కళ్లు తెరవని పోలీసులు !

కళ్లు తెరవని పోలీసులు ! - Sakshi


 రాజాం: జిల్లాలో బాణసంచా అక్రమ తయారీ కేంద్రాలు చాలా ఉన్నా వీటిని నియంత్రించే విషయంలో పోలీసులు కళ్లు తెరవలేదనే విమర్శలు జోరుగా వస్తున్నాయి. ప్రధానంగా రాజాం నియోజకవర్గంలో పలుచోట్ల మందుగుండు సామాగ్రి అక్రమ నిల్వలున్నట్లు గుర్తించడంలో పోలీసుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఇందుకు ఆదివారం వంగర మండలం కొత్త మరువాడ బాణసంచా పేలుళ్లను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. పెళ్లిల్లు, ఇతరత్రా సంబరాలకు మందుగుండు సామగ్రిని కాలుస్తుంటారు. దీంతో వీటికి మంచి గిరాకీ ఏర్పడింది. గ్రామాల్లో మందుగుండు నిల్వలు ఉంచుకొని బాణసంచా తయారు చేస్తున్న కొంతమందికి ఇది సీజనల్ వ్యాపారం.

 

 పతీ మండలంలో బాణసంచా అక్రమంగా తయారీ చేసే వారు ఉన్నారు. వంగర మండలంలో కొన్ని గ్రామాలు దీనికి ప్రసిద్ధి. బాణసంచాను అనుమతిలేకుండా తయారు చేస్తారనే విషయం బహిరంగ రహస్యం. కిలోల కొద్దీ పేలుడు పదార్థాలను నిల్వ ఉంచడం, కావాల్సిన వారికి తయారు చేసి విక్రయించడం వంటి పనులను చాలామంది జీవనాధారంగా చేసుకున్నారు. ఇలాంటి వారి కారణంగానే ప్రమాదాలు సంభవించి ప్రాణాల మీదకు వస్తున్నప్పటికీ  అధికారులు పట్టించుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు నెలలో జి.సిగడాం మండలం పెనసాం గ్రామం లో  బాణసంచా అక్రమ తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు చనిపోగా, మరికొంతమంది గాయపడ్డారు.

 

 అప్పట్లో హడావుడి చేసిన అధికార యంత్రా ం ఆ తరువాత పట్టించుకోవడం మానేశారు. కొత్తమరువాడలో కూడా 2001లో బాణసంచా తయారీ కేంద్రంలో పేలుళ్లు సంభవించినట్టు స్థానికులు చెబుతున్నారు. సుమారు ఏడేళ్ల క్రితం శ్రీకాకుళం పట్టణంలో కూడా భారీ బాణసంచా విస్పోటనం సంభవించి పదుల సంఖ్యలో ప్రాణాలు కలిసిపోయాయి. ఇలా జిల్లాలో ఏదో ఒకమూల బాణసంచా పేలుతున్నా అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడం ఆందోళనకుగురి చేస్తోంది. ఆదివారం నాటి ఘటనతోనైనా పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి బాణసంచా అక్రమ తయారీదారుల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.

 

 నిఘా పెంచుతాం

  మందుగుండు సామాగ్రి అక్రమ నిల్వలపై ఇప్పటికే నిఘా వేసి నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశాం. పలువురిపై కేసులు నమోదు చేశాం. అయినప్పటికీ అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీరిపై మరింత నిఘా పెంచి చర్యలు తీసుకుంటాం        - ఎం.వి.వి.రమణమూర్తి, సీఐ, రాజాం

 

 సమాచారం వస్తే చర్యలు

  మందుగుండు సామాగ్రి అక్రమంగా నిల్వ ఉంచేవారిపై స్థానికులు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటాం. మందుగుండు నిల్వలపై ముందుగా లెసైన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే కేసులు తప్పవు.

 - పక్కి చంద్రమౌళి, ఫైర్ ఆఫీసర్, రాజాం

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top