చినుకు లేక.. చింత.. | Farmers worried about rains for Kharif | Sakshi
Sakshi News home page

చినుకు లేక.. చింత..

Jun 16 2014 2:40 AM | Updated on Oct 1 2018 6:38 PM

వర్షాలు ఆలస్యం కావడంతో.. రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. జూన్ రెండో వారం గడిచినా..

* వర్షాలు ఆలస్యమవడంతో అన్నదాతల్లో ఆందోళన
* ఖరీఫ్‌లో 40 లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి వీలుగా  సోయాబీన్, వరి, పత్తి విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసిన అధికారులు
* వర్షాలు లేక తగ్గిన కొనుగోళ్లు
* జూలై 10లోగా ఆశించిన వర్షాలు రాకుంటే... ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
* వర్షాధార పంటలో పత్తిదే అగ్రస్థానం

సాక్షి, హైదరాబాద్: వర్షాలు ఆలస్యం కావడంతో.. రైతుల్లో ఆందోళన మొదలవుతోంది. జూన్ రెండో వారం గడిచినా.. వర్షాల సూచన లేకపోవడం, ఎండ, వడగాల్పుల తీవ్రత అధికంగా ఉండడం వారి ఆందోళనను తీవ్రం చేస్తోంది. దుక్కిదున్ని పంటకు సిద్ధం చేయూల్సిన సవుయుంలో చినుకు కోసం ఆకాశంవైపు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సీజన్‌లో తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల హెక్టార్లలో పంటలు వేయడానికి వీలుగా అధికార యంత్రాంగం ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసింది.

ప్రతిసారి రైతులు విత్తనాలు, ఎరువుల కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈసారి అధికారులు వాటిని ముందస్తుగానే సిద్ధం చేశారు. అయితే వర్షాలు వచ్చే సూచనలు కన్పించకపోవడంతో రైతులు విత్తనాల కొనుగోలుకు పూర్తిస్థాయిలో ముందుకురావడం లేదు.  తెలంగాణలో వర్షాధార పంటలో ఈసారి అత్యధికంగా పత్తి పంట విత్తనున్నారు. గత సంవత్సరం 74.97 లక్షల ప్యాకెట్ల పత్తి విత్తనాలు రైతులు వినియోగించిన నేపథ్యంలో ఈసారి 85.62 లక్షల ప్యాకెట్లను సిద్ధం చేశామని, అందులో ఇప్పటి వరకు 22.21 లక్షల ప్యాకెట్లను రైతులు కొనుగోలు చేసినట్లు వ్యవసాయ శాఖ కమిషనర్ బి. జనార్దన్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. పత్తిని 15.34 లక్షల హెక్టార్లలో సాగు చేయనున్నారని వివరించారు.

సోయాబీన్ విత్తనాలకు గతంలో వచ్చిన డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈసారి రెండు లక్షల క్వింటాళ్ల విత్తనాలను సిద్ధం చేయాలని నిర్ణయించామని, అందులో ఇప్పటికే 1.77 లక్షల క్వింటాళ్ల విత్తనాలను జిల్లాల్లో అందుబాటులో ఉంచావుని, రైతులు ఇప్పటి వరకు 1.07 లక్షల క్వింటాళ్ల విత్తనాలు కొనుగోలు చేశారని చెప్పారు. ఈ పంట ఎక్కువగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల్లో సాగవుతోందని పేర్కొన్నారు. 70 వేల క్వింటాళ్ల వరి విత్తనాలు అందుబాటులో ఉంచితే.. ఇప్పటి వరకు 16 వేల మంది రైతులు విత్తనాలు కొనుగోలు చేశారని, వరిసాగుకు ఇంకా సమయం ఉందని అన్నారు. మొక్కజొన్న పంటకు సైతం ఉన్న డిమాండ్ మేరకు విత్తనాలు సిద్ధంగా ఉంచినట్లు చెప్పారు.

రైతులు విత్తనాల కోసం ఎలాంటి ఇబ్బందిపడకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోడౌన్లలో ఇప్పటికి 4.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులున్నాయని, వర్షాలు పడితే.. ఈ ఎరువులను రైతులు తీసుకెళ్తే.. మరిన్ని ఎరువులను తీసుకుని రావడానికి తాము సిద్ధమేనని ఎరువుల కంపెనీలు హామీ ఇచ్చాయని తెలిపారు. ప్రతివారం ఎరువుల కంపెనీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నావుని చెప్పారు. జూలై 10వ తేదీలోగా తగినంతగా వర్షాలు పడని పక్షంలో.. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెడతావుని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement