కరువు తీవ్రం బతుకు భారం

Huge Water Drought In Rayalaseema and Prakasam and Nellore Districts - Sakshi

పాతాళానికి భూగర్భ జలమట్టం...  ఇంకిపోతున్న బోర్లు..

మలమలా మాడిపోతున్న పంటలు

ఎండుతున్న పండ్ల తోటలు

గ్రాసం దొరక్క బక్కచిక్కుతున్న పశువులు

పరిస్థితిని తలచుకుని రైతన్నల కంటతడి

 పనుల్లేక అన్నదాతల వలసబాట

చెన్నై, బెంగళూరు కబేళాలకు పశువుల తరలింపు

కళతప్పిన పల్లెసీమలు 

ఏళ్ల తరబడి కన్నబిడ్డల్లా పెంచుకున్న పండ్ల తోటలు కళ్లముందే ఎండిపోతున్నాయి.. కోతకొచ్చిన కాయలతో పచ్చగా కళకళలాడాల్సిన మామిడి, బత్తాయి, సన్న నిమ్మ తోటలు కాయలతో సహా మలమలా మాడిపోతున్నాయి.. పొట్టేళ్లను వేలాడదీసినట్లు గెలలున్న అరటి చెట్లు వాడిపోతున్నాయి.. బొప్పాయిదీ అదే పరిస్థితి.. చెరకు ఎండిపోయిన గడ్డిలా మారింది.. కోతకు రావాల్సిన నువ్వు భూమికి అతుక్కుని వత్తుల్లా మారింది.. టమోటా, ఇతర కూరగాయల తోటలూ ఇందుకు భిన్నమేమీ కాదు. తినడానికి గడ్డి, తాగడానికి నీరులేక పశువులు బక్కచిక్కిపోతున్నాయి. ఇది తట్టుకోలేక అన్నదాతలు మనసు చంపుకుని వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. మరోవైపు.. వేలాది పల్లెలు తాగునీటికి  కటకటలాడుతున్నాయి. పనుల్లేక ఉపాధి కోసం కూలీలతోపాటు సన్నకారు రైతులు వలసబాట పట్టారు. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు మాత్రమే ఉన్నారు. చాలా ఇళ్లకు తాళాలు కనిపిస్తున్నాయి. సిరిధాన్యాలతో కళకళలాడాల్సిన పల్లె సీమలు  కళావిహీనంగా, దయనీయంగా మారాయి. రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు కరాళ నృత్యం సృష్టించిన బతుకు చిత్రం ఇది.
నెల్లూరు జిల్లా నాయుడుపేట మండలంలోని పుదూరు పొలాల్లో ఉన్న బావి నుంచి నీరు తెచ్చుకుంటున్న మహిళ 

సాక్షి, అమరావతి : ఒకవైపు మండుతున్న ఎండలు.. మరోవైపు ఉష్ణతాపం, వేడిగాలులతో నీటి తడిపెట్టిన రెండో రోజే పంటపొలాలు తడారి ఎండిపోతున్నాయి. మరోవైపు ఐదేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలమట్టం పాతాళానికి చేరింది. బోర్లకు నీరు అందడంలేదు. ఎలాగైనా పైర్లు, పండ్ల తోటలను కాపాడుకోవాలనే ఆశతో అప్పుచేసి బోర్లు వేసినా నీరు పడటంలేదు. చిత్తూరు, వైఎస్సార్, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వెయ్యి అడుగుల లోతు వరకూ బోర్లు వేసినా నీటి జాడేలేదు. దీంతో రైతుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా తయారైంది. పంటల సాగుకు చేసిన అప్పులకు బోర్ల కోసం చేసిన అప్పులు తోడుకావడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. వీటి నుంచి బయటపడే మార్గం కానరాక సతమతమవుతున్నారు. వైఎస్సార్‌ కడప, అనంతపురం జిల్లాల్లో గెలలతో ఉన్న అరటి తోటలు, బత్తాయి, మామిడి, దానిమ్మ తోటలు ఎండిపోతున్నాయి. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి. ఏతావాతా పెరిగిన అప్పులు తీర్చే మార్గం కానరాక రైతులు పడుతున్న మానసిక వేదన మాటలకందనిది.

తాగునీరు.. కన్నీరు..
గ్రామాల్లో తాగునీటి ఇక్కట్లకు అద్దం పడుతున్నాయి ఈ దృశ్యాలు. ఊరుదాటి కిలోమీటర్ల కొద్దీ వెళ్లినా చుక్క నీరు దొరకని దుస్థితిలో గ్రామీణులు కొట్టుమిట్టాడుతున్నారు. ఎక్కడో దూరాన చెలమల్లో అరకొర నీరు ఊరుతోందని తెలుసుకొని బిందెలు పట్టుకొని గంటల తరబడి తోడుకుంటూ గుక్కెడు నీళ్లు చేతికందగానే ఇంటి ముఖం పడుతున్నారు. మండు వేసవిలో మహిళలు చిన్న పిల్లలను కూడా వెంట నడిపించుకొస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తాగునీరు అందించాల్సిన ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తోంది. ఇకనైనా తమకు కనీసం గుక్కెడు మంచినీళ్లు అందించాలని సర్కారును వేడుకుంటున్నారు.

కందిపోతున్న కాయలు
రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రతతో నీటి తడులు అందక పండ్ల తోటల్లోని కాయలు నల్లగా కందిపోతున్నాయి. అరటి గెలలు వాడిపోతున్నాయి. బత్తాయి, బొప్పాయితోపాటు మామిడి కాయలు రంగు మారిపోతున్నాయి. టమోటాలు ఎండకు తెల్లగా రంగుమారి పిప్పితేలుతున్నాయి. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో వేలాది ఎకరాల్లో టమోటా తోటలు దెబ్బతిన్నాయి. దీనివల్ల టమోటా దిగుబడి భారీగా పడిపోయింది. అనంతపురం జిల్లాలో ఎండల నుంచి దానిమ్మ చెట్లను కాపాడుకోడానికి పాత చీరలను కప్పుతున్నారు. టమోటా రైతులు ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. ‘తోటకు పందిరి ఎటూ వేయలేం. భారీగా ఖర్చుపెట్టి గ్రీన్‌ హౌస్‌ లాంటివి పెట్టుకునే స్తోమతలేదు. అందువల్ల పాత చీరలు కొని పండ్లను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. వీటిని చెట్లకు రక్షణగా కట్టడంవల్ల పండ్లకు, మొగ్గలకు కొంతవరకు రక్షణగా ఉంటున్నాయి’ అని అనంతపురం జిల్లా ఉరవకొండ ప్రాంతానికి చెందిన వెంకటప్ప గౌడ్‌ అన్నారు. 

పడిపోయిన భూగర్భ నీటిమట్టం
గత ఏడాది మే 16వ తేదీతో పోల్చితే ప్రస్తుతం శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లో తప్ప మిగిలిన 11 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పడిపోయింది. చిత్తూరు జిల్లాలో గత ఏడాదికీ, ఈ ఏడాదికీ భారీ వ్యత్యాసం నెలకొంది. ఏకంగా 36.90 అడుగుల కిందకు జలమట్టం పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇదే కాలంలో వైఎస్సార్‌ జిల్లాల్లో 19.65 అడుగుల కిందకు పడిపోయింది. రాయలసీమలో సగటున భూగర్భ జలమట్టం 20.86 అడుగులకు కిందకు పడిపోవడం ప్రమాద ఘంటికలు మోగుతున్నాయనడానికి నిదర్శనమని భూగర్భ జల శాఖ నిపుణులు చెబుతున్నారు. వరుసగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడటమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. ఈ కారణంతోనే బోర్లు సైతం ఎండిపోతున్నాయి. ‘భూగర్భ జలమట్టం బాగా పెరగాలంటే మంచి వర్షాలు కురిసి వాగులు వంకలు పొంగి ప్రవహించాలి. ఇలా అయితేనే నీటి మట్టం పైకి వస్తుంది’ అని భూగర్భ జల రంగానికి చెందిన నిపుణుడు ‘సాక్షి’తో చెప్పారు. ‘ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా వస్తాయని, వర్షపాతం కూడా సాధారణం (93 శాతం మాత్రమే )గానే ఉంటుందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇలాగైతే కష్టమే’ అని ఒక ఉన్నతాధికారి నిరాశను వ్యక్తం చేశారు. 

తాగునీటికీ కటకట
రాయలసీమతోపాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోనూ చాలాచోట్ల తాగునీటికి కటకట ఏర్పడింది. గ్రామాల్లో తాగునీరు అందించే బోర్లు ఇంకిపోయి నీరు రావడంలేదు. దీంతో చాలా గ్రామాల వారు సుదూర ప్రాంతాల్లోని వ్యవసాయ బావుల నుంచి బిందెల్లో నీరు తెచ్చుకుంటున్నారు. మరికొందరు ఎడ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా డ్రమ్ములతో నీరు తెచ్చుకుంటున్నారు. కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో దారుణమైన కరువు పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎనిమిది వేలకుపైగా గ్రామాల్లో ప్రజలు తాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నట్లు అంచనా. 

జాడలేని పశు సంరక్షణ కేంద్రాలు
మూగ జీవాలు మేత, నీరులేక అల్లాడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పశు సంరక్షణ కేంద్రాలను ప్రభుత్వంఏర్పాటుచేసి మేత, నీరు అందించే చర్యలు తీసుకోవాలి. అయితే, ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. రైతులు వరిగడ్డి కొనుక్కోవాలంటే ట్రాక్టరు రూ.15 వేలకు పైగా అవుతోంది. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయినందున దానిని కొనే స్థితిలో చాలామంది రైతులు లేరు. ప్రభుత్వం చొరవ తీసుకుని గడ్డి, దాణా కొనుగోలు చేసి రైతులకు సరఫరా చేయాల్సి ఉన్నా దానిపై దృష్టి పెట్టడంలేదు. దీంతో రైతులు దిక్కుతోచక పశువులను కబేళాలకు ఇచ్చేస్తున్నారు. నిత్యం సీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి బెంగళూరు, చెన్నై నగరాల కబేళాలకు వేలాది పశువులు తరలిపోతున్నాయి. 

ప్రకాశంలో 56 శాతం లోటు వర్షపాతం
గత ఏడాది జూన్‌ నుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో సగటున 34.1 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లాలో సాధారణంతో పోల్చితే 56.7 శాతం, నెల్లూరులో 54.6 శాతం, వైఎస్సార్‌ జిల్లాలో 55.9 శాతం, చిత్తూరులో 46.2, కర్నూలులో 48.1, అనంతపురంలో 43.1 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. వరుసగా ఐదేళ్లపాటు ఇలా సాధారణం కంటే తక్కువ వర్షాలు కురవడంవల్ల భూగర్భ జలమట్టం దారుణంగా పడిపోయింది. చాలా నదులు ఎండిపోయాయి. డ్యామ్‌లలో నీరు డెడ్‌ స్టోరేజికి చేరింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top