ఇప్పటివరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే కిడ్నీ రోగులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యసేవలను ఉచితంగా అందించారు.
గుంటూరు : ఇప్పటివరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే కిడ్నీ రోగులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యసేవలను ఉచితంగా అందించారు. ఇక నుంచి రేషన్‌కార్డు లేకపోయినా ఉచితంగా డయాలసిస్ వైద్యం అందిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గురువారం జీజీహెచ్‌కు వచ్చారు. జీజీహెచ్ కిడ్నీ వైద్యులు గొంది శివరామకృష్ణ, డేగల వాణిలు రెండు హీమోడయాలసిస్ మెషీన్లు కావాలని కోరగా వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. తక్షణమే జీజీహెచ్‌కు డయాలసిస్ మెషీన్లు వచ్చేలా చేస్తామని హామీఇచ్చారు.
ఇప్పటివరకు పీపీపీ విధానంలో బిబ్రాన్ కంపెనీవారు జీజీహెచ్‌కు వచ్చే కిడ్నీరోగులకు తెల్లరేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు లేని వారు విజయవాడలోని సీఎం రిఫరల్ కేంద్రానికి వెళ్లి అనుమతి పత్రం తెచ్చుకుంటే డయాలసిస్ చేసేవారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు విజయవాడ వెళ్లి రావడం ఎంతో కష్టంగా ఉండడంతో జీజీహెచ్ నెఫ్రాలజీ వైద్యులు తమ విభాగానికి డయాలసిస్ మెషీన్లు ఇస్తే రోగులు ఇబ్బంది పడకుండా డయాలసిస్ చేస్తామని తెలిపారు.
అంతేకాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరగుతున్న నేపథ్యంలో నెఫ్రాలజీ విభాగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పనిలేకుండా ప్రభుత్వం కొనుగోలుచేసిన మెషీన్లు ఉంటే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చనే విషయాన్ని వివరించడంతో డీఎంఈ డాక్టర్ వేణుగోపాలరావు కిడ్నీ డే సందర్భంగా ప్రకటన చేసి కిడ్నీ రోగులకు తీపికబురు అందించారు. ఈ నెలాఖరులోగా డయాలసిస్ మెషీన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మిషన్లు రాగానే అందరికీ ఉచిత డయాలసిస్ వైద్యం అందుబాటులోకి వస్తుంది.