సమాజహితం కోసమే వేదం


రాజమహేంద్రవరం కల్చరల్ : వేదం సమాజ హితం కోసమేనని, వేదవాజ్ఞ్మయమంతా విశ్వాసానికి సంబం ధించిందని, లౌకిక నిరూపణలకు అందనిది వేదసాహిత్యమని స్వాధ్యాయరత్న, వేదార్ధప్రకాశక, వేదవిద్యానిధి, గుళ్లపల్లి సీతారామచంద్ర ఘనాపాఠి అన్నారు. వేదశాస్త్రాలకు ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా న్యూఢిల్లీకి చెందిన ‘ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ సొసైటీ ఆయనకు ‘భారతజ్యోతి’ అవార్డును అందజేసింది. ఈనేపథ్యంలో ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.  

 

 నిరూపణకు లొంగదు.. ఇక్కడ విశ్వాసమే ప్రధానం

 ‘90 ఏళ్ల వృద్ధుడు పుష్కరాల్లో తీర్థ విధులు నిర్వహిస్తున్నాడు, తనపెద్దలకు ఉత్తమలోకాలు కలగాలని. తీర్థస్నానం చేస్తున్నాడు. పుష్కర స్నానఫలితం అతనికి కలిగిందో లేదో! నిరూపించలేం. ఇక్కడ నమ్మకమే ప్రధానం.

 

 వేదం సమాజహితం కోసమే

 వేదం సమాజ హితం కోసమే. ఆధునిక సమాజం శాస్త్రసాంకేతిక రంగాల్లో ఎన్ని పరుగులు తీస్తున్నా, ఆధ్యాత్మికత లేకపోతే, ఆ జీవితం సంపూర్ణం కాదు. సూరి భగవంతం వంటి ప్రఖ్యాత సైంటిస్టులు ఈ విషయాన్ని అంగీకరించారు.మన సంస్కృతిని వదిలేస్తే, మిగిలినవి కూడా నశించి పోతాయి. సామవేద విభాగానికి వేయి ప్రధానశాఖలు ఉండేవి. ప్రస్తుతం మూడే మిగిలాయి.

 

 టీటీడీ వేదపారాయణ పథకం సమర్థంగా అమలు చేయాలి

 తిరుమల తిరుపతి దేవస్థానం వేద పారాయణ పథకాన్ని సమర్థంగా అమలు చేయాలి. గ్రామగ్రామాన ఆలయాల్లో కొంతసేపు వేదపారాయణ జరగాలనేది ఈ పథక లక్ష్యం. 2012 తరువాత వేదపండితుల నియామకాలు లేవు. సమాజంలో సుఖశాంతులు వెల్లివిరియాలంటే, ఇటువంటి పథకాలు చాలా అవసరం.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top