అయోమయంలో ఆ నలుగురు | Confused, the four | Sakshi
Sakshi News home page

అయోమయంలో ఆ నలుగురు

Mar 29 2014 12:32 AM | Updated on Aug 10 2018 8:01 PM

అయోమయంలో ఆ నలుగురు - Sakshi

అయోమయంలో ఆ నలుగురు

టీడీపీలో గంటా బృందం పరిస్ధితి ‘పంచపాండవులు- మంచంకోళ్లు ’ సామెతలా తయారైంది. ఐదుగురు శానసభ్యులు కలసి జట్టుగా ఒకేసారి టీడీపీ తీర్ధం పుచ్చుకొన్న...

  • తాజాగా పంచకర్లకు పొత్తు దెబ్బ
  •  ముత్తంశెట్టికి సర్వే స్ట్రోక్
  •  టీడీపీలో గంటాకు మాత్రమే టికెట్ ఛాన్స్
  •  మిత్ర బృందానికి దూరమవుతున్న టికెట్
  •  సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: టీడీపీలో గంటా బృందం పరిస్ధితి ‘పంచపాండవులు- మంచంకోళ్లు ’ సామెతలా తయారైంది. ఐదుగురు శానసభ్యులు కలసి జట్టుగా ఒకేసారి  టీడీపీ తీర్ధం పుచ్చుకొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బృందంలో ఒక్కరికి మినహా ఎవ్వరికీ టికెట్‌లు లభించే అవకాశాలు కనిపించడం లేదు. తన స్వార్ధం కోసం తనతో క లసి నడిచే బృందాన్ని నడిసంద్రంలో ముంచేస్తారనే పేరుపడ్డ గంటా టికెట్ విషయంలో ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారన్న ప్రచారం జోరందుకొంది.

    గంటాతో కలసి టీడీపీలో చేరిన శానసభ్యులు యూవీ రమణమూర్తి(కన్నబాబు), చింతలపూడి వెంకట్రామయ్యలకు టికెట్ ఇచ్చే అవకాశాలే లేవని ప్రారంభంలోనే తేలిపోయింది. తాజాగా, పంచకర్ల రమేష్‌బాబు, ముత్తంశెట్టి శ్రీనివాస్‌లు కూడా ఈ జాబితాలో చేరిపోనున్నారు. బీజేపీతో పొత్తు కారణంగా పంచకర్ల రమేష్‌బాబు  ఆశపెట్టుకొన్న విశాఖ ఉత్తర సీటు గల్లంతు అవుతుండగా, తాము చేపట్టిన సర్వేలో ఏమాత్రం ప్రజాబలం లేదని తేలినందున ముత్తంశెట్టికి టికెట్ ఇచ్చే అవకాశాలు లేవని పార్టీ పెద్దలు చెబుతున్నారు.

    ఇటీవల నగరానికి వచ్చిన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరోక్షంగా వీరికి టికెట్‌లు ఇవ్వడం కష్టమన్నట్లుగా వ్యాఖ్యానించడం ఇప్పుడు గంటా శిబిరంలో కలకలం రేపుతోంది.  ఎంఎల్‌ఏ టికెట్ ఎవరికి రాదన్న అనుమానం కలిగినా  అనకాపల్లి లోక్‌సభ అంటూ ఆశలు చిగురింపజేసే గంటా తాజాగా వీరందరితో అదే గేమ్ ఆడుతున్నారు. తొలుత, అనకాపల్లి ఎంపీ టికెట్‌కు కన్నబాబు పేరును ప్రచారంలోకి తీసుకువచ్చిన గంటా ఇప్పుడు ముత్తంశెట్టి,పంచకర్ల అభ్యర్ధిత్వాలను అనకాపల్లికి పరిశీలిస్తున్నట్లు చెబుతూ తనను నమ్ముకొని వచ్చిన వారినే అయోమయంలో పడేస్తున్నారు.

    ఈ ఐదుగురిలో గంటాకు తప్ప మరెవ్వరికీ టికెట్ వచ్చే అవకాశాలు కనిపించకపోవడం వీరి అనుచరులను డైలమాలో పడేస్తోంది. వీరికి భరోసా ఇవ్వాల్సిన గంటా కూడా ఒక రోజు భీమిలి అని, మరో రోజు విశాఖ ఎంపీ అని, తాజాగా అనకాపల్లి అసెంబ్లీ అని అందరినీ గందరగోళపరుస్తున్నారు. మొత్తం మీద గంటా స్వార్థ రాజకీయం తమ రాజకీయ భవిష్యత్‌ను ప్రశ్నార్ధకం చేసిందన్న అవేదన వీరిలో ప్రారంభమైంది.
     
    మూర్తికి షాక్..
     
    ఈ పర్యాయం అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగాలని  ఉవ్విళ్లూరుతున్న మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి ఆశలపై చంద్రబాబు నీళ్లు చల్లారని తెలిసింది. పదేళ్లుగా ప్రజల్లోనే లేని మీరు ఎన్నికల్లో ఎలా పోటీచేస్తారని చంద్రబాబు కాస్త అసహనం వ్యక్తం చేయడంతో మూర్తి ఇప్పుడు ఆయనపై వత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement