గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా నరికి చంపేశారు.
మాచర్ల : గుంటూరు జిల్లా మాచర్ల మండలంలోని తాళ్లపల్లిలో చేతబడి చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని కొందరు దారుణంగా నరికి చంపేశారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపల్లి గ్రామానికి చెందిన మేకల ముక్కంటి వ్యవసాయం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే శుక్రవారం ముక్కంటి తన భార్యతో కలసి పొలానికి వెళ్లాడు. అయితే ఎరుకల నాగేశ్వరరావు మరో నలుగురితో కలిసి పొలానికి వెళ్లి ముక్కంటిని గొడ్డలితో నరకగా, అతడు అక్కడే ప్రాణాలు విడిచాడు.
ఎరుకల కోటయ్య అనే వ్యక్తిపై ముక్కంటి చేతబడి చేశాడన్నది నిందితుల అభియోగం. దీనిపై 20 రోజుల క్రితం గ్రామంలో పెద్దల ముందు పంచాయతీ కూడా జరిగింది. నల్లగొండ జిల్లా ముకుందాపురంలోని మైసమ్మతల్లి ముందు ప్రమాణం చేయాలని ముక్కంటిని కోరారు. అందుకు అతడు ముందుకు రాకపోవడంతో హత్య చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, నిందితులు పరారీలో ఉన్నారు.