కాపు కాయని బాబు

Chandra Babu Neglects The Kaapu Community - Sakshi

కాపుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా.. మీలో ఒకడినై పెద్ద కాపునవుతా.. అంటూ 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఊదరగొట్టారు. కాపులకు లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. కాపు సామాజిక వర్గంతో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన చంద్రబాబు ఆ తర్వాత వారిని కరివేపాకులా తీసిపారేశారు. కాపులు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగడంతో దిగొచ్చిన చంద్రబాబు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు చొప్పున నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు ఇస్తానని చెప్పిన టీడీపీ అధినేత సగం నిధులు కూడా కేటాయించకుండా మరోసారి మోసగించారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని కాపులు చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని స్పష్టం చేస్తున్నారు.

సాక్షి, దెందులూరు : కాపులను నిలువునా మోసగించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై జిల్లాలోని ఆ సామాజికవర్గ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదేళ్లు తమను కూరలో కరివేపాకులా వాడుకుని విస్మరించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని ప్రకటిస్తున్నారు. కాపుల ఓట్లతో 2014లో చంద్రబాబు అధికారం చేపట్టి ఏ విధంగాను వారిని ఆదుకోలేదు. ఇచ్చిన హామీలను విస్మరించారు.  

తీరని అన్యాయం 
టీడీపీ ప్రభుత్వంలో కాపులకు తీవ్ర అన్యాయం జరిగిందని కాపు నేతలు విమర్శిస్తున్నారు. కాపులకు రిజర్వేషన్‌ కల్పిస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిన ఆయన గద్దనెక్కిన తర్వాత పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ముద్రగడ పద్మనాభంతో పాటు ప్రతిపక్ష నేతలు ఆందోళన చేపట్టారు. కాపు రిజర్వేషన్ల అంశంపై రాష్ట్రవ్యాప్త ఉద్యమం నడిచింది. రాజ్యాంగంలో సవరణ చేయాలంటూ.. చంద్రబాబు కాలం గడిపారు. ఉద్యమాన్ని అణచివేయడానికి శతథా ప్రయత్నించారు. చంద్రబాబు హామీ ఇచ్చినట్టుగా కాపులకు ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వలేదు. ఈ తరుణంలో కేంద్రం ఓబీసీలకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. ఇందులో 5 శాతాన్ని కాపులకు కేటాయించి మమ అనిపించారు. వాస్తవానికి ఈ రిజర్వేషన్లు ఆదాయపరంగా మాత్రమే కేంద్రం కేటాయించింది. కుల ప్రాతిపాదికన ఇచ్చినట్టయితేనే కాపులకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

కాపు కార్పొరేషన్‌కు అరకొర నిధులు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ప్రతిపక్షాలు చేపట్టిన ఉద్యమం ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం కాపు కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసింది. 
ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ప్రకారం నాలుగేళ్లకు రూ.4 వేల కోట్లు కేటాయించాల్సి ఉంది. అయితే నాలుగేళ్లలో సగం నిధులు మాత్రమే కేటాయించి చంద్రబాబు మరోసారి కాపులను మోసం చేశారు. కాపు కార్పొరేషన్‌ రుణాలు కూడా జన్మభూమి కమిటీ సభ్యులు సిఫార్సు చేసిన వారికి మాత్రమే ఇచ్చారు. దీంతో కొందరికి మాత్రమే రుణాలు అందాయి. అన్ని అర్హతలు ఉన్నా అత్యధిక మందికి రుణాలు అందలేదు. గడిచిన ఐదేళ్లలో చంద్రబాబు పాలనపై కాపులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమను చంద్రబాబు మోసగించారని, ప్రస్తుత ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెబుతామని ప్రతినబూనారు. 

నమ్మించి మోసగించిన బాబు
కాపుల అభివృద్ధికి పాటు పడి పెద్ద కాపునవుతానని చెప్పిన చంద్రబాబు మమ్మల్ని పూర్తిగా మోసగించారు. మా ఓట్లతో అధికారం చేపట్టి ఆ తర్వాత పూర్తిగా విస్మరించారు. హామీలను నెరవేర్చలేదు. ఆయనకు తగిన బుద్ధి చెబుతాం.
– పోకల రాంబాబు, దెందులూరు

ఓటు బ్యాంకుగా వాడుకున్న బాబు
కాపుల ఓట్లను కొల్లగొట్టేందుకు గత ఎన్నికల్లో చంద్రబాబు రిజర్వేషన్‌ హామీలను ఇచ్చి ఓటు బ్యాంకుగానే కాపులను వాడుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను పక్కన బెట్టారు. కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి అరకొరగానే నిధులు ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మళ్లీ ఎలా నమ్మాలి?
– కొండేటి గంగాధరబాబు, గోపన్నపాలెం

రిజర్వేషన్ల పేరుతో మోసం
2014లో కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు మోసం చేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి ఓట్లు వేయించుకున్న ఆయన అధికారంలోకి వచ్చాక పట్టించుకోలేదు. నమ్మించి మోసగించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. కేంద్రం ఇచ్చిన ఓబీసీ రిజర్వేషన్లలో కంటితుడుపు చర్యగా కేటాయించారు. అది చివరకు నిలుస్తుందో లేదో కూడా తెలియదు.  
– పెద్దిశెట్టి బసవయ్య, గాలాయగూడెం

కాపుల ద్రోహి చంద్రబాబు
కాపులకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ కల్పిస్తామని ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేసిన వందలాది మంది కాపులను టీడీపీ ప్రభుత్వం అరెస్టులు చేసి కేసులు బనాయించింది. ఈ విషయలను కాపులు మరిచిపోలేదు. కాపుల ద్రోహి చంద్రబాబు. ఆయనను మళ్లీ ఎలా నమ్ముతాం?
– సనపల విష్ణు, సానిగూడెం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top