ఒలికిపోతున్న ‘కాఫీ’ | coffee seeds gathering are stopped | Sakshi
Sakshi News home page

ఒలికిపోతున్న ‘కాఫీ’

Dec 4 2013 4:18 AM | Updated on Oct 9 2018 2:51 PM

మావోయిస్టులు పంపిణీ చేసిన ప్రభుత్వ కాఫీ తోటల్లో పండ్ల సేకరణ నిలిచిపోయింది. పక్వానికి వచ్చిన రూ.లక్షల విలువైన కాఫీ పండ్లు వృథాగా నేలపాలవుతున్నాయి.

 చింతపల్లి/జీకేవీధి, న్యూస్‌లైన్:

 మావోయిస్టులు పంపిణీ చేసిన ప్రభుత్వ కాఫీ తోటల్లో పండ్ల సేకరణ నిలిచిపోయింది. పక్వానికి వచ్చిన రూ.లక్షల విలువైన కాఫీ పండ్లు వృథాగా నేలపాలవుతున్నాయి. జీకే వీధి మండలం మర్రిపాకలు, కుంకుంపూడి, లంకపాకలు ఎస్టేట్ పరిధిలోనును, చింతపల్లి మండలం బలపం పంచాయతీ పరిధిలో సుమారు 200 హెక్టార్ల కాఫీ తోటలను మావోయిస్టులు మూడేళ్ల క్రితం స్వాధీనం చేసుకుని గిరిజనులకు పంపిణీ చేశారు. 1/70 చట్టం ప్రకారం స్థానికంగా ఉన్న గిరిజనులకే ఈ తోటలు చెందుతాయని,వాటి జోలికి రావద్దని పలుమార్లు ఏపీఎఫ్‌డీసీ అధికారులకు హెచ్చరించారు. దీంతో కాఫీ అధికారులు ఆయా తోటల జోలికి వెళ్లడం మానేశారు.

 

  మూడేళ్లుగా గిరిజనులే వాటిల్లో పండ్లు సేకరించి అమ్ముకుంటున్నారు. ఈ ఏడాదీ మాత్రం చుక్కెదురైంది. మావోయిస్టులు పంపిణీ చేసిన తోటల్లో సేకరించిన కాఫీ పండ్లను వ్యాపారులు కొనుగోలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరించారు. దీంతో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో పండ్లు పక్వానికి వచ్చినప్పటికీ సేకరణకు గిరిజనులు ఆసక్తి చూపడం లేదు. వాటిని ఎవరికి విక్రయించాలో తెలియక గిరిజనులు డోలాయమానంలో పడ్డారు. రోజుల తరబడి సేకరించకపోవడంతో అవి నేలపాలవుతున్నాయి.

 

 కష్టాల్లో కాఫీబోర్డు

 విశాఖ మన్యానికి ప్రత్యేక గుర్తింపుతెచ్చిన రాష్ట్ర కాఫీ అభివృద్ధి సంస్థ(ఏపీఎఫ్‌డీసీ) ప్రస్తుతం కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ప్రతికూల వాతావరణం, తోటల్లో దొంగతనాలు, మావోయిస్టుల చర్యలు కారణంగా ఏటా సంస్థ నష్టాల్లో కూరుకుపోతోంది. ఈ ఏడాదీ అదే పరిస్థితి దాపురించింది. చింతపల్లి పరిధి దక్షిణ ప్రాంతంలో సుమారు 70 హెక్టార్ల కాఫీ తోటలను మావోయిస్టులు గిరిజనలకు పంపిణీకి రంగం సిద్ధం చేశారు. దీంతో ఆయా తోటల వైపు కన్నెత్తి చూసేందుకు కాఫీబోర్డు అధికారులు భయపడుతున్నారు.

 

 ఏజెన్సీ వ్యాప్తంగా 4,200 హెక్టార్లలో కాఫీ తోటలు సంస్థ అధీనంలో ఉన్నాయి. వీటిలో చింతపల్లి, జీకే వీధి మండలాల్లోనే 3,400 హెక్టార్లలో ఉన్నాయి. ఐదేళ్ల క్రితం జీకే వీధి మండలం మర్రిపాకలు ఎస్టేట్‌లో 64 హెక్టార్ల తోటలను, బలపంలోని 110 హెక్టార్ల కాఫీ తోటలను గిరిజనులకు మావోయిస్టులు పంపిణీ చేశారు. నాటి నుంచి సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వర్షాలు కారణంగా దిగుబడులు నామమాత్రంగా ఉన్నాయి. సౌత్ జోన్‌లోని 70 హెక్టార్ల కాఫీ తోటలను గిరిజనులకు పంపిణీ చేస్తున్నట్టు మావోయిస్టులు ఇటీవల కాఫీబోర్డు అధికారులకు సమాచారం పంపారు. దీంతో ఈ ఏడాది ఒక్క చింతపల్లి మండలంలోనే సుమారు రూ.1.2కోట్లు నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు.

 

 అక్రమాలపై నిఘా

 మావోయిస్టులు పంపిణీ చేసిన కాఫీ తోటలపై పోలీసు నిఘా ఏర్పాటు చేశామని నర్సీపట్నం ఓఎస్డీ దామోదర్ తెలిపారు. కేవలం గిరిజనులకు ఉపాధి కల్పించేందుకే ఏపీఎఫ్‌డీసీ కాఫీ తోటల సాగు చేపట్టిందన్నారు. ప్రస్తుతం పండ్ల సేకరణ కూలి రేట్లు సైతం భారీగా పెంచిందన్నారు.  తోటల్లో కూలి పనులు చేసుకుంటే గిరిజనుల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందన్నారు. ఎప్పటిలాగే గిరిజనులు కాఫీ తోటల్లో పనులు చేసి ఉపాధి పొందితే తమకు అభ్యంతరం లేదన్నారు. ప్రభుత్వ కాఫీ తోటల్లో పండ్లను అక్రమంగా సేకరించి విక్రయించే వారిపై కేసులు నమోదు చేస్తామని ఓఎస్డీ తెలిపారు.

 - దామోదర్, నర్సీపట్నం ఓఎస్డీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement