ప్రజలందరూ సహకరించాలి: మంత్రి బొత్స

CoronaLockdown: Minister Botsa Video Conference With Municipal Commissioners - Sakshi

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని  పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఆదివారం కరోనా వైరస్‌ నియంత్రణపై మున్సిపల్‌ కమిషనర్లతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణాల్లో కరోనా వైరస్‌ ఎక్కువగా ప్రబలుతుందని గుర్తించామన్నారు. ఈ నేపథ్యంలో పట్టణాల్లో నివాసం ఉంటున్న ప్రజలను ప్రతిరోజూ పరిశీలన చేయిస్తామన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ విధంగా తేడాలు ఉన్నాయో నివేదికలు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు.  

అన్ని చర్యలు తీసుకుంటున్నాం
‘సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వయంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. సామాజిక ‌దూరం పాటించేలా అనేక చర్యలను చేపట్టాం ఎక్కడికక్కడ మొబైల్‌ మార్కెట్‌లు, అదేవిధంగా అన్ని ప్రాంతాల్లో మార్కెట్‌లు పెట్టి జనసంచారం తగ్గించే ఏర్పాట్లు చేస్తున్నాం. ధరలు పెరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. ధరల పట్టిక తప్పక ఉంచాలి. సీఆర్డీఏ కార్యాలయంలో ఒక కంట్రోల్‌ గదిని ఏర్పాటు చేస్తున్నాం.  పారిశుద్ధ్య ఇబ్బందులు రాకుండా నిత్యం పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించాం. 

ఇంటింటిసర్వేలో టీచర్లు కూడా భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. రేపు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వారితో సమావేశం అవుతాం.  అనాథలు, యాచకుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశాం. కొంతమంది మళ్లీ రోడ్ల పైకి వచ్చేస్తున్నారు.. వారిని రాకుండా చూస్తాం. పట్టణ ప్రాంతాలు, నగరాలలో ఆరు నుంచి 11గంటల వరకు, గ్రామీణ ప్రాంతాలలో ఆరు నుంచి ఒంటి గంట వరకు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం బయటకు వచ్చేందుకు అనుమతి ఉంది. ఆ తర్వాత ప్రజలు ఎవరూ రోడ్ల పైకి రాకూడదు. కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించాలి’అని మంత్రి బొత్ర సత్యనారాయణ ప్రజలను కోరారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top