చంద్రబాబుది నాలుకా? తాటిమట్టా?

Botsa satyanarayana fire on ap cm chandra babu - Sakshi

వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత బొత్స ధ్వజం 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తుకు బాబు పాకులాడలేదా? 

రాష్ట్ర హక్కులు, కేసీఆర్‌ తిట్లు, శాపనార్థాలు అప్పుడు గుర్తుకురాలేదా? 

ఏపీలో టీఆర్‌ఎస్‌తో వైఎస్సార్‌సీపీ పొత్తు పెట్టుకుంటోందని తప్పుడు ప్రచారం 

రాష్ట్రంలో లేని పార్టీతో పొత్తెలా సాధ్యం బాబూ? 

వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ  ఒంటరిగానే పోటీ చేస్తుంది 

చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే కావాలి.. మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం

ప్రత్యేక హోదా కోసం మద్దతు కూడగడుతుంటే కడుపు మంట ఎందుకు? 

ఎల్లో మీడియా తప్పుడు భాష్యాలు, వ్యాఖ్యానాలతో వార్తలను వండివార్చింది 

రాష్ట్ర భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీపై నిందలా?

సాక్షి, హైదరాబాద్‌:  బావమరిది హరికృష్ణ భౌతికకాయాన్ని పక్కన పెట్టుకుని టీఆర్‌ఎస్‌ పొత్తుకు ప్రయత్నించినప్పుడు రాష్ట్ర హక్కులు, కేసీఆర్‌ తిట్లు, శాపనార్థాలు సీఎం చంద్రబాబుకు గుర్తుకురాలేదా? అని వైఎస్సార్‌సీపీ పార్టీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ నిలదీశారు. తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ జతకట్టేందుకు ప్రయత్నించి భంగపడ్డ చంద్రబాబు ఇప్పుడు అదే పార్టీతో ఏపీలో వైఎస్సార్‌సీపీ పొత్తు పెట్టుకుంటోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. బాబుది నాలుకా? తాటిమట్టా? అని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ స్వతంత్రంగానే అన్ని సీట్లకు పోటీ చేస్తుందని, ఏ పార్టీతోనూ పొత్తులుండబోవని స్పష్టం చేశారు. బొత్స గురువారం హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాలే తప్ప రాష్ట్ర ప్రయోజనాలపై ఆసక్తి లేదని ధ్వజమెత్తారు. ఏపీలో లేని పార్టీలతో పొత్తులు, పొడుపులు ఏమిటని ఎల్లో మీడియాను ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు కోసం శ్రమిస్తున్న వైఎస్సార్‌సీపీపై నిందలు వేయడం దారుణమని మండిపడ్డారు. బొత్స సత్యనారాయణ ఇంకా ఏం మాట్లాడారంటే... ‘‘టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బుధవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మాట్లాడిన సంగతి అందరికీ తెలుసు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయాలను ఎదిరించేందుకు, రాష్ట్రాలు తమ అధికారాలను కాపాడుకునేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు గల అవకాశాల గురించి కేటీఆర్‌ బృందం జగన్‌తో చర్చించింది. ఈ సమావేశం తర్వాత ఇరు పార్టీల అధ్యక్షులు మీడియాతో మాట్లాడారు. సమావేశం ఉద్దేశాలను వివరించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం తెలుగు రాష్ట్రాల ఎంపీలంతా ఒక్కతాటిపై ఉండి ఉమ్మడిగా పోరాడితే హక్కులను సాధించుకోవచ్చని, దీనివల్ల ఏపీకి మేలు జరుగుతుందని జగన్‌ చెప్పారు. ఇందులో తప్పేంటి? దీనిపై ఎల్లో మీడియా తప్పుడు భాష్యాలు, వ్యాఖ్యానాలు చేస్తూ వార్తలను వండివార్చింది. పొడిచిన పొత్తు.. ముసుగు తీసేస్తే అంటూ పెద్దపెద్ద అక్షరాలతో శీర్షికలు పెట్టి నానా యాగీ చేసింది. అర్థంపర్థం లేని వ్యాఖ్యానాలు చేసి ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు యత్నించడం దురదృష్టకరం. 

ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు 
రాష్ట్ర ప్రజలను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కేసీఆర్‌తో వైఎస్సార్‌సీపీ ఎలా చర్చలు జరుపుతోందని, విభజన చట్టంలోని 10, 11, 13 షెడ్యూళ్లలో పేర్కొన్న విధంగా ఏపీకి ఒనగూడాల్సిన ప్రయోజనాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న టీఆర్‌ఎస్‌తో ఎలా మంతనాలు నడుపుతారని, అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారని విమర్శలు చేస్తున్న వారితోనా మీ సఖ్యత అని, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న పార్టీతో ఎలా కలుస్తారని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ నాలుగు అంశాలను లేవదీయడం ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్లో మీడియా సహాయ సహకారాలు, సోషల్‌ మీడియా అండతో వైఎస్సార్‌సీపీపై బురద జల్లే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్రాల అధికారాలను పరిరక్షించుకునేందుకు, రాష్ట్రాల హక్కుల సాధన కోసం ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేయాలన్న ప్రయత్నంలో భాగంగా కేసీఆర్‌ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, నవీన పట్నాయక్, కుమారస్వామితోపాటు సమాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్‌ యాదవ్‌ను కలిసి ప్రాథమికంగా చర్చలు జరిపారు. ఇందులో భాగంగానే కేటీఆర్‌ వైఎస్‌ జగన్‌ను కలిసి మాట్లాడారు.
 
టీఆర్‌ఎస్‌ సహకారం తీసుకుంటే తప్పా? 

ఇటీవలి తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం చంద్రబాబు ఎందుకు ప్రయత్నించారు? తెలంగాణ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏం మాట్లాడారు? రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నాం అని చంద్రబాబు అన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించానని, ఇందులో రహస్యం ఏముందని, తెలంగాణలో టీఆర్‌ఎస్, టీడీపీ కలిసి పోటీ చేస్తే ఎక్కువ సీట్లు వస్తాయని, తెలుగు రాష్ట్రాలకు మేలు జరిగేందుకు టీఆర్‌ఎస్‌–టీడీపీ కలయిక దోహపడుతుందని ఎన్నికలకు ముందు చంద్రబాబు మాట్లాడారు. ఇవే వ్యాఖ్యలను ఏపీ అసెంబ్లీలోనూ చేశారు. దీన్నిబట్టి టీఆర్‌ఎస్‌తో పొత్తుకు తహతహలాడిందెవరు? చంద్రబాబే కదా. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చేందుకు తమ వంతు సాయాన్ని అందిస్తామని టీఆర్‌ఎస్‌ ముందుకొస్తే వారి సహకారాన్ని తీసుకుంటే తప్పు ఎలా అవుతుంది? ఏపీ ప్రయోజనాల కోసం ప్రయత్నిస్తే దోషం ఎలా అవుతుంది? ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఇతర రాష్ట్రాల మద్దతు కూడగడుతుంటే టీడీపీకి ఎందుకు కడుపు మంట? ఇందులో ముసుగేసుకున్నదెవరు? మీరా? మేమా? పారదర్శకంగా ఉన్న మమ్మల్ని ముసుగు తీసేయాలంటారా? ముసుగు వేసుకున్నది ఎవరు? ఇంతకాలం ముసుగు రాజకీయాలు చేస్తోంది ఎవరు? రాజకీయ లబ్ధి, స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీతో నాలుగేళ్లు సంసారం చేసిందెవరు? పదేళ్లపాటు హైదరాబాద్‌లో ఉండేందుకు అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో భయపడి అమరావతికి వచ్చింది చంద్రబాబు కాదా? అలాంటి పెద్దమనిషి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వైఎస్సార్‌సీపీపై, జగన్‌పై విమర్శలు చేస్తారు? తెలంగాణ ప్రాంతంలో అక్రమ ప్రాజెక్టులు కడుతుంటే ఇంతకాలం చంద్రబాబు నోరెందుకు మెదపలేదు? పోనీ మీడియా సమావేశంలో నిరసనైనా తెలిపారా? 

వైఎస్సార్‌సీపీని విమర్శించే అధికారం మీకు లేదు 
అవినీతి, అక్రమాల్లో కూరుకుపోయిన టీడీపీ నేతలు వైఎస్సార్‌సీపీపై మోపుతున్న నిందల్ని, చేస్తున్న వక్ర భాష్యాలను  ఖండిస్తున్నాం.  ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలన్నదే మా ధ్యేయం. ఏపీ అభివృద్ధే లక్ష్యంగా, తెలుగు ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఎల్లో మీడియాలో కొన్ని వార్తలను చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఒక పత్రికలో చంద్రబాబు, ఆయన సతీమణి అన్యోన్యంగా ఉన్న ఫోటో వేసి.. దానిపైన గుద్దులాట అని శీర్షిక పెట్టారు. ఈ విధంగా ఫోటోకు, శీర్షికకు ఏమాత్రం సంబంధం లేకుండా వార్త రాశారు. వీళ్లు రాసిన పొడిచిన పొత్తు వార్తలోనూ అంతే నిజం ఉంటుంది. హోదా సాధన కోసం టీఆర్‌ఎస్‌ మద్దతు ఇస్తామంటే వైఎస్సార్‌సీపీ స్వాగతిస్తోంది. ఇందులో తప్పేముంది? దానికి పెడార్థాలు తీస్తారా? తెలంగాణ ఎన్నికలకు ముందు చంద్రబాబు ఏమన్నారు? మన ముందు రెండు పార్టీలు– కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఉన్నాయి. రాజకీయ ప్రయోజనాల కోసం వీటిలో ఏ పార్టీతో కలిస్తే బాగుంటుందో చెప్పండని టీడీపీ కార్యకర్తలను బహిరంగంగా అడగలేదా? టీడీపీకి నిరంతరం రాజకీయ, స్వప్రయోజనాలు తప్పితే రాష్ట్ర, సామాజిక ప్రయోజనాలు అసలు ఉండవు. అలాంటి చంద్రబాబుకు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్సార్‌సీపీని విమర్శించే హక్కు లేదు. 

అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు 
చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు. ఇందులో ప్రధానమైంది పోలీసు వ్యవస్థ. అధికార పక్షం చెప్పుచేతుల్లో ఈ వ్యవస్థ నడుస్తోంది. అందుకే నమ్మకం లేదంటున్నాం. ప్రతిరోజూ దోపిడీలు, దుర్మార్గాలు, అత్యాచారాలు, ప్రత్యర్థులను హింసించడం వంటి దారుణాలు సర్వసాధారణమైపోయాయి. భ్రష్టు పట్టించిన ఈ పోలీసు వ్యవస్థను సక్రమంగా తీర్చిదిద్దాల్సిన ఆవసరం ఉంది. వైఎస్సార్‌సీపీ వచ్చాక ఈ వ్యవస్థను గాడిలో పెడతాం. పోలీసు శాఖకు మంచి పేరు వచ్చేలా చేస్తాం. 

తెలుగు ప్రజలంతా సోదరభావంతో మెలగాలి 
చంద్రబాబు మాటలు నమ్మి ఒకసారి ప్రజలు వంచనకు గురయ్యారు. ఆయన ఊసరవెల్లి రాజకీయాలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో మనకంటూ ఒక స్థానం ఏర్పడాలి. ఏపీ ప్రయోజనాలను కాపాడుకోవాలి. తెలుగు ప్రజలంతా సోదరభావంతో మెలగాలి. రాష్ట్రాలు తమ అధికారాల కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలన్న వాదనతో ఏకీభవిస్తున్నాం.

టీఆర్‌ఎస్‌తో కలుద్దామని  బాబే చెప్పారు
తెలంగాణ ఎన్నికలకు ముందు.. నందమూరి హరికృష్ణ శవాన్ని ముంగిట పెట్టుకుని చంద్రబాబు టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవాలనే ఉద్దేశంతో కేటీఆర్‌తో మంతనాలు జరిపారు. కాదని చెప్పగలరా? టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకునేందుకు ఎవరు ప్రయత్నించారు? టీఆర్‌ఎస్‌తో కలుద్దామని చంద్రబాబే స్వయంగా టీడీపీ కార్యకర్తల సమావేశంలో చెప్పారు. అసూయాపరులు ఏకమయ్యారన్న చంద్రబాబు విమర్శలో ఏమైనా అర్థం ఉందా? మాకు దేనికుండాలి అసూయ? ఇల్లు బాగుంటే ఊరు బాగుంటుంది. ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. తద్వారా ప్రజలు బాగుంటారు. జీవితాంతం తానే ముఖ్యమంత్రిగా ఉండాలని చంద్రబాబులాగా ఆలోచించడం మంచిది కాదు’’ అని బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.  

వచ్చే ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోం..
రాజకీయ పార్టీల మధ్య పొత్తులనేవి ఎన్నికల సమయంలో ఉంటాయి. భావ సారూప్యత గల పార్టీల మధ్య పొత్తులు కుదరడం సహజం. టీఆర్‌ఎస్‌ ఏపీలో లేదు కనుక పోటీ చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. మరి అలాంటప్పుడు పొత్తు ఏంటి? పొత్తు పొడవడం ఏంటి? వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోదు. ఒంటిగానే పోటీ చేస్తుంది. ఈ విషయాన్ని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీకి ఏపీ ప్రయోజనాలే ముఖ్యం తప్ప చంద్రబాబులా రాజకీయ ప్రయోజనాలు కాదు. ఏపీ ప్రయోజనాల కోసం, హోదా సాధన కోసం ఎందాకైనా పోరాడుతూనే ఉంటాం. ఈ లక్ష్య సాధన కోసం ఎన్ని అవమానాలు ఎదురైనా భరిస్తాం.. ఎందాకైనా వెళతాం. ప్రత్యేక హోదాపై వైఎస్సార్‌సీపీ విధానం ఇంత స్పష్టంగా ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు పత్రికా సమావేశాలు పెట్టి తప్పుబడతారా? టీడీపీ సోషల్‌ మీడియా సహా మంత్రులు లేవనెత్తిన ప్రధానాంశాల లోగుట్టు ఏమిటో నేను చెబుతా. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top