ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు డిసెంబరు నుంచే కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే డిమాండ్ల కోసం ప్రజాప్రతినిధులకు రైల్వేశాఖ లేఖలు రాసింది.
	ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌కు డిసెంబరు నుంచే కసరత్తు మొదలవుతుంది. ఇప్పటికే డిమాండ్ల కోసం ప్రజాప్రతినిధులకు రైల్వేశాఖ లేఖలు రాసింది. తీరా బడ్జెట్ ప్రకటించిన తర్వాత జిల్లాకు న్యాయం చేయలేదని ప్రకటనలు ఇవ్వడం మినహా ముందు నుంచే జాగ్రత్తపడి డిమాండ్లను సాధించుకోవడంలో ప్రజాప్రతినిధులు నిర్లిప్తంగా ఉన్నారు. కనీసం ఈ ఏడాది బడ్జెట్‌లోనైనా కేటాయింపులు ఆశాజనకంగా ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలెట్టాలి. లేదంటే ఈ బడ్జెట్ లోనూ మొండి‘చేయి’ తప్పదు.
	 
	 సాక్షి, కడప: సాధారణంగా ఏటా ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్‌కు సంబంధించి రైల్వే మంత్రిత్వశాఖ డిసెంబరు నుంచే కసరత్తు ప్రారంభిస్తుంది. ఆ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధులకు లేఖలు రాసి వారి డిమాండ్లను తెలుసుకుంటుంది. వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్‌కు సంబంధించి ఇప్పటికే కసరత్తు ప్రారంభమైంది. ప్రజాప్రతినిధుల అభిప్రాయాల కోసం ఇప్పటికే దక్షిణమధ్య రైల్వే అధికారులు లేఖలు రాశారు.రైల్వేబడ్జెట్‌లో మన జిల్లాకు ఏటా అన్యాయమే జరుగుతోంది. అధిక ఆదాయం తెస్తున్న డివిజన్‌లలో గుంతకల్లు డివిజన్ ఒకటి. ఈ డివిజన్‌లో మన జిల్లా కూడా ఒకటి. అయితే ఆదాయం మేరకు కేటాయింపులు ఉండటం లేదు. కొత్త రైళ్లు, మార్గాలు, సర్వేలు, ప్రాజెక్టులకు మోక్షం లభించడం లేదు. చాలా వరకూ ప్రతిపాదనల్లోనే మూలుగుతున్నాయి.
	 
	 అభివృద్ధి పనుల ఊసే లేదు:
	 జిల్లాలో రైల్వే అభివృద్ధి పనులకు 2013-14 బడ్జెట్‌లో ఒక్క రూపాయి కేటి యించలేదు. నందలూరులో లోకోషెడ్డును ఏర్పాటు చేయాలని రెండేళ్లుగా ప్రతిపాదనలు పంపుతున్నారు. దీని కోసం 200 ఎకరాల స్థలం కూడా సిద్ధం చేశారు. అయినా దీని గురించి పట్టించుకోవడం లేదు. 1028 కోట్ల అంచనాతో మొదలైన కడప- బెంగళూరు లైన్ అంచనా వ్యయం ప్రస్తుతం 2వేల కోట్ల రూపాయలు దాటింది. 2007 నుంచి ఇప్పటి వరకూ ఏ బడ్జెట్‌లోనూ దీని ప్రస్తావన రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంటే దీని గురించి ఆలోచిస్తామని గత బడ్జెట్‌లో అప్పటి మంత్రి దినేశ్ త్రివేది ప్రకటన చేశారు. అయినా ఎవరూ స్పందించలేదు. ఎర్రగుంట్ల-నంద్యాల రైల్వేలైన్ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
	 
	 మాట చెప్పారు..హామీ మరిచారు
	 ఎర్రగుంట్ల-నొస్సం ప్యాసింజర్ రైలును 2012-13 బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఇప్పటికీ రైలు పట్టాలెక్కలేదు. దీనిగురించి రైల్వే అధికారులను ఆరా తీసి కొత్త రైలును తెప్పించడంపై ప్రజాప్రతినిధులు దృష్టిసారించడం లేదు. పైగా ప్రస్తుతం సీమవాసి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి రైల్వేశాఖ సహాయమంత్రిగా ఉన్నారు. ఈయన ఉన్నప్పటికీ మన ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెచ్చి 2013-14 బడ్జెట్‌లో కేటాయింపులు తెప్పించుకోలేకపోయారు. కనీసం ఈ బడ్జెట్‌లోనైనా జిల్లాకు న్యాయం చేసేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెడితే ఫలితం ఉండొచ్చు.
	 
	 జిల్లా నుంచి గత బడ్జెట్‌లో ప్రకటించేందుకు
	 పంపిన ప్రతిపాదనలు ఇవే
	  నందలూరులో లోకోషెడ్ ఏర్పాటు చేయాలి. దీనికి ఇప్పటికే 200 ఎకరాలు స్థలం కూడా ఉంది.
	 
	 వారంలో రెండుసార్లు కడప స్టేషన్ మీదుగా నడిచే సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ నిత్యం నడిపేలా చర్యలు తీసుకోవాలి.
	 
	 
	 రూ.2వేల కోట్ల అంచనాతో ప్రతిపాదించిన కడప-బెంగళూరు రైల్వేలైను పనులకు ఇప్పటికీ సర్వే కూడా జరగ లే దు. దీని పురోగతిపై దృష్టి సారించాలి.
	 
	  కడప స్టేషన్ పరిధిలోని ఆర్‌ఓబీకి బడ్జెట్ రూ.15కోట్లు కేటాయించాలి.
	 
	 ఎర్రగుంట్ల, కమలాపురం స్టేషన్ల ఆధుని కీకరణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి.
	 
	  కమలాపురంలో ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్‌లో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిలను నిర్మించాలి.
	 
	  మచిలీపట్నం-తిరుపతి వెళ్లే నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌ను కడప వరకూ పొడిగించాలి.
	 
	 కడప-కర్నూలు ఇంటర్‌సిటీ, తిరుపతి- గుంతకల్లు, తిరుపతి-బళ్లారి, చెన్నై-గుంతకల్లు,
	 తిరుపతి-సికింద్రాబాద్ , తిరుపతి-ఖాజీపేట రైళ్లకు ఎర్రగుంట్లలో హాల్ట్ కల్పించాలి.
	 
	 ఎర్రగుంట్ల-నంద్యాల రైలు మార్గం పనులు పూర్తి చేయాలి.
	 
	 ఒంటిమిట్టలో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ స్టాపింగ్
	 
	  ఓబులవారిపల్లె-కృష్ణపట్నం రైలుమార్గం పనులకు బడ్జెట్‌లో కేటాయింపులు
	 
	 ఎర్రగుంట్ల స్టేషన్‌లో ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాలి.
	 
	  కడప రైల్వేస్టేషన్‌ను వరల్డ్‌క్లాస్ స్టేషన్‌గా గుర్తించాలి.
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
