
దళితులంటే బాబుకు చులకన
ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల పట్ల చులకనభావాన్ని మరోసారి బయటపెట్టారని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి ....
ఎస్సీ వర్గాలను అణచివేసేలాప్రవర్తిస్తున్నారు
వైఎస్సార్‌సీపీ నేతల మండిపాటు
అంబేడ్కర్విగ్రహాలకు పాలాభిషేకం
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు దళితుల పట్ల చులకనభావాన్ని మరోసారి బయటపెట్టారని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి విమర్శించారు. ఇటీవల చంద్రబాబు దళితులపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ గురునాథరెడ్డి ఆధ్వర్యంలో శనివారం నగరంలోని అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అహంకార ధోరణితో ‘ఎస్సీల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు’ అని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఆయన వైఖరిపై రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎన్నికల సమయంలో ఎస్సీలపై కపట ప్రేమ చూపిన బాబు.. ఆ తర్వాత నిజ స్వరూపాన్నిబయట పెడుతున్నారని దుయ్యబట్టారు. ఎస్సీలు ఇప్పటికైనా మేల్కోని.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడు బి.ఎర్రిస్వామిరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు దళిత వ్యతిరేకి అన్నారు.
ఆయన వ్యాఖ్యలను దళితులతో పాటు అన్ని వర్గాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పురుషోత్తం, ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలె జయరాంనాయక్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గౌస్‌బేగ్, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు మిద్దె భాస్కర్‌రెడ్డి, క్రిష్టియన్ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు జైపాల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు బండి పరుశురాం, పార్టీ నగర అధ్యక్షుడు రంగంపేట గోపాల్‌రెడ్డి, నాయకులు మైనుద్దీన్, గోపాల్‌మోహన్, చింతకుంట మధు, పోరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి, లింగారెడ్డి, చిరంజీవి, వెంకటేష్, మారుతీనాయుడు, శివశంకర్, బలరాం, అంజద్‌ఖాన్, శీనా, శ్రీదేవి, షమీమ్, జేఎం బాషా పాల్గొన్నారు.
పలు ప్రాంతాల్లో పాలాభిషేకం
సీఎం చంద్రబాబు వ్యాఖ్యలకు నిరసనగా జిల్లాలోని పలు ప్రాంతాల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. గుంతకల్లులో పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల రామాంజనేయులు, ఎమ్మార్పీఎస్, కేవీపీఎస్ నాయకులు , మడకశిరలో వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి, మాజీ మంత్రి హెచ్‌బీ నర్సేగౌడ్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైఎన్ రవిశేఖర్‌రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఆర్ అంజినరెడ్డి, తాడిపత్రిలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వీఆర్ రామిరెడ్డి, అదనపు సమన్వయకర్త రమేష్‌రెడ్డి, పెనుకొండలో పార్టీ కన్వీనర్ శ్రీకాంతరెడ్డి, టౌన్ కన్వీనర్ ఇలియాజ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహాలకు పాలాభిషేకం చేశారు.
శింగనమల ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహానికి వైఎస్సార్‌సీపీ రైతు విభాగం మండలాధ్యక్షుడు నారాయణ, ట్రేడ్ యూనియన్ మండలాధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాలాభిషేకం చేశారు.ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శులు ఎగ్గుల శ్రీనివాసులు, బసవరాజు, విడపనకల్లు జెడ్పీటీసీ సింగాడి తిప్పయ్యు, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏసీ ఎర్రిస్వామి, కిసాన్ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాకెట్ల ఆశోక్ తదితరులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహం నుంచి భారీ ర్యాలీగా వెళ్లి.. క్లాక్‌టవర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.రాయదుర్గం నియోజకవర్గంలోని డి.హీరేహాళ్ మండలం మురడి గ్రామంలోమాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులుగా పుట్టాలని ఎవరూ కోరుకోరని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు దళితులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర కార్యదర్శి భోజరాజ్‌నాయక్, పార్టీ నేత పాటిల్ అజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.