సర్కారుపై భారం రూ.13,000 కోట్లు

Coronavirus Effect: Burden on AP Govt is Rs 13000 crore - Sakshi

లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వం కోల్పోయిన రాబడి దాదాపు రూ.6 వేల కోట్లు 

ఉచిత రేషన్‌కు రూ.1,400 కోట్లు 

రూ.1,000 నగదు సాయానికి రూ.1,470 కోట్లు 

మెరుగైన వైద్యం కోసం రూ.4,000 కోట్లకు పైమాటే

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. పరిస్థితిని చక్కదిద్దుకుంటూ, ఒక్కో రంగాన్ని సరిదిద్దుకుంటూ ముందడుగు వేస్తున్న దశలో.. కరోనా రూపంలో ఊహించని పరిణామం ఎదురైంది. ఫలితంగా ప్రభుత్వం మీద ఊహించని భారం పడింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి లాక్‌డౌన్‌ పెట్టడంతో వ్యవసాయ, వాణిజ్య, వ్యాపార, పారిశ్రామిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన రాబడి నిలిచిపోయింది. సరాసరి రోజూ ప్రభుత్వానికి సమకూరే రాబడి దాదాపు రూ.160 కోట్లు. జనతా కర్ఫ్యూ మొదలైన మార్చి 22 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో అన్ని రకాల కార్యకలాపాలు నిలిచిపోయాయి. మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ కాలానికి కనీసం రూ.6,000 కోట్లు ప్రభుత్వం కోల్పోయినట్లే. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. వాస్తవంగా దీని కంటే ఎక్కువే రాబడిని ప్రభుత్వం కోల్పోయిందని అధికార వర్గాలు చెప్పాయి.

కష్టకాలంలో మానవతాదృక్పథం 
► వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి సంక్షేమానికి పెద్దపీట వేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నవరత్నాలే కాకుండా, మరెన్నో సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టారు. 
లాక్‌డౌన్‌ కాలంలో పనుల్లేక అల్లాడుతున్న పేదలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఉచితంగా బియ్యం, కందిపప్పు/శనగ పప్పు ఇవ్వడానికి (నెల రోజుల్లో మూడు విడతలు ఇవ్వనున్నారు. ఇప్పటికే రెండు విడతలు ఇచ్చారు) దాదాపు రూ.1,400 కోట్లు ఖర్చు చేస్తోంది. 
► రేషన్‌ తీసుకున్న ప్రతి కుటుంబానికి రూ.1,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం చేసింది. ఈ సాయాన్ని 1.47 కోట్ల కుటుంబాలు అందుకున్నాయి. ఇందుకు రూ.1,470 కోట్లు ఖర్చయ్యాయి. 

సమర్థవంతంగా కరోనా వ్యాప్తి నియంత్రణ
కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడానికి ప్రభుత్వం సమర్థవంతమైన చర్యలు చేపడుతోంది. ఆర్థిక భారాన్ని లెక్క చేయకుండా, ప్రజల ప్రాణాలు కాపాడటానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా దేశంలోనే మొట్టమొదటి సారిగా దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు తెప్పించింది. 
► పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి యంత్రాంగాన్ని సమాయత్తం చేయడం చూస్తుంటే ప్రజారోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి అనుసరిస్తున్న విధానం అర్థమవుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
► కరోనా బాధితులకు చికిత్స చేయడానికి ఆసుపత్రులను సిద్ధం చేయడం, వైద్యులకు అవసరమైన రక్షణ సామగ్రి సమకూర్చడానికి, ఔషధాల కొనుగోలుకు, సకల సౌకర్యాలతో క్వారంటైన్‌ సెంటర్ల నిర్వహణకు, బాధితులకు పౌష్టికాహారం అందించడానికి, రిలీఫ్‌ క్యాంపులు ఏర్పాటు చేసి వలస కూలీలకు అన్ని రకాల వసతులు కల్పించడానికి, కంటైన్‌మెంట్‌ జోన్లలో పారిశుద్ధ్యం మొదలు ప్రజలకు నిత్యావసరాలు అందించడానికి ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తోంది. 
► మెరుగైన వైద్యం, కరోనా నియంత్రణకు అయిన వ్యయం రూ.4,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. ఈ ఖర్చు ఇంకా పెరుగుతూ ఉంటుందని, ఎక్కడ ఆగుతుందనే విషయాన్ని ఇప్పుడే అంచనా వేయలేమని అధికార వర్గాలు చెప్పాయి. ఈ ఖర్చులన్నీ కలిపి ఇప్పటి వరకు దాదాపు రూ.13,000 కోట్ల మేర ఊహించని భారం ప్రభుత్వంపై పడింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top