
సిరుల పంట జాఫ్ర
అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న జాఫ్ర సాగుతో గిరిజన రైతులు ఆర్థిక ఆసరా పొందుతున్నారు. ఇదే విషయాన్ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
- సాగుతో ఆర్థిక ఆసరా
- ఏజెన్సీలో వెయ్యి ఎకరాల్లో సేద్యం
- ఔషధంగా పెట్టింది పేరు
చింతపల్లి: అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి గిరాకీ ఉన్న జాఫ్ర సాగుతో గిరిజన రైతులు ఆర్థిక ఆసరా పొందుతున్నారు. ఇదే విషయాన్ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ప్రకృతి సిద్ధమైన జాఫ్ర గింజలు, రంగులకు మార్కెట్‌లో మద్దతు ధర లభిస్తోంది. విశాఖ ఏజెన్సీలో ప్రస్తుతం వెయ్యి ఎకరాల్లో జాఫ్ర సాగు చేస్తున్నారు.
ఈ తోటల పెంపకానికి ఇక్కడి వాతావరణం అనువుగా ఉంది. ఒకప్పుడు ఈ గింజలు కిలో రూ.2 లేదా రూ.3 మాత్రమే పలికేవి. ప్రస్తుతం రూ.40 నుంచి 50 వరకు అమ్ముడుపోతున్నాయి. జాఫ్ర రంగు ఆరోగ్యానికి ఎటువంటి హాని చేయదు. లాటిన్ అమెరికా దేశాలలో ఈ రంగును ఆహార పదార్ధాలలోనే కాక సౌందర్య పోషకం, సువాసన నూనెలు, సబ్బుల తయారీలోనూ వినియోగిస్తున్నారు. వీటి రంగు పొడిని ఎక్కువగా అమెరికా, జపాన్, ఫ్రాన్స్, ఇటలీ దేశాలకు ఎగుమతి చేస్తున్నారు.
సాగు విధానం
జాఫ్రలో 2 రకాల చెట్లు ఉన్నాయి. ఈ మొక్క 5 మీటర్ల ఎత్తుకు పెరిగి, గుబురుగా వ్యాపిస్తుంది. సముద్ర మట్టం నుంచి 900 మీటర్ల ఎత్తు వరకు ఉన్న ప్రదేశాలలో వీటిని పెంచవచ్చు. అక్టోబరు, నవంబరు నెలల్లో 15 నుంచి 26 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాలు ఈ సాగుకు మరింత అనుకూలిస్తాయి. ఇసుకనేలలు, అడవి నేలలు, నీరు నిలవని రేగడి నేలల్లో ఈ పంటను సాగు చేయవచ్చు. చల్లని ఏజెన్సీ వాతావరణం సాగుకు మరింత అనుకూలిస్తుంది.
విత్తనాలు లేదా ముదురు కొమ్ములు నాటుకోవడం ద్వారా వీటిని పెంచుకోవచ్చు. కొమ్మలను నేరుగా భూమిలో నాటకుండా మట్టి,సేంద్రియ ఎరువు కలిపిన పాలిథిన్ సంచుల్లో నాటుకున్న తరువాత 8 నుంచి 15 రోజుల్లో మొలకెత్తుతాయి. విత్తనాలతో నారుమడిగా పెంచిన మొక్కలను 4-4 మీటర్ల దూరంలో నాటుకోవాలి. ఎకరాకు 250 నుంచి 300 మొక్కలు ఉండేలా చూసుకోవాలి.
పశువుల గెత్తం, కంపోస్టు ఎకరానికి 25 టన్నుల చొప్పున వేసుకోవాలి. జాఫ్ర పంటకు తెగుళ్లు, పురుగులు పెద్దగా ఆశించవు. నాటిన తరువాత దాదాపు 18 నెలల నుంచి దిగుబడి ప్రారంభమవుతుంది. మూడో ఏడాది నుంచి పూర్తిస్థాయిలో దిగుబడులు ప్రారంభం అవుతాయి. కాయలు కోశాక కొమ్మలు కత్తిరించాలి. దీని వల్ల దిగుబడి పెరుగుతుంది. దాదాపు 15 ఏళ్ల వరకు ఈ చెట్లు మంచి ఫలసాయాన్ని ఇస్తాయి. ఒక్కో చెట్టుకు 4 నుంచి 8 కిలోల గింజలు దిగుబడికి వస్తాయి. ఎకరాకు 20 నుంచి 60 క్వింటాళ్లు వచ్చే అవకాశం ఉంది. వీటిని పొడవాటి చెట్ల మధ్య అంతర పంటగానూ సాగు చేయవచ్చు.
ఔషధ గుణాలెక్కువ
జాఫ్ర పంటలో ఔషధగుణాలు ఎక్కువ. చెట్టు బెరడును గనేరియా వ్యాధికి, తరచూ వచ్చే జ్వరాల నివారణకు వినియోగిస్తారు. జాఫ్ర విత్తనాల గుజ్జు ను బంక విరోచనాల నివారణకు, ఆకులను కామెర్ల వ్యాధులకు, పాముకాటు వల్ల కలిగే బాధ నుంచి ఉపశమనం పొందేందుకు వినియోగిస్తారు. జాఫ్ర పంటను వాణిజ్యపరంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తాం. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే ఈ పంటపై గిరిజన రైతులు దృష్టి సారించాలి. అంతర్జాతీయ మార్కెట్‌లోను ఈ పంటకు మంచి ధరలు పలుకుతున్నాయి.
-ఉమా మహేశ్వరరావు, శాస్త్రవేత్త, చింతపల్లి పరిశోధనస్థానం.