వేకనూరులో అగ్ని ప్రమాదం

Fire Accident in Krishna - Sakshi

రూ.1.50 లక్షల ఆస్తి నష్టం .. తప్పిన ప్రాణ హాని

చిన్నారి మేల్కొని ఏడ్వడంతో అందరూ సురక్షితం

కృష్ణాజిల్లా, వేకనూరు (అవనిగడ్డ) : మండల పరిధిలోని వేకనూరులో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో పెను ప్రమాదం తప్పింది. పెళ్లి పనులు చేసి అలసిపోయి గాఢ నిద్రలో ఉండగా, మూడేళ్ళ చిన్నారి మేల్కొని ఏడ్వడంతో అందరూ బయటకు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ ప్రమాదంలో రూ.1.50 లక్షల ఆస్తి నష్టం సంభవించగా, కొద్ది రోజుల్లో వివాహ వేడుక జరగాల్సిన ఆ ఇంట్లో సర్వస్వం కాలి బూడిదవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వివరాలిలా ఉన్నాయి. వేకనూరులో మాదివాడ గోపాలరావుకు చెందిన నాలుగు దూలాల రాతి గోడల తాటాకింటికి ఆదివారం అర్ధరాత్రి విద్యుత్‌ షార్క్‌ సర్క్యూట్‌ వల్ల మంటలు వ్యాపించాయి.

ఆ పొగకు ఊపిరాడక గోపాలరావు పెద్ద కుమారుడి మూడేళ్ళ కుమార్తె వెనిషాశ్రీ మేల్కొని ఏడుపు అందుకుంది. దీంతో మిగిలిన వారంతా మేల్కొన్నారు. అయితే, అప్పటికే పైకప్పుకు మంటలు, పొగ వ్యాపించడంతో బయటకు పరుగులు తీశారు. ప్రమాద సమయంలో ఆ ఇంట్లో ఆరుగురు నిద్రిస్తున్నారు. కొద్ది సేపు ఆలస్యమైనా పెను ప్రమాదం జరిగి ఉండేది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక అధికారి వి. అమరేశ్వరరావు సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. ఫిబ్రవరి 8వ తేదీన ఈ ఇంట్లో గోపాలరావు చిన్న కుమారుడి వివాహం జరగాల్సి ఉంది. పెండ్లి కోసం భద్రపరిచిన రూ.30 వేల నగదు, మూడు సవర్ల బంగారం అగ్నికి ఆహుతవ్వడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ప్రమాదంలో సర్వస్వం కోల్పోయిన కుటుంబ సభ్యులకు రెవెన్యూ తరఫున 20 కిలోల బియ్యాన్ని ఆర్‌ఐ ప్రదీప్, వీఆర్వో నాగమణి అందజేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top