అంగన్‌వాడీ కార్యకర్త నిర్లక్ష్యంతో బాలుడి మృతి | Boy Dead In Anaganwadi School West Godavari | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కార్యకర్త నిర్లక్ష్యంతో బాలుడి మృతి

Aug 4 2018 8:18 AM | Updated on Jul 12 2019 3:02 PM

Boy Dead In Anaganwadi School West Godavari - Sakshi

కాగుపాడు అంగన్‌వాడీ కేంద్రం సమర్తపట్టపు సాయి(3) పాత చిత్రం

పశ్చిమగోదావరి, ఉంగుటూరు: మండలంలోని కాగుపాడులో అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా నిర్లక్ష్యంతో అభం శుభం తెలియని మూడు సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. కాగుపాడు అంగన్‌వాడీ కేంద్రం (నెంబరు–236)లో గ్రామానికి చెందిన సమర్తపట్టపు సాయి (3) చదువుతున్నాడు.  ఈ నెల 1న  సాయి అంగన్‌వాడి కేంద్రం నుంచి బయటకు వచ్చి సమీపంలోని పంటబోదెలో ప్రమాదశాత్తూ పడి మృతి చెందాడు. అంగన్‌వాడీ కేంద్రంలో సాయి కనిపించకపోవటంతో అంగన్‌వాడీ కార్యకర్త జి. సువార్త, ఆయా కొరపాటి పార్వతిలు బాలుడు కోసం గాలించినా ఆచూకీ దొరక లేదు.  దీంతో వారు బాలుడి తల్లిదండ్రులు దుర్గారావు,లక్ష్మి దంపతులకు సమాచారమిచ్చారు. ఇంతలో ఓ గ్రామస్తుడు చూసి బాలుడి శవాన్ని పంట బోదెలో చూశానని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు లబోదిబోమన్నారు. అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాల నిర్లక్ష్యం కారణంగానే బాలుడు మృతి చెందాడని గ్రామస్తులు అంటున్నారు.

కేసు లేకుండా రాజీ
బాలుడు మృతిపై గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధి నిర్లక్ష్యంగా వహించిన వారిపై మండిపడ్డారు.  అంగన్‌వాడీ కార్యకర్త, ఆయాలు స్వచ్ఛందంగా రాజీనామా చేసి వెళ్లిపోయేలా ఒప్పందం కుదిర్చారు. దీంతో బాలుడు తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.

అధికారుల విచారణ
బాలుడి మృతి వార్త తెలుసుకున్న ఉన్నతాధికారులు గురువారం కాగుపాడులో విచారణ నిర్వహించారు. ఐసీడీఎస్‌ పీడీ విజయకుమారి, నల్లజర్ల ఐసీడీఎస్‌ పీవో పద్మావతి, సూపర్‌ వైజర్‌ మేరీ గ్రామంలో విచారణ నిర్వహించారు. బాలుడు సాయి మృతికి సంబంధించిన వివరాలు సేకరించి రిక్డారు చేశామని, దీని వివరాలు జిల్లా కలెక్టర్‌కు నివేదించామని వారు తెలిపారు.

తాత్కాలికంగా విధుల నుంచి తొలగింపు
బాలుడు మృతికి కారణమైన  అంగన్‌వాడీ కార్యకర్త సువార్త, ఆయా పార్వతిలను విధుల నుంచి తాత్కాలికంగా తొలగించారు. బొమ్మిడి అంగన్‌వాడీ కార్యకర్త జి.వరలక్ష్మిని కాగుపాడు అంగన్‌వాడి కేంద్రానికి  ఇన్‌చార్జిగా నియమించారు.  గ్రామంలో  ఉన్న మరో అంగన్‌వాడీ ఆయాను  ఇన్‌చార్జిగా నియమించారు.

ఇప్పటికే మూడు ఘటనలు
ఈ కేంద్రంలో ఇప్పటీకి మూడు సంఘటనలు జరిగాయని గ్రామస్తులు అంటున్నారు. బాలుడు సాయి మృతి, అలాగే సంవత్సరం  క్రితం ఓ బాలుడు మరుగుదొడ్డులో ఫిట్స్‌ వచ్చి కుప్పకూలిపోయినా అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా పట్టించుకోలేదని చెబుతున్నారు. అంతక ముందు ఈ కేంద్రంలో చదివే చిన్నారులను ఓ తల్లి చెప్పకుండా తీసుకుపోయినా మిన్నకుండియారని తెలుస్తోంది. ఈ కేంద్రం అంగన్‌వాడీ కార్యకర్త  చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని గ్రామస్తులు అంటున్నారు.

నమోదు కానీ కేసు
దుర్గారావు,లక్ష్మి దంపతులకు కుమారుడు, పాప ఉన్నారు. ఎంతో గారాబంగా పెరిగిన కుమారుడు సాయి మృతి చెందటంతో తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement