వచ్చే ఏడాది జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేదీల్ని ఖరారు చేసింది.
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తేదీల్ని ఖరారు చేసింది. తితిదే పంచాం గాన్ని ప్రామాణికంగా తీసుకుని జూలై 14న ఉదయం 6.28 గంటలకు పుష్కరాలు ప్రారంభించడానికి ముహూర్తాన్ని ఖరారు చేసినట్టు ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పుష్కరాల్ని ప్రారంభింపజేసేందుకు మంత్రివర్గ ఉప సంఘం తీర్మానించింది. శుక్రవారం సచివాలయంలో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో సబ్ కమిటీ భేటీ జరిగింది. ఈ వివరాలను కమిటీ సభ్యులు పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత మీడియాకు తెలిపారు. రూ.900 కోట్లతో పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రులు తెలిపారు.
ఎన్టీఆర్‌కు ప్రాంతీయత ఆపాదిస్తారా?: జాతీయ స్థాయి నాయకుడైన ఎన్టీఆర్‌కు ప్రాంతీయత ఆపాదించడం సరికాదని మంత్రి మాణిక్యాలరావు అభిప్రాయపడ్డారు. శంషాబాద్ విమానాశ్రయం డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టడానికి సంబంధించిన వివాదంపై ఆయన మాట్లాడారు. కాగా తన కొడుక్కి తారక రామారావు అని పేరు పెట్టుకున్న కేసీఆర్ ఇప్పుడు ఆయన పేరు మారుస్తారో, కొడుకునే మారుస్తారో.. ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని మంత్రి సుజాత ఎద్దేవా చేశారు.