కాంగ్రెస్, టీడీపీలకు ఎదురుదెబ్బ (2013) | Congress, the political backlash (2013) | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీడీపీలకు ఎదురుదెబ్బ (2013)

Dec 31 2013 3:29 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్, టీడీపీలకు 2013 సంవత్సరం కలిసిరాలేదు. పంచాయతీ, సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. అయితే దొడ్డిదారిన సైకిల్ సాయంతో డీసీసీబీలో తిష్ట వేసింది.

=జిల్లాలో మారిన రాజకీయ సమీకరణలు
 =కాంగ్రెస్, టీడీపీలకు కలిసిరాని 2013
 =పంచాయతీ, సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి చేదు ఫలితాలు
 =దొడ్డిదారిన సైకిల్ సాయంతో డీసీసీబీలో తిష్ట
 =నియోజకవర్గాల్లో టీడీపీకి నేతల కరువు
 =బలం పుంజుకున్న వైఎస్‌ఆర్‌సీపీ

 
 కాంగ్రెస్, టీడీపీలకు 2013 సంవత్సరం కలిసిరాలేదు. పంచాయతీ, సహకార ఎన్నికల్లో అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. అయితే దొడ్డిదారిన సైకిల్ సాయంతో డీసీసీబీలో తిష్ట వేసింది. టీడీపీ పరిస్థితీ మెరుగుపడలేదు. ఆ పార్టీకి పలు నియోజకవర్గాల్లో నేతలు కరువయ్యారు. అదే సమయంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి బలం పుంజుకుంది. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటింది.
 
సాక్షి, చిత్తూరు: 2013 సంవత్సరంలో నిర్వహించిన సహకార, పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లాలో గౌరవమైన సంఖ్యలో స్థానాలు గెలుచుకోలేని దుస్థితికి అధికారపార్టీ దిగజారింది. అదే సమయంలో టీడీపీకి బలమైన దెబ్బతగిలింది. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కన్నా మెరుగైన ఫలితాలు సాధించినా ద్వితీయ స్థానంతో సంతృప్తిపడాల్సి వచ్చింది. వైఎస్‌ఆర్‌సీపీ సహకార, పంచాయతీ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థానాలు సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అయితే ముఖ్యమంత్రి అధికారాన్ని ఉపయోగించి టీడీపీ సింగిల్‌విండో డెరైక్టర్ల మద్దతుతో దొడ్డిదారిన అమాస రాజశేఖర్‌రెడ్డికి కేంద్ర సహకారబ్యాంక్ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. సహకార ఎన్నికల్లో 3వ స్థానానికే టీడీపీ పరిమితమైంది. మొత్తం మీద తెలుగుదేశం, కాంగ్రెస్‌పార్టీలకు ఈ ఏడాది రాజకీయంగా కలిసి రాలేదు. ముగ్గురు ఎమ్మెల్యేలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరడంతో పుంగనూరు, తంబళ్లపల్లె, పలమనేరు నియోజకవర్గాల్లో ఆ పార్టీ మరింతగా బలపడింది. అదే సమయంలో సంవత్సరం చివరిలో జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే గాంధీ చంద్రబాబుకు షాక్ ఇచ్చి రాజీనామా చేసి బయటకు వచ్చారు.
 
బలపడిన వైఎస్‌ఆర్‌సీపీ
 
పంచాయతీ, సహకార ఎన్నికల్లో విజయం సాధించి మండల, గ్రామస్థాయిల్లో వైఎస్‌ఆర్‌సీపీ బలపడింది. అదే సమయంలో తొలి నుంచి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థ విధానాలతో విభేదిస్తూ వచ్చిన పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఉన్న ఆయన అనుచరవర్గం వైఎస్‌ఆర్‌సీపీలో చేరింది. చంద్రబాబు నిరంకుశత్వంతో విసిగి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పని చేసేందుకు పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ప్రవీణ్‌కుమార్‌రెడ్డి వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. దీంతో ఈ మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీలకు నాయకులు లేకుండా పోయారు. రానున్న ఎన్నికల్లో ఇక్కడ సరైన అభ్యర్థులనూ పెట్టుకోలేని పరిస్థితికి ఆ పార్టీలు చేరుకున్నాయి.
 
 పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ హవా
 
జిల్లాలో మూడు విడతలుగా సాగిన పంచాయతీ ఎన్నికల్లో  వైఎస్‌ఆర్‌సీపీ ఆరు వందలకుపైగా పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసి ప్రథమ స్థానంలో నిలిచింది. చాలా చోట్ల టీడీపీ, కాంగ్రెస్‌లు కుమ్మక్కై ఉమ్మడి అభ్యర్థిని పెట్టినా వైఎస్‌ఆర్‌సీపీని దెబ్బకొట్టలేకపోయాయి. వైఎస్‌ఆర్‌సీపీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థులనే సర్పంచ్‌లుగా ఓటర్లు గెలిపించారు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో టీడీపీ, కాంగ్రెస్ నిలిచాయి. పంచాయతీ ఎన్నికలను కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా మంత్రి గల్లా అరుణ, ముఖ్యమంత్రి సోదరుడు కిషోర్‌కుమార్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకుని రచించిన వ్యూహాలు ఫలించలేదు. పుంగనూరు నియోజకవర్గంలో     అత్యధిక ఏకగ్రీవాలు చేసి మాజీ మంత్రి రామచంద్రారెడ్డి వైఎస్‌ఆర్‌సీపీ తడఖా చూపించారు. రేణిగుంట వంటి మేజర్ పంచాయతీనీ హోరాహోరీ పోరులో     వైఎస్‌ఆర్‌సీపీ దక్కించుకుంది.
 
 కాంగ్రెస్ ఖాళీ
 
రాష్ర్ట విభజనకు యూపీఏ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నిన్నటి వరకు కాంగ్రెస్ అధిష్టానం మాటే శిరోధార్యం అంటూ వచ్చిన చంద్రగిరి ఎమ్మెల్యే, మంత్రి గల్లా అరుణకుమారి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే గుమ్మడి కుతూహలమ్మలు టీడీపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. అదే సమయంలో 2009లో ఓడిన  ఎమ్మెల్యే అభ్యర్థులూ వీలైతే వైఎస్‌ఆర్‌సీపీలోకి అవకాశం రాకపోతే టీడీపీలో చేరాలన్న ఆలోచనలో ఉన్నారు. జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత పార్టీ పెడతారని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే కాంగ్రెస్‌కు జిల్లాలో మిగిలేది గుండు సున్నే. పీసీసీ అధ్యక్షుడు బొత్ససత్యనారాయణకు అంటూ ఇక్కడ అనుచరవర్గం ఏమీ లేదు. ఇక మిగిలింది తిరుపతి ఎంపీ చింతామోహన్ మాత్రమే. ఆయనే కాంగ్రెస్‌కు దిక్కు.
 
 దొడ్డిదారిన డీసీసీబీలో కాంగ్రెస్ పాగా
 
జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ పదవిని అతికష్టంపైన టీడీపీ డెరైక్టర్ల మద్దతుతో కాంగ్రెస్ దక్కించుకుంది. జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీకి సొంతంగా 28 సింగిల్ విండోలు వచ్చాయి. అలాగే 27 స్థానాలతో కాంగ్రెస్, 19 స్థానాలతో టీడీపీ ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. మరో ఆరు సింగిల్ విండోలకు ఎన్నికలు జరగలేదు. కాంగ్రెస్‌కు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు అవసరమైన మద్దతు లేకపోవడంతో దొడ్డిదారి రాజకీయాలకు పాల్పడింది. జిల్లా సహకార మార్కెటింగ్ కమిటీ చైర్మన్ పదవి టీడీపీకి ఇచ్చి, డీసీసీబీ చైర్మన్‌గిరి కాంగ్రెస్ దక్కించుకుంది. అత్యధిక స్థానాలు గెలుచుకున్నా వైఎస్‌ఆర్‌సీపీకి అధికారం దక్కనివ్వకుండా టీడీపీ, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడ్డాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement