గురువారం సాయంత్రం 5.54గంటలు..ఒక్కసారిగా అలజడి..భూమి కదిలిన భావన..పెద్ద అలికిడి..ఏం జరిగిందో అంతటా ఆందోళన..
శ్రీకాకుళం టౌన్/ఎచ్చెర్ల: గురువారం సాయంత్రం 5.54గంటలు..ఒక్కసారిగా అలజడి..భూమి కదిలిన భావన..పెద్ద అలికిడి..ఏం జరిగిందో అంతటా ఆందోళన..ఎవరికి వారు కొద్దిక్షణాలపాటు విస్మయానికి గురయ్యారు. తర్వాత తేరుకున్నారు. భూప్రకంపనలుగా నిర్దారించుకున్నారు. ఇంతలోనే టీవీ మాధ్యమాలలో ప్రకంపనల సమాచారం వెలువడింది. శ్రీకాకుళం పట్టణంతో పాటు ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం, పొందూరు మండలాల్లో భూప్రకంపనల ప్రభావం కనిపించింది. సుమారు నాలుగైదు సెకెన్లపాటు జనం భయబ్రాంతులకు గురయ్యారు.
దీని తీవ్రత రెక్టారు స్కేల్‌పై 3.4గా నమోదైందని కలెక్టరేటు కంట్రోల్ రూం అధికారులు నిర్థారించారు. ప్రకంపన ప్రాంతాలలో ఇళ్ల నుంచి జనం ఒక్క ఉదుటున బయట కొచ్చారు. మళ్లీ ప్రకంపనలు వస్తాయేమోననే ఆందోళన వారిలో కనిపించింది. కాస్సేపటి తర్వాత ముప్పులేదని ఇళ్లలోకి వెళ్లిపోయారు. ఎలాంటి ప్రమాదం లేకపోవడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. కలెక్టరేటులో కంట్రోల్ రూం ఏర్పాటు చేసి పరిస్థితిని అధికారులు సమీక్షిస్తున్నారు. శాలపురం తదితర చోట్లు ఈ ప్రకంపనలు ఎక్కువగా చోటు చేసుకున్నాయి.ఎచ్చెర్ల,ఫరీదుపేట తదితర గ్రామాల్లో గోడలకు చిన్న బీటలుసైతం కనిపించాయి.
పెద్ద శబ్దంతో..
ఇంటిలో టీవీ చూస్తుండగా పేలుడు శబ్దం వినిపించింది. తర్వాత ఉన్నఫలాన అన్ని కదిలినట్టయింది. అయితే పక్క ఏదో పేలుడు అనుకున్నాను, వీధిలోకి వచ్చి చూస్తే అందరూ బయటకు వచ్చేశారు. పేలుడుతో భూప్రకంపనలు ఇప్పటి వరకు రాలేదు. పొందూరు భీమారావు,సర్పంచ్ కేశవరావుపేట
భయం కలిగింది
ఇళ్లలో ఒక్కసారిగా సామగ్రి కదిలింది. పెద్దశబ్దం వినిపించింది. భయం కలిగింది. వెంటనే ఇంటి బయటకు వచ్చేశాం. ఊరంతా రోడ్డుమీదకు వచ్చేశారు.
తమ్మినేని పూర్ణారావు,కుశాలపురం