ఆన్‌లైన్‌ ‘భూ’తం!

Farmers Facing Problems With Errors In Online Land Records - Sakshi

అన్నదాతకు తీరని ‘భూమి’ చిక్కులు

తప్పులు తడకలుగా భూరికార్డులు

సవరణ చేయని అధికారులు

క్రయ విక్రయాలకు ఇబ్బంది పడుతున్న రైతులు  

ఇంటిలో అమ్మాయి పెళ్లికి భూమిని అమ్ముదామంటే కుదరదు.. పిల్లాడి చదువుకు పొలం కుదవ పెడదామన్నా వీలు కాదు. తాతల నుంచి వచ్చిన ఆస్తి అయినా హక్కుకు దిక్కు లేకుండా పోతోంది. ప్రభుత్వ నిర్ణయాల వల్ల జిల్లాలో అన్నదాత నిలువునా మునిగిపోతున్నాడు. వారసత్వపు భూమిపై కూడా లబ్ధి పొందలేకపోతున్నాడు. వెబ్‌ల్యాండ్‌ దయ వల్ల భూమి రికార్డులుతప్పులు తడకలుగా మారుతున్నాయి. ఫలితంగా రైతు క్రయవిక్రయాలతో పాటు రుణాలకూ దూరమయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయి. 

శ్రీకాకుళం పాతబస్టాండ్‌ : టీడీపీ ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల అలసత్వాలు అన్నదాతకు కునుకు పట్టనీయడం లేదు. వెబ్‌ల్యాండ్‌ ప్రక్రియ మొదలు పెట్టిన తర్వాత భూమి కష్టాలు ఎక్కువైపోయాయి. తాతల నుంచి వచ్చిన భూములు వెబ్‌ల్యాండ్‌లో లేకపోవడం, నమోదుకు దరఖాస్తు చేసుకుంటే నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడానికే సమయమంతా సరిపోతుండడంతో రైతు గోడు అరణ్యరోదనగా మిగులుతోంది. జిల్లాలో రైతులకు పాస్‌ పుస్తకాల్లో ఉన్న లెక్కలకు, క్షేత్రంలో ఉన్న కొలతకు ఎలాంటి సంబంధం ఉండడం లేదు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడంతో క్రయవిక్రయాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  

సర్వే మాయ..దేశంలో ఇప్పటివరకు రెండుసార్లు భూ సర్వేలు జరిగా యి. మొదటిసారి 1926, తర్వాత 1956లో జరిగాయి. వీటికి అప్పటి ప్రభుత్వాలు చట్టబద్ధత కల్పించాయి. తర్వాత ఇప్పటివరకు పూర్తిస్థాయిలో భూ సర్వేలు జరగలేదు. వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భూ భారతి పేరిట చట్టబద్ధంగా సర్వేలు చేయాలని నిర్ణయించినా.. ఎన్నికలు రావ డం, వైఎస్‌ చనిపోవడంతో ఆ ప్రక్రియ ముందుకు కదల్లేదు. దీంతో రైతుల భూరికార్డుల్లో తప్పులు తొలగించే అవకాశం రాలేదు. జిల్లాలో 6.57 లక్షల ఎకరా ల భూమికి సంబం ధించిన రికార్డులు తప్పులుగా ఉన్నట్లు అంచనా. పాత రెవెన్యూ రికార్డుల్లో వివరాల కు, వెబ్‌ల్యాండ్‌లోని ఆర్‌ఓఆర్, అడంగల్‌లో కనిపిస్తు న్న వివరాలకు పొంతన ఉండట్లేదు. ఉన్న రైతులు మాయమై, కొత్త రైతులు అక్కడ ప్రత్యక్షమవుతున్నా రు. తప్పుల సవరణల కోసం ప్రతి మండలంలో వం దల సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయి. రెవెన్యూ సిబ్బంది వీటిని పరిష్కరిస్తున్న దాఖలాలేవీ కనిపించ డం లేదు. ఫలితంగా ఈ భూములపై క్రయవిక్రయాలు కాదు కదా రుణాలు కూడా దొరకడం లేదు. 

2.35 లక్షల నోషనల్‌ ఖాతాలు..
భూ రికార్డులు లేకుండా సుమారుగా జిల్లాలో 2.35 లక్షల సర్వే నంబర్లకు నోషనల్‌ ఖాతాలు ఉన్నాయి. వీటిలో సుమారు నాలుగు లక్షల ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఈ భూములు చాలా వరకు వారసత్వం, ఇతరత్రా కారణాలతో వారికి సంక్రమిం చిన భూములు అయితే వీటికి ఖాతా నంబర్‌ (ఒన్‌బి–ఆర్‌ఓఆర్‌)లు లేకపోవడంతో ఈ భూములు క్రయ విక్రయాలు జరగక ఆ భూ యజమానులు అవస్థలు పడుతున్నారు. ఇలా నోషనల్‌ ఖాతాలో ఉన్నం దున వారికి పన్ను చెల్లింపులు, ఇతర ప్రయోజనాలు రావడం లేదు. దీంతో రైతులు నోషనల్‌ ఖాతా భూములపై హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. 

తిప్పి పంపినవి ఎక్కువే..
జిల్లాలో రెవెన్యూ విభాగంలో 2014 జూన్‌ నుంచి ఇప్పటివరకు భూములకు సంబంధించి మీ సేవా కేంద్రాలకు సమస్యల పరిష్కారం కోసం 2,25,359 దరఖాస్తులు రాగా 47,324 దరఖాస్తులను అధికారులు రిజెక్టు చేశారు. పట్టాదారు పాస్‌ పుస్తకాల కోసం 6,42,899 సర్వే నంబర్లకు సంబంధించి 1,73,716 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా వీటిలో 1,65,737 సర్వే నంబర్లకు సంబంధించిన రిజెక్టు చేశారు. 3,31,988 సర్వే నంబర్లలో అప్రూవల్‌ చేసి పాస్‌ పుస్తకాలు మంజూరుకు సిఫార్సు చేశారు. మిగిలినవి పెండింగ్‌లోనే ఉన్నాయి.

వందలాది కేసులు..
జిల్లాల భూ వివాదాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా వందలాది కేసులు నమోదవుతున్నాయి. తహసీల్దార్‌ స్థాయిలో పరిష్కారం దొరక్కపోవడంతో వారు న్యాయస్థానాలను, జేసీ ఆర్‌ఓఆర్‌ కోర్టును ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం రెవెన్యూ పరిధిలో ఆర్‌ఓఆర్‌ కేసులు జేసీ కోర్టులో సుమారుగా వంద ఉన్నాయి. ఇవి కాకుండా రెవెన్యూ డివిజినల్‌ అధికారి, మండల స్థాయిలో వేలల్లో ఉన్నాయి. కొందరు అవినీతికి పాల్పడుతుండడం, కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు న్యాయస్థానాలకు వెళ్తున్నారు. వివిధ న్యాయస్థానాల్లో భూ వివాదం కేసులు 320 వరకు ఉన్నాయి. 

రెవెన్యూ శాఖ అందించే రికార్డులు.. 
రైతుల భూమి హక్కుకు సంబంధించి పట్టాదారు పాస్‌ పుస్తకం, అడంగల్‌ వంటివి రెవెన్యూ శాఖ ద్వారా పొందుతారు. కంప్యూటరైజ్డ్‌ అడంగల్, భూమి అడంగల్‌ నమోదులో తప్పుల సవరణలు, ఒన్‌ బి రికార్డు, ఒన్‌బిలో తప్పుల సరవణ, పాస్‌ బుక్‌ రిప్లేస్‌ మెంటు, పాస్‌ బుక్‌ డూప్లికేట్, ఈ పాస్‌ బుక్‌ కొత్తది, మాన్యువల్‌ అడంగల్, మ్యూటేషన్‌ అండ్‌ టైటిల్‌ డీడ్, ఎం టైటిల్‌ డీడ్‌ కం పట్టాదారు పాస్‌ బుక్, తదితర సేవలు అందించాల్సి ఉంది. కానీ వీటి మంజూరులో సిఫార్సులు, అవినీతి చోటు చేసుకుంటున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. 

మ్యుటేషన్‌ కావడం లేదు
నా పొలాలకు సంబంధించి మ్యుటేషన్‌ కావడం లేదు. నెలల తరబడి తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాను. అయినా ఆన్‌లైన్‌లో నమోదు కాలేదు. దీంతో నాకు బ్యాంకు రుణం రావడం లేదు. 
– కాళ్ల సన్యాసినాయుడు, సంతకవిటి మండలంలో తాలాడ గ్రామం. 

అడంగల్‌ రావడం లేదు.. 
గ్రామంలో ఉన్న 70 సెంట్ల భూమికి వెబ్‌లో అడంగల్‌ రావడం లేదు. అధికారులను అడిగితే సర్వే చేయించమంటున్నారు. ఐదు నెలలుగా తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు. నాకు భూమి ఉన్నా ఈ ప్రభుత్వం హక్కును కల్పించడం లేదు.  
– కెంబూరు తవిటినాయుడు, పాలకొండ మండలం, వాటపాగు గ్రామం.

దరఖాస్తులే మిగులుతున్నాయి..
భూముల ఆన్‌లైన్‌ ప్రక్రియ చాలామందివి పూర్తి కాలేదు. గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి సమస్యలు స్వీకరిస్తున్నా, మ్యుటేషన్లు చేస్తున్నా సమస్యకు పూర్తిస్థాయిలో పరిష్కారం దొరకడం లేదు. రైతులకు ఇప్పటికీ పాస్‌ పుస్తకంలో ఉన్న భూమలు 1బీల్లో ఉండటం లేదు. కొన్నిసార్లు గతంలో తీసుకున్న 1బీకి, ప్రస్తుతం తీసుకుంటున్న 1బీకి పొంతన ఉండటం లేదు. 1బీని ప్రామాణికంగా తీసుకుంటే రైతులు నష్టపోతున్నారు. ప్రతి రైతుకి ఉన్న భూమికి పట్టాదాసు పాస్‌ పుస్తకం, భూ హక్కు ధ్రువీకరణ పత్రం, 1బీ మంజూరు చేస్తేనే ప్రయోజనం చేకూరుతుంది.
– అంబటి శ్రీనివాసరావు, అరిణాంఅక్కివలస

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top