‘సెట్‌’ కావట్లేదు

Engineering and other professional courses students Significantly declining in the state - Sakshi

ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్‌ సీట్లు.. చేరేవారు లేక ఫీట్లు

ఈసారి ఎంసెట్‌ ఫలితాల ఆలస్యంతో మరింత తగ్గే అవకాశం

ఇతర రాష్ట్రాల్లోని కాలేజీలు, వర్సిటీల్లో చేరిపోతున్న విద్యార్థులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో సీట్లు లక్షల్లో ఉంటున్నా.. వాటి భర్తీకి అర్హులైన అభ్యర్థులు తగ్గిపోతున్నారు. ఫలితంగా ఏటా సీట్లు భర్తీకాక భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ముఖ్యమైన కాలేజీల్లో మినహా చాలా విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ కావడం గగనమవుతోంది. వీటి భర్తీకి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్‌లో అర్హత మార్కులు సాధించే వారి సంఖ్య తగ్గుతుండటం సీట్లు మిగులుకు ఒక కారణం కాగా.. నిర్ణీత వ్యవధిలో ఎంసెట్‌ ముగించి, సకాలంలో అడ్మిషన్లు నిర్వహించకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీ, డీమ్డ్‌ యూనివర్సిటీలలో చేరుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్‌ ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని కాలేజీల్లో ఈసారి గతం కన్నా ఎక్కువ సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

రాసేవారు ఎక్కువగానే ఉంటున్నా..
రాష్ట్రంలోని ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో చేరిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు ఏటా లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నా.. ప్రవేశాలకు వచ్చేసరికి మాత్రం భారీగా తగ్గిపోతున్నారు. దరఖాస్తు చేసిన వారి సంఖ్యనే తీసుకుంటే.. 2016లో ఇంజనీరింగ్‌కు 1,89,141 మంది, అగ్రి మెడికల్‌కు 1,03,155 మంది కలిపి మొత్తం 2,92,296 మంది దరఖాస్తు చేశారు. 2017లో ఇంజనీరింగ్‌కు 1,98,064 మంది, అగ్రి మెడికల్‌కు 80,735 మంది కలిపి మొత్తం 2,78,799 మంది దరఖాస్తు చేశారు. 2018 ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌ విభాగంలో 1,99,325 మంది, అగ్రి మెడికల్‌లో 76,748 కలిపి మొత్తం 2,76,748 మంది దరఖాస్తు చేశారు. వీరిలో పరీక్షకు హాజరవుతున్న వారి సంఖ్య, వారిలో అర్హత సాధిస్తున్న వారి సంఖ్య మరింత తగ్గిపోతోంది. ప్రస్తుతం 160 మార్కులకు నిర్వహిస్తున్న ఎంసెట్‌ పరీక్షలో ఓసీ, బీసీలకు 40 మార్కులను అర్హతగా పరిగణిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు లేవు. ర్యాంకును నిర్థారించడానికి ఎంసెట్‌లో వచ్చిన మార్కులు 75 శాతంగా, ఇంటర్మీడియెట్‌ మార్కులను 25 శాతంగా తీసుకుంటున్నారు. 2016లో 1,79,467 మంది రాయగా 1,31,580 మంది, 2017లో 1,87,484 మంది రాయగా 1,49,505 మంది, 2018లో 1,90,922 మందికి గాను 1,38,017 మంది అర్హత సాధించారు. అగ్రి మెడికల్‌ విభాగానికి వచ్చేసరికి 2015లో 81,010 మందికి గాను 78,816 మంది, 2016లో 98,753 మంది పరీక్ష రాయగా 86,497 మంది, 2017లో 75,489 మందికి గాను 68,882 మంది, 2018లో 73,373 మందికి గాను 63,883 మంది అర్హత సాధించారు.

కన్వీనర్‌ కోటాలోనూ మిగులుతున్నాయ్‌
డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో ఆయా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి వివిధ కోర్సుల్లో సీట్లకు అనుమతులు తెచ్చుకుంటున్నా.. వాటిలో చాలావరకు మిగిలిపోతున్నాయి. చివరకు సదరు కాలేజీలు క్రమేణా కోర్సులను రద్దు చేసుకోవడమో, సీట్లు తగ్గించుకోవడమో చేయక తప్పడం లేదు. ఆయా కాలేజీల్లో మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్‌ కోటా కాగా.. మిగిలిన సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకోవడానికి వీలుంది. అయితే ఏటా కన్వీనర్‌ కోటా సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఇక యాజమాన్య కోటా సీట్ల భర్తీ గగనంగా మారుతోంది. చివరకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, మినహాయింపులు తెచ్చుకుంటేగానీ సీట్లు భర్తీ కావడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top