అంటరానితనం నిర్మూలన అందరి బాధ్యత | Sakshi
Sakshi News home page

అంటరానితనం నిర్మూలన అందరి బాధ్యత

Published Thu, Oct 2 2014 2:54 AM

అంటరానితనం నిర్మూలన అందరి బాధ్యత

కర్నూలు/గోస్పాడు: అంటరానితనం నిర్మూలన అందరి బాధ్యత అని, ఇందుకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని ఎస్పీ ఆకె రవికృష్ణ విజ్ఞప్తి చేశారు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామంలో మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ రాత్రిబస చేసి గ్రామంలో నెలకొన్న సమస్యలపై ఆరా తీశారు. దళితులు, నాయీబ్రాహ్మణులతో చర్చించి ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చారు. బుధవారం ఉదయం జిల్లా పోలీసు బాసు దగ్గరుండి నాయీబ్రాహ్మణులతో దళితులకు క్షౌరం చేయించి వారి మధ్య ఉన్న అంతరాన్ని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టానికి అందరూ సమానులేని, అన్ని వర్గాల వారికి సమాన హక్కులు ఉన్నాయన్నారు. నేటి ఆధునిక యుగంలో అంటరానితనానికి చోటు లేదని,  ప్రజలందరూ కలిసి మెలిసి ఉండాలని సూచించారు. అంటరాని తనాన్ని రూపుమాపడానికి అన్ని వర్గాల మత పెద్దలు, విద్యావంతులు, ప్రజాప్రతినిధులు, యువకులు ముందుకు రావాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఆయన వెంట శిరివెళ్ల సీఐ శ్రీనివాసరెడ్డి, గోస్పాడు ఎస్‌ఐ తిరుపాలు ఉన్నారు.




 

Advertisement
Advertisement