ఎలా నమ్మించాలి? | How to make believe? | Sakshi
Sakshi News home page

ఎలా నమ్మించాలి?

Apr 15 2015 2:42 AM | Updated on Nov 9 2018 5:52 PM

శేషాచలం అడవుల్లో పోలీసుల కాల్పుల్లో తమిళనాడు కూలీలు చనిపోయిన ఘటన నుంచి ఎలా బయటపడాలో అర్థంగాక ప్రభుత్వం సతమతమవుతోంది.

చనిపోయిన వారు స్మగ్లర్లే అని నమ్మించేందుకు పోలీసుల యత్నాలు
తమిళనాడుకు వెళ్లిన ప్రత్యేక బృందాలకు నిరాశ
మూడు రోజులుగా తిరుపతిలో ఉన్నతాధికారుల సమావేశాలు

 
సాక్షి ప్రతినిధి, తిరుపతి : శేషాచలం అడవుల్లో పోలీసుల కాల్పుల్లో తమిళనాడు కూలీలు చనిపోయిన ఘటన నుంచి ఎలా బయటపడాలో అర్థంగాక ప్రభుత్వం సతమతమవుతోంది. అటు జనాన్ని, ఇటు తమిళనాడు సర్కారును నమ్మించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇక ఏ మార్గంలో నమ్మించాలా అనే దానిపై అన్వేషణ ప్రారంభించింది. దీనిపై ఉన్నతాధికారులు మూడు రోజులుగా తిరుపతిలో కసరత్తు చేస్తున్నారు.

తమిళనాడు కూలీల వ్యవహారం జాతీయ మానవ హక్కుల సంఘం వరకు చేరడం, కేంద్ర ప్రభుత్వమూ దీనిపై వివరాల సేకరణకు దిగడంతో రాష్ట్ర ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. మృతులు పడివున్న తీరు, అక్కడ లభించిన పాత ఎర్రచందనం దుంగలు, ఎర్రకూలీలను అదుపులోకి తీసుకున్న సమయంలో అదే బస్సులో ఉన్న సాక్షులు చెప్పిన వివరాలు పోలీసు అధికారులను, ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేశాయి. మరోవైపు తమిళనాడు నుంచి రోజురోజుకూ నిరసనలు తీవ్రమవుతున్నాయి. సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యు ల ఆస్తులు, అక్కడి తెలుగువారి వ్యాపార సముదాయాలపై దాడులు సాగుతూనే ఉన్నాయి.

ఈ గండం నుంచి ఏదో ఒక విధంగా బయట పడేయాలని ప్రభుత్వం ఓ పోలీసు పెద్దను ఆదేశించిందని సమాచా రం. అటవీ శాఖ అధికారులు అడవుల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లోని పాత ఫుటేజీలను కనీసం తేదీలు మార్చకుండానే కొన్ని మీడి యా సంస్థలకు ఇచ్చి మరో తప్పు చేశారని పోలీసు ఉన్నతాధికారు లు ఆగ్రహంగా ఉన్నారు. కూలీలు ఎన్‌కౌంటర్‌లోనే చనిపోయారనే వాదనను సమర్థించేలా కొన్ని పత్రికల్లో కథనాలు రాయించే పనిని ఓ మాజీ పోలీస్ పీఆర్‌వోకు అప్పగించారు. ఇది కూడా అంతగా ఫలితమివ్వలేదని పోలీసు పెద్దలు నిర్ణయానికి వచ్చారు. చనిపోయిన వారంతా స్మగ్లర్లే అంటూ నేరుగా మంత్రుల ద్వారా చెప్పించే ప్రయత్నం చేశారు. ఇది బెడిసి కొట్టడంతో ఏకంగా పోలీస్ అధికారుల సంఘం సహాయాన్ని అర్థించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మూడు రోజులుగా..
శేషాచలం అడవుల్లో ఎన్‌కౌంటర్ సీన్ హైదరాబాద్‌కు చేరింది. డీఐ జీ, ఐజీ స్థాయి అధికారులే వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు.  ఎదురు కాల్పుల్లోనే కూలీలు మరణించారని నమ్మించడానికి ఎప్పటికప్పుడు కొత్తగా వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగానే తిరుపతిలో ఐజీ గోపాలకృష్ణ, డీఐజీలు బాలకృష్ణ, కాంతారావు, సీఐడీఎస్పీ అమ్మిరెడ్డి, అర్బన్ ఎస్పీ గోపీనాథ్ జెట్టి, చిత్తూరు ఎస్పీ శ్రీనివాసులు, ఈ కేసు విచారణాధికారి ఏఎస్పీ త్రిమూర్తులు, డీఎస్పీలు శ్రీనివాసులు, ఈశ్వర్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డితో పాటు కొంత మంది సీఐలు, ఎస్‌ఐలతో సమాలోచనలు జరుపుతున్నట్లు సమాచారం.

ఎదురు దెబ్బ..
ఎన్‌కౌంటర్ ఘటనలో ప్రభుత్వానికి షాక్ మీద షాక్ తగులుతోంది. ఘటనా స్థలిలో పోలీసులు 27సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కాల్ డేటా ఆధారంగా వివరాలు బయటకు తీయాలని ఓ పోలీసు పెద్దాయన ఆదేశాలు జారీచేశారు. మృతులంతా కరుడు కట్టిన స్మగ్లర్లే అంటూ వచ్చిన తప్పుడు సమాచారానికి మురిసిపోయారు. ప్రత్యేకంగా రెండు బృందాలను విచారణ కోసం తమిళనాడుకు పంపించారు. అక్కడ నుంచి అనుకున్న మేర ఫలితం రాకపోవడంతో పాటు సహాయ నిరాకరణ ఎదురవడంతో మరో బృందాన్ని రహస్య విచారణ కోసం పంపారు.

తీరా కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మృతుల్లో ఒకరికి అక్కడి ఓ రాజకీయ పార్టీతో సంబంధం ఉందని తెలుసుకున్నారు. ఇంత హంగామా చేసి తెలుసుకున్నది ఇంతేనా అంటూ ప్రభుత్వ పెద్దలు ఉసూరుమన్నారట. సర్కారును, కాల్పుల్లో పాల్గొన్న పోలీసులను బయట పడేయడానికి ఏదో బలమైన ఆధారం సంపాదించడానికి మరోసారి లోతుగా విచారించాలని ఆదేశించినట్లు వినికిడి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement