ఇష్టంలేని వివాహం చేసుకున్న కుమార్తెపేరు లేకుండా జారీఅయిన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ రెవెన్యూ అధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు.
- కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరణ
- వ్యవహారంపై ఆర్డీవో సీరియస్
యలమంచిలి : ఇష్టంలేని వివాహం చేసుకున్న కుమార్తెపేరు లేకుండా జారీఅయిన వారసత్వ ధ్రువీకరణ పత్రాన్ని రద్దుచేస్తూ రెవెన్యూ అధికారులు బుధవారం నిర్ణయం తీసుకున్నారు. కొత్తపేటకు చెందిన బీఎస్‌ఎన్‌ఎల్ ఉద్యోగి జోగా నాగరాజు మృతి చెందడంతో యలమంచిలి తహశీల్దార్ కార్యాలయం నుంచి వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరు చేశారు.
అందులో రెండో కుమార్తె కొయ్య మంగసరస్వతి పేరు లేదు. తండ్రి నాగరాజు మృతి అనంతరం తాను తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లి అబ్జెక్షన్ తెలుపుతూ దరఖాస్తు చేసినా ఇక్కడ కార్యాలయం నుంచి తన పేరు లేకుండా సర్టిఫికెట్ మంజూరు చేయడంపై బాధితురాలు మంగసరస్వతి మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలో అధికారులను నిలదీసిన విషయం విదితమే.
ఈ వ్యవహారంపై అనకాపల్లి ఆర్డీవో వసంతరాయుడు యలమంచిలి తహశీల్దార్ రాణీఅమ్మాజీతో మాట్లాడారు. సర్టిఫికెట్ ఎలా మంజూరు చేశారని అడిగారు. ఎన్నికల విధుల సమయంలో అప్పటి తహశీల్దార్ శ్రీనివాసరావు హయాంలో సర్టిఫికెట్ జారీ జరిగినట్టు రాణీఅమ్మాజీ ఆర్డీవోకు వివరించారు. ఈ సందర్భంగా ఆర్డీవో వసంతరాయుడు కింది స్థాయి రెవెన్యూ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈ వ్యవహారంపై విచారణ జరిపి తనకు నివేదిక పంపాలని తహశీల్దార్‌ను ఆర్డీవో ఆదేశించారు. ఈ మేరకు ఆమె బుధవారం జోగా నాగరాజు భార్య జయమ్మ, కుమార్తెలు మంగసరస్వతి, రాజ్యం ఆదిలక్ష్మిలను కార్యాలయానికి పిలిపించారు. వారి నుంచి వాంగ్మూలాలు సేకరించారు. రెండో కుమార్తె సరస్వతి పేరు లేకుండా సర్టిఫికెట్ జారీ కావడం వెనుక జయమ్మ ఇచ్చిన వాంగ్మూలమే కారణమని తహశీల్దార్ చెప్పారు. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే సమాచారాన్ని బీఎస్‌ఎన్‌ఎల్ ఉన్నతాధికారులకు పంపుతున్నట్టు తహశీల్దార్ చెప్పారు.


