చిన్న కారణం.. నిండు జీవితం

four students' suicide with  pressure - Sakshi

తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల్లో నలుగురు విద్యార్థుల ఆత్మహత్య

చదువు ఒత్తిడితో ఒకరు..

అధ్యాపకుల తీరుతో మరొకరు..

సాక్షి, నెట్‌వర్క్‌: చిన్న చిన్న కారణాలకు నిండు జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఇంట్లో గొడవలతో ఒకరు, అధ్యాపకుల తీరుతో మరొకరు, చదువు ఒత్తిడితో ఇంకొకరు.. కారణాలేవైతేనేమి చిన్న విషయాలకే మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకుంటున్నారు. బుధ, గురువారాల్లో తెలుగు రాష్ట్రాల్లో నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

హైదరాబాద్‌లో ఇంటర్‌ విద్యార్థిని..
నిజామాబాద్‌ జిల్లా రుద్రూర్‌ మండలం రాణంపల్లి గ్రామానికి చెందిన తోట సంయుక్త (17).. హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలో ఉన్న శ్రీచైతన్య మెడికల్‌ క్యాంపస్‌లో నీట్‌ మెడిసిన్‌ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. చదువు పట్ల ఒత్తిడికి గురైన సంయుక్త.. బుధవారం రాత్రి హాస్టల్‌ రూమ్‌లో చున్నీతో సీలింగ్‌ ప్యాన్‌కు ఉరేసుకుంది. మాదాపూర్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. చదువులో ముందుండే విద్యార్థిని, కళాశాల యాజమాన్యం ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకుందంటే నమ్మలేక పోతున్నామని బంధువులు అన్నారు.

విజయనగరంలో పదో తరగతి విద్యార్థిని
విజయనగరం జిల్లా జియ్యమ్మవలస మండలం శిఖబడి గ్రామానికి చెందిన మాలతి (15).. బొమ్మిక జగన్నాథపురం ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులు నిత్యం గొడవ పడుతుండటంతో మనస్తాపం చెందిన మాలతి.. గురువారం పురుగు మందు తాగింది. చుట్టుపక్కల వారు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారొచ్చి పరిశీలించే సరికి మృతి చెందింది.   

శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీ విద్యార్థి..
శ్రీకాకుళం జిల్లా నూజివీడు ట్రిపుల్‌ ఐటీ కళాశాల విద్యార్థి పూర్ణలక్ష్మీ నరసింహమూర్తి బుధవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బట్టలు ఆరేసుకునే ప్లాస్టిక్‌ తాడుతో ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయాడని అదే గదిలో ఉంటున్న విద్యార్థులు తెలిపారు. మరోవైపు అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని గాంధీనగర్‌ హరిజనవాడకు చెందిన పదో తరగతి విద్యార్థిని జి.పూజిత (15) బుధవారం అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తండ్రి మల్లికార్జున ఫిర్యాదు మేరకు ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తూర్పు గోదావరిలో బీటెక్‌ విద్యార్థి..
తూర్పుగోదావరి జిల్లా అమలాపురానికి చెందిన బి.భానుకృష్ణ (21) కలికిరిలోని జేఎన్‌టీయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో మెకానికల్‌ చివరి సంవత్సరం చదువుతున్నాడు. క్లాస్‌ రెప్రజెంటేటివ్‌గా వ్యవహరిస్తున్న భాను.. విద్యార్థుల మార్కుల విషయంలో అధ్యాపకులు కె.రాజు, అశోక్‌  ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని గమనించాడు. విషయాన్ని మెకానికల్‌ విభాగాధిపతి శ్రీనివాసన్‌కు వివరించగా ఆయన పట్టించుకోలేదు. దీంతో మనస్తాపం చెందిన భాను.. బుధవారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. విద్యార్థులు గమనించి హుటాహుటిన కలికిరిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top