తాడేపల్లిలో పేలుడు కలకలం!

Firework Explosion In Tadepalli - Sakshi

పేలుడుకు నేల టపాకాయల తయారీయే కారణమని పోలీసుల నిర్ధారణ

రెవెన్యూ, పోలీసుల ఆధ్వర్యంలో తనిఖీలు

గాయపడిన యువతి ఆస్పత్రికి తరలింపు

సాక్షి, తాడేపల్లి: తాడేపల్లి పట్టణ పరిధిలోని బ్రహ్మానందపురం ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఓ నివాసంలో పేలుడు జరగడంతో ఆ నివాసం రేకులు లేచి చుట్టుపక్కల ప్రాంతాల్లోని ఇళ్లమీద పడ్డాయి. ఒక్కసారిగా బాంబు పేలిందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే... బ్రహ్మానందపురంలోని బొగ్గిళ్లల్లో బాపట్ల శివశంకర్‌ భార్య, ముగ్గురు కుమార్తెలతో నివాసం ఉంటున్నారు. శివశంకర్‌ తాపీ పని చేస్తుండగా, ఇంట్లో కుటుంబసభ్యులు నేల టపాకాయలు తయారు చేస్తూ తమ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.

ఈ మధ్య కాలంలో బాపట్ల శివశంకర్, భార్య మణికుమారికి మధ్య గొడవలు జరగడంతో ఆమె చిన్న కుమార్తెను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటినుంచి నేలటపాకాయలను చుట్టే బాధ్యతను రెండో కుమార్తె బాపట్ల ఎస్తేరురాణి తీసుకుంది. తండ్రి తాపీ పనికి వెళ్లిన తర్వాత నేల టపాకాయలు తయారు చేయడానికి అవసరమైన పేలుడు పదార్థం, రాళ్లు, మిగతా సామగ్రిని దగ్గరపెట్టుకొని నేలటపాకాయలు చుడుతుండగా, ఒత్తిడి ఎక్కువై పేలుడు సంభవించింది. దీంతో ఎస్తేరురాణి ఒళ్లంతా రక్తంతో రోడ్డు మీదకు వచ్చి, ఏడుస్తుండడంతో స్థానికులు ఆమెను వైద్యం నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మొదట బంధువులు గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఎస్తేరురాణికి గాయలైనట్లు తెలియజేశారు.

పేలుడు విషయం ఆనోటా ఈనోటా తాడేపల్లి పోలీసుల చెవిన పడడంతో సీఐ అంకమరావు నేతృత్వంలో ఎస్సై వినోద్‌కుమార్‌ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, బాంబు కాదు... నేల టపాకాయలు ఎటువంటి అనుమతులు లేకుండా తయారు చేయడం వల్లనే ఈ సంఘటన జరిగిందని నిర్ధారించారు. పోలీసులు అక్కడ ఉండగానే స్థానికంగా ఉండే ఓ వ్యక్తి రెండు ప్లాస్టిక్‌ గోనె సంచుల్లో నేలటపాకాయలు తీసుకొని పారిపోతుండగా ఎస్సై వినోద్‌కుమార్‌ వెంటపడ్డారు. ఆ వ్యక్తి నేల టపాకాయలను అక్కడ పడేసి పరారయ్యాడు. జరిగిన సంఘటనపై గుంటూరు నార్త్‌ జోన్‌ డీఎస్పీ దుర్గాప్రసాద్‌ సంఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. అనంతరం రెవెన్యూ, పోలీసులు పరిసర ప్రాంతాల్లో తనిఖీలు ప్రారంభించారు.

తీవ్రంగా గాయపడిన ఎస్తేరురాణి

గాయపడిన ఎస్తేరురాణికి గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స చేస్తున్న వైద్య సిబ్బంది

నేలటపాకాయలు చుడుతున్న ఎస్తేరురాణి తీవ్రంగా గాయపడింది. కళ్ల నరాలు దెబ్బతినడంతో పాటు ముఖంమీద, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గుంటూరు ప్రభుత్వ వైద్యులు రెండు, మూడు రోజులు గడిస్తే చూపు వచ్చే అవకాశం ఉందని, మోకాలుకు మాత్రం శస్త్రచికిత్స చేయాలని తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top