రూ.కోట్లు తినేశారు..!

Corruption in Eggs Supply YSR Kadapa - Sakshi

14తో ముగియనున్న గుడ్ల సరఫరా

ఆలస్యంగా మేల్కొన్న అధికారులు

వైఎస్‌ఆర్‌ జిల్లా, ప్రొద్దుటూరు : ఆకారంలో గుడ్డు చిన్నదిగా కని పించినా.. దీనినే ఆసరాగా చేసుకుని టీడీపీ నేతలు రూ.కోట్లు కొల్లగొట్టారు. తమకు ఇష్టమొచ్చిన రీతిలో గుడ్లు సరఫరా చేసి అందిన కాడికి దోచుకున్న నేతలు.. విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో పాత విధానానికి స్వస్తి పలికారు. ఈ నెల 15 నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖ పరిధిలోని అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త కాంట్రాక్టర్‌ ద్వారా గుడ్లు సరఫరా చేయాలని నిర్ణయించారు. వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా పరిధిలోని 15 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 3261 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో అమలవుతున్న అన్న అమృత హస్తంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు నెలకు 30 లక్షల గుడ్లను సరఫరా చేస్తున్నారు. గతంలో జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ టెండర్లు నిర్వహించి.. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో గుడ్ల సరఫరాకు కాంట్రాక్టర్లను నియమించే వారు. కోళ్ల ఫారం నిర్వాహకులు టెండర్లు వేసేవారు. ఎగ్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ప్రకారం మార్కెట్‌ ధరను బట్టి కాంట్రాక్టర్‌కు అధికారులు డబ్బు చెల్లించేవారు.

కొత్త విధానానికి తెరతీసిన టీడీపీ ప్రభుత్వం
ముందు నుంచి రెవెన్యూ డివిజన్ల వారిగా అంగన్‌వాడీ కేంద్రాలకు గుడ్ల సరఫరా కాంట్రాక్టర్లను నియమించే వారు. వారు సైతం సమయానికి, సక్రమంగా గుడ్లు సరఫరా చేయలేదనే విమర్శలు క్షేత్ర స్థాయిలో ఉన్నాయి. అలాంటిది టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు సంబంధించిన కాంట్రాక్టును మూడు సంస్థలకు అప్పగించింది. ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో తమకు అనుకూలమైన రీతిలో కాంట్రాక్టు అప్పగించారు. ఆ ప్రకారం వారు కోడ్‌ చేసిన ధరను చెల్లిస్తున్నారు. 2017 జూలై 14 నుంచి వైజాగ్‌కు చెందిన యునైటెడ్‌ ట్రేడర్స్‌ వారు గుడ్ల సరఫరాకు సంబంధించి ఒప్పందం చేసుకున్నారు. ఈ సంస్థ నిర్వాహకులు వైఎస్సార్‌ జిల్లా, విశాఖపట్నం, పశ్చిమగోదావరి, కర్నూలు జిల్లాలకు సంబంధించి టెండర్‌ వేశారు. మార్కెట్‌ ధరతో సంబంధం లేకుండా.. యథావిధిగా రోజూ గుడ్డుకు రూ.4.68 చొప్పున చెల్లించాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. గతంలో రూపొందించిన నిబంధనల మేరకు నెక్‌ ధరల ప్రకారం కాంట్రాక్టర్‌కు డబ్బు ఇవ్వాల్సి ఉంది. ఏడాదిలో కొన్ని నెలలు గుడ్ల ధరలు తక్కువగా ఉండటం, మరి కొన్ని నెలల్లో ఎక్కువగా ఉండటం జరుగుతోంది. ఈ విధానం ప్రకారం ప్రభుత్వానికి డబ్బు ఆదా అయ్యేది. ప్రస్తుతం అమలవుతున్న విధానంలో కొత్త కాంట్రాక్టర్‌కు ఏడాది పొడవునా రూ.4.68 చొప్పున చెల్లించారు. గుడ్డుకు అదనంగా రూపాయి చొప్పున ఒక్క వైఎస్సార్‌ జిల్లాలోనే నెలకు రూ.30 లక్షల మేర కాంట్రాక్టర్‌కు అదనంగా చెల్లించారనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రకారం ఏడాదికి లెక్కిస్తే రూ.3 కోట్లకు పైగా ప్రభుత్వ ధనం వృథా అయింది. రాష్ట్రంలోని 13 జిల్లాలకు కలిపి కేవలం ముగ్గురు కాంట్రాక్టర్లనే ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరు టీడీపీ ముఖ్యనేత కుమారుడికి పర్సెంటేజీల రూపంలో డబ్బు చెల్లించారనే విమర్శలు ఉన్నాయి.

నాలుగు నెలలు పొడిగించిన అధికారులు
నిబంధనల ప్రకారం వైజాగ్‌కు చెందిన యునైటెడ్‌ టేడ్రర్స్‌ వారు.. గతేడాది జూలై 14న కాంట్రాక్టు దక్కించుకున్నారు. ఈ ప్రకారం ఈ ఏడాది జూలై 14తో వీరికి గడువు ముగిసింది. అయితే ఉన్నత స్థాయిలో ప్రభుత్వ పెద్దలతో మేనేజ్‌ చేసుకుని కాంట్రాక్టర్‌ ఏ నెలకు ఆ నెల గడువు పొడిగించుకునేలా చక్రం తిప్పాడు. ఇప్పటికి నాలుగు నెలలుగా కాంట్రాక్టర్‌కు అధికారులు డబ్బు చెల్లిస్తున్నారు. వాస్తవానికి ఈ విధానం ప్రకారం ప్రతి నెల రూ.30 లక్షలు డబ్బు వృథా అవుతోంది. అలాంటిది అదనంగా రూ.4 నెలలు గడువు పొడించడం గమనార్హం. కాగా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో అధికారులు కాంట్రాక్టును రద్దు చేసి.. తిరిగి టెండర్లు నిర్వహించేందుకు ఆన్‌లైన్‌ టెండర్‌ పిలిచారు. ఈ నెల 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టెండర్లు స్వీకరించి 15న ఓపెన్‌ చేయనున్నారు. అదే రోజు నుంచి కొత్త కాంట్రాక్టర్‌ గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. అసలు విషయం ఏమిటంటే.. గతంలో విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఉన్నతాధికారులు రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి ఒక జిల్లాలో టెండర్‌ కోడ్‌ చేసిన కాంట్రాక్టర్‌ మరో జిల్లాలో కోడ్‌ చేయకూడదని నిబంధన విధించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top