ఆటో డ్రైవర్‌పై పోలీసు జులుం

Constable Attacks On Auto Driver in Visakhapatnam - Sakshi

నడిరోడ్డుపై కొట్టిన ఎస్‌ఐ, ట్రైనీఎస్‌ఐ, కానిస్టేబుల్‌

సెల్‌ఫోన్‌లో చిత్రీకరించిన మరో యువకునిపైనా దాడి

అవమానంతో డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం

పోలీసు స్టేషన్‌ను ముట్టడించిన తోటి కార్మికులు

సీఐ చొరవతో సద్దుమణిగిన వివాదం

విశాఖపట్నం, రావికమతం(చోడవరం): చెప్పిన వెంటనే ఆటో తీయలేదనే అక్కసుతో ఆ డ్రైవర్‌ను ఓ పోలీసు కానిస్టేబుల్‌ కొట్టాడు. ఇదేమిటని ప్రశ్నించిన పాపానికి సమీపంలో ఉన్న ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు కూడా వచ్చి చేయి చేసుకోవడంతో పాటు బూటు కాళ్లతో తన్నారు. సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తున్న మరో యువకుడిపైనా జులుం ప్రదర్శించారు.  దీనిని తీవ్ర అవమానంగా భావించిన ఆటో డ్రైవర్‌ ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రావికమతంలో గురువారం రాత్రి తీవ్ర సంచలనమైన ఈ సంఘటన గురించి తెలుసుకున్న ఆటో డ్రైవర్లు పొలీసు స్టేషన్‌ను ముట్టడించారు. అకారణంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.  బాదితుడు, ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకారం పి.పొన్నవోలుకు చెందిన ఆటో డ్రైవర్‌ లంకా రమేష్‌ గురువారం రాత్రి రావికమతం రోడ్డులో ఆటో ఆపాడు. అదే సమయంలో కానిస్టేబుల్‌ శివ, ఎస్‌ఐ రామకృష్ణ అటుగా వచ్చారు.

ఆటో తీయాలని కానిస్టేబుల్‌ గదమాయించాడు. ఆటోకు ఎదురుగా మరో బైక్‌ ఉండడంతో వెంటనే డ్రైవర్‌ తీయలేకపోయాడు. దీంతో కానిస్టేబుల్‌ తీవ్ర దుర్భాషలాడాడు. ఆ ఆటోకు రూ.వెయ్యి అపరాధ రుసుము రాశాడు. అన్ని రికార్డులు, లైసెన్స్‌ ఉండగా కేసు ఎందుకు రాశారంటూ ఆటో డ్రైవర్‌ ప్రశ్నించడంతో కానిస్టేబుల్‌ చేయిచేసుకున్నాడు. సమీపంలో ఉన్న ఎస్‌ఐ రామకృష్ణ, ట్రైనీ ఎస్‌ఐ సుధాకరరావు కూడా వచ్చి డ్రైవర్‌ను కొట్టి,తన్నారు. సమీపంలో ఉన్న యర్రబంద గ్రామానికి చెందిన చిరంజీవి అనే యువకుడు ఈ దృశ్యాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా  అతనిపైనా చేయిచేసుకున్నారు. ఈ అవమానాన్ని తట్టుకోలేని ఆటో డ్రైవర్‌ రమేష్‌ ఒంటిపై డీజిల్, పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. ఇది తెలిసిన తోటి ఆటో డ్రైవర్లు స్టేషన్‌కు చేరుకుని పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  ఇది తెలిసిన కొత్తకోట సీఐ లక్ష్మణరావు ఎకాయెకిన సిబ్బందితో అక్కడకు చేరుకుని వారిని వారించారు. లిఖిత పూర్వకంగా రాసి ఇస్తే విచారించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.  తొలుత కాదన్నా కానిస్టేబుల్‌ ఆటో డ్రైవర్‌కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. కాగా డ్రైవర్‌పై తాము చేయిచేసుకోలేదని మందలించామని ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు సీఐకు వివరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top