ఆన్‌లైన్‌లో ఆటలొద్దు | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ఆటలొద్దు

Published Tue, Jul 14 2020 3:59 AM

Cyber crimes in the name of Online Video Games In Corona time - Sakshi

పంజాబ్‌లో 17 ఏళ్ల బాలుడు ఇటీవల పబ్జీ గేమ్‌ ఆడుతూ రూ.16 లక్షలు పోగొట్టుకున్నాడు. గేమ్‌లో తాను ఎంపిక చేసుకున్న పాత్ర(యానిమేషన్‌ బొమ్మ)కు కాస్మోటిక్‌ ఐటెమ్స్, గన్స్,టోర్నమెంట్‌ పాస్, రాయల్‌పాస్,రంగు రంగుల డ్రెస్‌ల కోసం తల్లితండ్రుల డెబిట్‌ కార్డులతో డబ్బులు చెల్లించాడు. విత్‌డ్రా అయినట్టు వచ్చిన మెసేజ్‌లను తల్లిదండ్రులకు తెలియకుండా డిలీట్‌ చేశాడు. ఉద్యోగి అయిన తన తండ్రి వైద్య ఖర్చుల కోసం తెచ్చుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌ రూ.16 లక్షలను కొడుకు ఇలా  సైబర్‌ నేరగాళ్ల పాలు చేశాడు.  

సాక్షి, అమరావతి: ఆన్‌లైన్‌ గేమ్స్‌ మనకు తెలియకుండానే జేబులు గుల్ల చేస్తూ బతుకు చిత్రాలను తల్లకిందులు చేస్తున్నాయి. ఎక్కడో పొరుగు దేశాల్లో ఉండే గేమ్స్‌ నిర్వాహకులు ఆన్‌లైన్‌ ద్వారా ఆకట్టుకుని అందినంత కాజేస్తుండటంతో  సరికొత్త సైబర్‌ నేరాలు నమోదవుతున్నాయి. అసలే కరోనా నేపథ్యంలో ఇంటి పట్టునే ఉంటున్న పిల్లల నుంచి పెద్దల వరకు తెలిసీ తెలియక ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలై ఏ మాత్రం అవగాహన లేని లింక్‌లు క్లిక్‌ చేయడం, బ్యాంకు డీటైల్స్‌ ఇవ్వడం, ఓటీపీలు ఎంటర్‌ చేయడం వంటి అనేక స్వయం కృతాపరాధాలతో డబ్బులు పోగొట్టుకుని లబోదిబోమంటున్నారు. 

వీడియో గేమ్స్‌ పేరుతో ఎర
► ఇంటిపట్టునే ఉంటున్న పిల్లలు ఫ్రీఫైర్, పబ్జీ, ఫోర్ట్‌నైట్, కాల్‌ ఆఫ్‌ డ్యూటీ వంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌కు.. పెద్దలు ఆన్‌లైన్‌ రమ్మీ(పేకాట)కి ఆకర్షితులవుతున్నారు. 
► ఈ వీడియో గేమ్స్‌లో ఒకేసారి వివిధ ప్రాంతాల నుంచి ఆన్‌లైన్‌లో 50 మంది నుంచి 100 మంది వ్యక్తులు వారు ఎంపిక చేసుకున్న క్యారెక్టర్ల (యానిమేటెడ్‌ బొమ్మలు) రూపంలో అధునాతన ఆయుధాలతో కదులుతూ పోరాడుతారు. 
► గేమ్‌ను బట్టి ఒక్కొక్కరు సుమారు రూ.100 నుంచి రూ.5 వేల వరకు ఆన్‌లైన్‌లో ఎంట్రీ ఫీజుగా చెల్లిస్తారు. వీరందిరిలో వీడియోగేమ్‌ నిర్ధేశించిన క్యారెక్టర్లు ఒకరికొకరు గన్‌ ద్వారా కాల్చుకుంటారు. చివరలో మిగిలిన ముగ్గురు విజేతలకు బహుమతులు ఇస్తారు. 

పిల్లల బలహీనతలే వారి బలం
► ఆన్‌లైన్‌ గేమ్‌లను పిల్లలకు, యువతకు ఆసక్తికరంగా మలిచి ట్విట్టర్, ఫేస్‌బుక్‌ అకౌంట్, ఈ మెయిల్‌ ఐడీ, ప్రత్యేక యాప్‌ వంటి ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫారం ద్వారా ప్రవేశం కల్పిస్తారు.  
► పిల్లలు, యువతలోని బలహీనతను గమనించి వీడియో గేమ్‌లలో వారు ఎంపిక చేసుకున్న పాత్ర (యానిమేషన్‌) బొమ్మలకు ఆకర్షణీయమైన వస్త్రధారణ, అధునాతన ఆయుధాల కొనుగోలుకు డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించేలా నిబంధన పెడతారు. ఈ పాత్రలను రాయల్‌పాస్‌ ఆటగాళ్లుగా పిలుస్తారు.
► చాలా మంది పెద్దలు ఆన్‌లైన్‌లో జంగల్‌ రమ్మీ, క్లాసిక్‌ రమ్మీ, ప్లే రమ్మీ, ఏసి ఈ టూ త్రీ డాట్‌ కామ్, పేటీఎం, ఫస్ట్‌ గేమ్స్‌ డాట్‌ కాం, డక్కన్‌ రమ్మీ డాట్‌ కాం వంటి వెబ్‌సైట్‌లలో పేకాట ఆడుతూ జేబుకు చిల్లు పెట్టుకుంటున్నారు.

20 రోజుల్లో రూ.5.40 లక్షలు హుష్‌
అమలాపురం టౌన్‌ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో 9వ తరగతి విద్యార్థి 20 రోజులపాటు సరదాగా తన తల్లి షేక్‌ రజియా బేగం స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా ఆడిన ఆన్‌లైన్‌ గేమ్‌ రూ.5.40 లక్షలు దోపిడీకి గురయ్యేలా చేసింది. తండ్రి కువైట్‌లో ఉంటున్నాడు. తల్లికి పెద్దగా చదువురాదు. ఈ బాలుడు ‘ఫ్రీ ఫైర్‌’ అనే ఆన్‌లైన్‌ వీడియో గేమ్‌ యాప్‌ను ఓపెన్‌ చేశాడు. అందులో వెపన్స్‌ కొనాలంటే నిర్దేశించిన లింక్‌ ఓపెన్‌ చేసి తన తల్లి డెబిట్‌ కార్డుల వివరాలు ఇచ్చాడు. దీంతో సైబర్‌ నేరగాళ్లు ఆన్‌లైన్‌ ద్వారా సొమ్ము కాజేశారు. దిక్కుతోచని ఆమె తన కుమారుడిని వెంటబెట్టుకుని వెళ్లి సోమవారం డీఎస్పీ షేక్‌ మాసూమ్‌ బాషా వద్ద గోడు వెళ్లబోసుకుంది. 

కృష్ణా జిల్లా నూజివీడు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో క్యాషియర్‌గా పని చేస్తున్న గుండ్ర రవితేజ ఆన్‌లైన్‌లో రమ్మీ(పేకాట), క్యాసినో ఆటలతో చాలా డబ్బులు పోగొట్టుకున్నాడు. చివరకు బ్యాంకులో డిపాజిట్ల రూపంలో ఉన్న రూ.1,56,56,587 డబ్బును కాజేశాడు. ఆ డబ్బునూ ఆటల్లో పెట్టి పోగొట్టుకున్నాడు. తుదకు ఇతనిపైనే కేసు నమోదైంది. 

ఆన్‌లైన్‌ గేమ్స్‌లో ఎక్కువగా మోసాలు జరుగుతున్నాయి. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చాం. ఈ తరహా నేరగాళ్లను పట్టుకోవడం క్లిష్టంగా మారుతోంది. ఒకవేళ పట్టుకున్నా, చట్టపరంగా కఠిన శిక్షలు లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆన్‌లైన్‌ గేమ్స్‌ నిషేధించేలా, సైబర్‌ నేరాలపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తేవాలని ప్రతిపాదన చేశాం. పిల్లల ఆటల పట్ల పెద్దలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. 
– సునీల్‌కుమార్‌ నాయక్,డీఐజీ, సీఐడీ సైబర్‌ క్రైమ్‌ విభాగం 

Advertisement
 
Advertisement
 
Advertisement