breaking news
Free dialysis
-
39 ప్రభుత్వాస్పత్రుల్లో డయాలసిస్ సేవలు
- 268 సింగిల్ యూజ్డ్ డయాలసిస్ యూనిట్ల కొనుగోలు పూర్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కిడ్నీ రోగులకు ఉపశమనం కలిగించే వార్త ఇది. ఇప్పటివరకు రాజధాని, నగర ప్రాంతాల్లోనే ఉన్న రక్తశుద్ధి కేంద్రాలను ఇకపై స్థానికంగానూ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రంలోని 39 ప్రభుత్వాస్పత్రుల్లో దేశంలోనే తొలిసారిగా 268 సింగిల్ యూజ్డ్ డయాలసిస్ యంత్రాలను ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే ఈ పరికరాల కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఈ మేరకు సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో ఈ డయాలసిస్ యూనిట్లను నిర్వహించనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద డయాలసిస్ అవసరమైన రోగులందరికీ ఉచితంగా ఈ సేవలను అందించనున్నారు. ఈ పరికరాల నిర్వహణను డి మెడ్ డయలైజ్ హిజ్మెట్లరీ అనే సంస్థ చేపట్టనుంది. ఆరోగ్యశ్రీ నిధుల నుంచి ప్రభుత్వం ఒక్కో డయాలసిస్‌కు రూ.1,375 చొప్పున చెల్లించనుంది. వారసత్వంతోపాటు నీటి కాలుష్యం, మారిన ఆహార అలవాట్ల వల్ల మూత్రపిండాలు చెడిపోవడం పెరుగుతోంది. ఆరోగ్యశ్రీ కింద రక్తశుద్ధి చేసుకునే రోగులు రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 10 వేల మంది ఉన్నారు. ఏటా 1,500 మంది కిడ్నీ రోగులు కొత్తగా నమోదవుతున్నారు. దీంతో డయాలసిస్ సేవల కేంద్రాల అవసరం పెరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లోని ప్రధాన వైద్యశాలల్లో మాత్రమే డయాలసిస్ యూనిట్లు ఉండేవి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నిజామాబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట, మహబూబ్‌నగర్ ఆస్పత్రుల్లోనూ కొత్తగా డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటికి అదనంగా ఇప్పుడు కొత్తగా 39 ఆస్పత్రులలో 268 యూనిట్లను, ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోనే తొలిసారి దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వ వైద్యశాలల్లో సింగిల్ యూజ్డ్ డయాలసిస్ కేంద్రా లను నెలకొల్పుతున్నాం. ఆరో గ్యశ్రీ పరిధిలో ఉన్న రోగులకు ఉచితంగా త్వరలోనే ఈ సేవ లు అందుబాటులోకి వస్తాయి. సింగిల్ యూజ్డ్ డయాలసిస్ వల్ల ఇన్ఫెక్షన్ సమస్యలు ఉండవు. – సి.లక్ష్మారెడ్డి, వైద్య ఆరోగ్య మంత్రి -
జీజీహెచ్‌లో త్వరలో ఉచితంగా డయాలసిస్
గుంటూరు : ఇప్పటివరకు తెల్లరేషన్ కార్డు ఉంటేనే కిడ్నీ రోగులకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో డయాలసిస్ వైద్యసేవలను ఉచితంగా అందించారు. ఇక నుంచి రేషన్‌కార్డు లేకపోయినా ఉచితంగా డయాలసిస్ వైద్యం అందిస్తారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ తన్నీరు వేణుగోపాలరావు వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా గురువారం జీజీహెచ్‌కు వచ్చారు. జీజీహెచ్ కిడ్నీ వైద్యులు గొంది శివరామకృష్ణ, డేగల వాణిలు రెండు హీమోడయాలసిస్ మెషీన్లు కావాలని కోరగా వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటన చేశారు. తక్షణమే జీజీహెచ్‌కు డయాలసిస్ మెషీన్లు వచ్చేలా చేస్తామని హామీఇచ్చారు. ఇప్పటివరకు పీపీపీ విధానంలో బిబ్రాన్ కంపెనీవారు జీజీహెచ్‌కు వచ్చే కిడ్నీరోగులకు తెల్లరేషన్ కార్డు లేదా ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నవారికి మాత్రమే డయాలసిస్ చేస్తున్నారు. తెల్లరేషన్‌కార్డు లేని వారు విజయవాడలోని సీఎం రిఫరల్ కేంద్రానికి వెళ్లి అనుమతి పత్రం తెచ్చుకుంటే డయాలసిస్ చేసేవారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు విజయవాడ వెళ్లి రావడం ఎంతో కష్టంగా ఉండడంతో జీజీహెచ్ నెఫ్రాలజీ వైద్యులు తమ విభాగానికి డయాలసిస్ మెషీన్లు ఇస్తే రోగులు ఇబ్బంది పడకుండా డయాలసిస్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరగుతున్న నేపథ్యంలో నెఫ్రాలజీ విభాగంలో ప్రైవేటు భాగస్వామ్యంతో పనిలేకుండా ప్రభుత్వం కొనుగోలుచేసిన మెషీన్లు ఉంటే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించవచ్చనే విషయాన్ని వివరించడంతో డీఎంఈ డాక్టర్ వేణుగోపాలరావు కిడ్నీ డే సందర్భంగా ప్రకటన చేసి కిడ్నీ రోగులకు తీపికబురు అందించారు. ఈ నెలాఖరులోగా డయాలసిస్ మెషీన్లు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. మిషన్లు రాగానే అందరికీ ఉచిత డయాలసిస్ వైద్యం అందుబాటులోకి వస్తుంది.