
బ్లేడ్‌బ్యాచ్ హల్‌చల్..
పట్నంబజారు (గుంటూరు) నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరుగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త! బ్లేడుతో దాడి చేసి ఉన్న సొమ్ము దోచుకుపోతారు.
పట్నంబజారు (గుంటూరు)
నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో రాత్రి సమయాల్లో ఒంటరిగా తిరుగుతున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త! బ్లేడుతో దాడి చేసి ఉన్న సొమ్ము దోచుకుపోతారు. బ్లేడుతో దాడి ఏంటని నివ్వెరపోతున్నారా.. కొత్తగా బస్టాండ్ లో బ్లేడ్ బ్యాచ్ ముఠా సంచరిస్తోంది. వివరాలిలా ఉన్నాయి.... కొంతమంది యువకులు ముఠాగా ఏర్పడి రాత్రి సమయాల్లో బస్టాండ్ వద్ద చీకటి ప్రదేశాల్లో ఉన్న వారిపై బ్లేడ్లతో దాడి చేసి బాధితుడి జేబులో సొమ్ము దోచుకుపోతున్నారు. ఈ ఘటనలకు పాల్పడుతున్న వారిలో బాలురు అధికంగా ఉండడం గమనార్హం! ఇటీవల కాలంలో బస్టాండ్‌లో వరుస దొంగతనాలు జరగడంతో ప్రయాణికులతోపాటు ఆర్టీసీ, పోలీసు అధికారుల్లో కలవరం మొదలైంది. పల్నాడు ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తిపై మూడు నెలల క్రితం దాడి చేసి గాయపరిచి, ఆయన జే బులోని పర్సును తీసుకుపోయారు. అప్పట్లో దీనిపై పోలీసులు సీరియస్‌గా స్పందించలేదనే విమర్శలు ఉన్నాయి. ఈ సంఘటన అనంతరం బస్టాండ్‌లోని ఒక యాచకుడి గొంతు కోసి అతని వద్ద ఉన్న సొమ్ము తీసుకుపోయారు. నెల రోజులపాటు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందిన యాచకుడు మృతిచెందాడు. అయితే కేసు నమోదు చేసిన పోలీసులు ఒక బాలుడిని అదుపులోకి తీసుకుని విచారించగా ఒక ముఠా ఉన్నట్లు అంగీకరించాడు. బాలుడిని అరెస్ట్‌చేసిన పోలీసులు తమ ఘనతను కప్పి పుచ్చుకునేందుకు కేసు వివరాలను గోప్యంగా ఉంచి, బాలుడిని జువైనల్ జైలుకు తరలించారు. బాలుడి అరెస్టు అనంతరం పోలీసులు కనీసం ఆ ముఠాను పట్టుకునేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం! బస్టాండ్ పాతగుంటూరు పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. బస్టాండ్‌లోని పోలీసు అవుట్‌పోస్టులో పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం, స్టేషన్ అధికారుల పర్యవేక్షణ లోపంతో బ్లేడు బ్యాచ్ పేట్రేగిపోతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మధ్య కాలంలో చిన్న చితక సంఘటనలు జరిగినా.. అవి స్టేషన్‌కు వరకు రాకుండా పోతున్నాయి. దాడి చేయకుండా డబ్బులు దోచుకుపోతున్నారని సమాచారం. పోలీసుల వద్దకు బాధితులు వచ్చినా.. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అసలే ఆర్టీసీ బస్టాండ్ అంటే దొంగతనాలకు కేరాఫ్ అడ్రస్. వీటికి తోడు ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటే ప్రయాణికుల పరిస్థితి ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించి బ్లేడు బ్యాచ్‌ను అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మరిన్ని ఘోరాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.