
అగ్నిప్రమాదంలో గుడిసె దగ్ధం
బోర్లంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన సందుల పోశయ్య గుడిసె దగ్ధమైంది. పోశయ్య కుటుంబ సభ్యులు రాత్రి వేళ గుడిసె పక్కన ఉన్న ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
బోర్లం(బాన్సువాడరూరల్), న్యూస్‌లైన్ :
బోర్లంలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన సందుల పోశయ్య గుడిసె దగ్ధమైంది. పోశయ్య కుటుంబ సభ్యులు రాత్రి వేళ గుడిసె పక్కన ఉన్న ఇంట్లో నిద్రిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. మంటలను గమనించిన స్థానికులు వెంటనే బాన్నువాడలోని ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించారు.
ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అప్పటికే గుడిసెలోని కలప, వంట సామగ్రి, దుస్తులు, నిత్యావసర వస్తువులు, ఎరువులు కాలిబూడిదయ్యాయి. తామంటే గిట్టనివారు గుడిసెకు నిప్పంటించి ఉంటారని బాధితులు ఆరోపించారు. వీఆర్‌ఓ సంజీవ్ సంఘటన స్థలాన్ని సందర్శించి ఆస్తినష్టాన్ని అంచనా వేశారు. రూ. 60 వేల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
పసుపు కుప్ప దగ్ధం
రెంజర్ల(బాల్కొండ): రెంజర్ల గ్రామంలో శనివారం అగ్ని ప్రమాదం సంభవించింది. బుల్లె రాంరెడ్డికి చెందిన పసుపు కుప్ప కాలిపోయింది. వివరాలిలా ఉన్నాయి. రాంరెడ్డి పసుపును ఉడికించడానికి కళ్లం వద్ద కుప్పగా పోశారు. పక్కన మరో రైతు పసుపును ఉడికిస్తుండగా నిప్పు రవ్వలు వచ్చి రాంరెడ్డికి చెందిన పంటపై పడ్డాయి. దీంతో మంటలు వ్యాపించాయి. రైతులు దీనిని గమనించి మంటలను ఆర్పడానికి యత్నించినా ఫలితం లేకపోయింది. 5 ట్రాక్టర్ల పసుపు కొమ్ము కాలిపోయిందని, సుమారు లక్షన్నర రూపాయాల నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపారు.