ఆవకాయ స్వీట్‌...అమెరికాలో హాట్‌ | Demand of Sweet Mango Pickle Making In Visakha Haripalem | Sakshi
Sakshi News home page

ఆవకాయ స్వీట్‌...అమెరికాలో హాట్‌

Sep 4 2019 9:06 AM | Updated on Sep 4 2019 12:58 PM

Demand of Sweet Mango Pickle Making In Visakha Haripalem - Sakshi

మామిడికాయ బద్దకు కాస్త ఉప్పూ కారం, ఆవాల పొడి అద్ది.. ఆపై నూనెలో ఈత కొట్టించి.. నలభీమ పాకాన్ని మరిపించే రుచిని సాధించిన గొప్పతనం తెలుగువారిది. అలాంటి ఆవకాయ తయారీలోనే ప్రఖ్యాతి పొందింది విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామం. 70 ఏళ్లుగా తీపి ఆవకాయ తయారు చేస్తూ అమెరికా, ఆస్ట్రేలియా, అండమాన్‌ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.      – సాక్షి, విశాఖపట్నం 

తయారీయే ప్రత్యేకం 
కల్వటేరు రకానికి చెందిన మామిడి కాయలను మాత్రమే పచ్చడి తయారీకి వినియోగిస్తారు. మే, జూన్‌ నెలల్లో తూర్పు గోదావరి, ఇతర ఏజెన్సీ ప్రాంతాల నుంచి మామిడి కాయల్ని దిగుమతి చేసుకుంటారు. రసాయనాలు వినియోగించకుండా తయారు చేసిన బెల్లాన్ని సేకరిస్తారు. మామిడి కాయ ముక్కల్ని  నానబెడతారు. బాగా ఎండబెడతారు. కారం, ఆవ పిండి, బెల్లం దట్టిస్తారు. చివరగా నూనె కలిపి డ్రమ్ముల్లో నిల్వ చేస్తారు. రెండు నెలల పాటు బాగా మగ్గిన తరువాత అమ్మకాలు ప్రారంభిస్తారు. గ్రామంలో హోల్‌సేల్‌గా, ఇతర గ్రామాలకు మోటార్‌ సైకిళ్లపై వెళ్లి రిటైల్‌గా అమ్మకాలు సాగిస్తారు.  

70 ఏళ్లుగా ఇదే వృత్తి 
హరిపాలెం వాసులు 70 ఏళ్ల క్రితం తీపి ఆవకాయ తయారీనే వృత్తిగా స్వీకరించారు. ఒక్కొక్క కుటుంబం 10 డ్రమ్ముల పచ్చడి తయారు చేస్తుంది. ఏడాది పొడవునా రిటైల్, హోల్‌సేల్‌గా అమ్మకాలు జరుపుతారు. ముఖ్యంగా గ్రామంలో ‘పెంటకోట’, ‘కాండ్రేగుల’ ఇంటిపేరిట గల కుటుంబాలు పచ్చడి తయారీలో సిద్ధహస్తులు. వీళ్లు తయారు చేసే విధానం వల్ల ఏడాది వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. మార్కెట్‌లో వివిధ బ్రాండ్లలో లభిస్తున్న ఆవకాయ పచ్చడి తయారీకి యంత్రాలను వినియోగిస్తారు. నిల్వ చేసేందుకు రసాయనాలను కలుపుతారు. హరిపాలెంలో తయారు చేసే ఆవకాయలో ఎలాంటి రసాయనాలు వినియోగించరు. 

విదేశాల్లోనూ ఖ్యాతి 
ఉద్యోగ, వ్యాపార రీత్యా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో స్థిరపడిన చాలామంది హరిపాలెం ఆవకాయ కోసం పరితపిస్తుంటారు. స్వదేశానికి వచి్చ.. తిరిగి వెళ్లే సమయంలో ఇక్కడి నుంచి ఆవకాయ కొనుగోలు చేసి తీసుకెళుతుంటారు. ఇంకొందరికి ఇక్కడి వారు పార్శిళ్ల రూపంలో పంపుతున్నారు. మరోవైపు ఒడిశా, విశాఖ ఏజెన్సీ, పశి్చమ బెంగాల్‌కు చెందిన రిటైల్‌ వ్యాపారులు ఇక్కడి ఆవకాయ కొనుక్కెళ్లి అక్కడ విక్రయిస్తుంటారు. అండమాన్‌లో స్థిరపడిన హరిపాలెం వాసులు ఏదైనా పనిమీద స్వగ్రామానికి వచి్చనప్పుడు వంద నుంచి రెండొందల కిలోల పచ్చడిని అక్కడ విక్రయించేందుకు తీసుకెళుతుంటారు. 

ప్రభుత్వ సాయం అందితే.. 
ప్రతి కుటుంబానికి ఏటా రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ పెట్టుబడి అవసరమవుతుంది. నగలు, ఆస్తులను తాకట్టు పెట్టి, అధిక వడ్డీలకు అప్పులు తెస్తున్నాం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో కుటుంబానికి రూ.50 వేల చొప్పున బ్యాంకు రుణం ఇచ్చేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు.     – కాండ్రేగుల శ్రీను, తయారీదారు 

పార్శిళ్లు పంపుతున్నాం 
హరిపాలెం ఆవకాయకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, ఆస్ట్రేలియాకి కూడా ప్రత్యేక పార్శిళ్లు పంపిస్తున్నాం. అక్కడి నుంచి వచ్చేవారు తమవెంట కచ్చితంగా పచ్చడి తీసుకెళతారు. వారిని చూసేందుకు వెళ్లేవారు కూడా హరిపాలెం ఆవకాయను తీసుకెళుతున్నారు.  – బుద్ధ వెంకట సత్యరాము, తయారీదారు  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement