస్థితి నెలకొంది.
ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత
మరొక పక్క ఇప్పటికే ఐఏవై కింద మంజూరైన ఇళ్ల కోసం ఎమ్మెల్యేల నుంచి 4,488 ప్రతిపాదనలు అందగా, వీటిలో ఇప్పటికే 1,050 ఇళ్ల నిర్మాణం ప్రారంభించారు. నియోజకవర్గానికి రెండువేల ఇళ్ల వరకు కేటాయించగా.. సర్కార్ తీసుకున్న తాజా నిర్ణయంతో వీటి సంఖ్య సగానికి తగ్గిపోనుంది. పైగా మార్గ దర్శకాలు పుణ్యమాని అర్హుల జాబితాలో చాలాపేర్లు తొలగించాల్సి వస్తోంది. దీంతో ఈ ప్రతిపాదనను ఎమ్మెల్యేల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
‘ఇప్పటికే మంజూరైన ఐఏవై ఇళ్లను రూ.75 వేల యూనిట్ కాస్ట్‌తో నిర్మిస్తారో లేక రూ.2.75లక్షల యూనిట్‌కాస్ట్‌తో నిర్మిస్తారో మీ ఇష్టం.. కానీ జిల్లాకు మంజూరైన 16,890 ఇళ్లను కుదించడానికి వీల్లేదని’ వారు పట్టుబడుతున్నారు. అలా చేస్తే నియోజకవర్గాల్లో తిరగలేమని..ఇప్పటికే ఎంపిక చేసిన వారికి ఏం సమాధానం చెబుతామని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూడా చర్చ జరగడంతో కుదించిన 5,140 ఇళ్లను జిల్లాకు అదనంగా మంజూరు చేయాలని జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించింది.