అంతర్జాతీయ కార్గోకు ఏపీ రాచబాట

BIMSTEC International Conference Commences In Visakhapatnam - Sakshi

థాయ్‌లాండ్‌తో విశాఖ పోర్టు కీలక ఒప్పందం

కోల్‌కతా, చెన్నై పోర్టులకూ భాగస్వామ్యం

బిమ్స్‌టెక్‌ సదస్సుకు తొలిసారి విశాఖ అతిథ్యం

పాల్గొన్న ఏడు దేశాల ప్రతినిధులు

నేడూ కొనసాగనున్న సదస్సు

అంతర్జాతీయంగా కార్గో రవాణాకు విశాఖ పోర్టు మార్గం సుగమం చేసుకుంది. థాయ్‌లాండ్‌లోని రాణోంగ్‌ పోర్టు ప్రతినిధులతో వ్యూహాత్మకంగా కుదుర్చుకున్న మారిటైమ్‌ ఒప్పందంతో ఇది సాధ్యమైంది. విశాఖలో గురువారం ప్రారంభమైన బిమ్స్‌టెక్‌ సదస్సు దీనికి వేదికగా నిలిచింది. బంగాళాఖాత తీరంలోని ఏడు దేశాలకు చెందిన ప్రధాన పోర్టుల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్‌ మాండవియా ముఖ్యఅతిధిగా పాల్గొన్న ఈ సదస్సులో  బిమ్స్‌టెక్‌ సభ్య దేశాల మధ్య కార్గో రవాణా, ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడి అవకాశాలు, పర్యాటకాభివృద్ధి, భద్రత తదితర అంశాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడంపై తొలిరోజు కార్యక్రమంలో వక్తలు ప్రసంగించారు. జలరవాణాతోపాటు పలు రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ అత్యంత అనుకూలంగా ఉంటుందని సదస్సులో పాల్గొన్న రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పేర్కొన్నారు.

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతం తీర దేశాల ప్రతిష్టాత్మక పోర్టుల సదస్సుకి విశాఖ నగరం వేదికగా నిలిచింది. బహుళ రంగాలు, సాంకేతిక, ఆర్థిక రంగాల సమన్వయ సదస్సు (బిమ్స్‌టెక్‌) నగరంలో గురువారం ప్రారంభమైంది. నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, శ్రీలంకతో పాటు భారత్‌ దేశాలకు చెందిన ప్రభుత్వాలు, పోర్టు ట్రస్టులకు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. పోర్టుల చరిత్రలో ప్రపంచ దేశాల పోర్టులతో కలిసి మొదటిసారి ఈ తరహా సమావేశం నిర్వహించారు. 1997లో బిమ్స్‌టెక్‌ ఆవిర్భవించిన తర్వాత విశాఖ పోర్టు ట్రస్టు మొదటిసారిగా ఈ సదస్సుకి ఆతిథ్యమిచ్చింది.

కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్‌ మాండ్వియా సదస్సుని ప్రారంభించారు. ఏడు దేశాలకు చెందిన వివిధ మేజర్‌ పోర్టులు, ప్రైవేటు పోర్టుల ప్రతినిధులు కూడా సదస్సుకి హాజరై పోర్టు రంగంలో ఆయా ప్రాంతాల్లో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులు, అందిపుచ్చుకుంటున్న అధునాతన సాంకేతికత మొదలైన అంశాలపై చర్చించారు. ఎగుమతి, దిగుమతులు, ఉత్పత్తి పెంపు, రవాణా మార్గాల అభివృద్ధి, పెట్టుబడి అవకాశాలు, స్వేచ్ఛా వాణిజ్యం, పర్యాటక అభివృద్ధి, పోర్టుల్లో భద్రత మొదలైన అంశాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. కీలక ఉపన్యాసాలు చేసిన అధికారులు పోర్టుల రంగంలో వస్తున్న మార్పులపై ప్రసంగించారు.

సదస్సుకు హాజరైన దేశ విదేశీ ప్రతినిధులు 

విశాఖ పోర్టు వ్యూహాత్మక ఒప్పందం
పోర్టు నుంచి అంతర్జాతీయ స్థాయి ఎగుమతి దిగుమతుల్లో విశాఖపట్నం పోర్టు ట్రస్టు కీలకమైన వ్యూహాత్మక ఒప్పందం చేసుకుంది. బిమ్స్‌టెక్‌ సదస్సులో భాగంగా థాయ్‌లాండ్‌ పోర్ట్‌ అథారిటీతో విశాఖ పోర్టు ట్రస్టుతో పాటు కోల్‌కతా, చెన్నై పోర్టులు ఈ ఒప్పందం కుదుర్చుకున్నాయి. థాయ్‌లాండ్‌లోని రాణోంగ్‌ పోర్టు నుంచి మేరీటైమ్‌ వాణిజ్యానికి పరస్పర సహకారం అందించుకునేలా ఈ ఒప్పందం జరిగింది. దీంతో అంతర్జాతీయ రవాణాకు కీలక మార్గం నుంచి అనుమతులు పొందేందుకు మార్గం సుగమమైంది.

కోటి ఉద్యోగాల కల్పనే లక్ష్యం 
పోర్టుల అభివృద్ధి కోసం చర్యలు ప్రారంభమయ్యాయి. పోర్టు రైల్‌ కార్పొరేషన్, క్రూయిజ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. సాగరమాల ద్వారా పరస్పర సహకారానికి ఊతం లభిస్తుంది. ఇప్పటి వరకూ రూ.48 లక్షల కోట్లు సాగరమాలకు పెట్టుబడులు వచ్చాయి. కొత్తగా కోటి ఉద్యోగాలు కల్పించడమే పోర్టుల ప్రధాన లక్ష్యం. నేషనల్‌ టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చెయ్యనున్నారు. ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు జలరవాణాతో పాటు రోడ్డు, రైలు మార్గం అవసరమైతే.. ఆ ఒప్పందంలోనే ఉండేలా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రధాన పోర్టులన్నీ ఒకే వేదికపైకి వచ్చినప్పుడే ఆర్థిక అభివృద్ధి సాధ్యమవుతుంది. ఆయిల్‌ స్పిల్లింగ్‌ హ్యాండ్లింగ్‌ చేయడం, విపత్తుల్లో సహకారం అందించడంలో కోస్ట్‌గార్డ్‌ సహకారం అందిపుచ్చుకుంటున్నాం. క్రూయిజ్‌ షిప్పింగ్‌ అందుబాటులోకి రావాలి. ఇప్పటికే ఆబుదాబీ వంటి 8 దేశాలతో ఒప్పందాల దిశగా అడుగులు పడుతున్నాయి.
– సంజయ్‌భాటియా, ముంబై పోర్టు ట్రస్ట్‌ చైర్మన్‌

సదస్సుకు హాజరైన కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీలు 7 దేశాల ప్రతినిధులు 

రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం
ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక రాజధానిగా విశాఖపట్నం భాసిల్లుతోంది. రాష్ట్రం పెట్టుబడులకు స్వర్గధామం. 3 అంతర్జాతీయ విమానాశ్రయాలతో పాటు మేజర్‌ పోర్టులు ఏపీలో ఉన్నాయి. పర్యాటకంగా, పారిశ్రామికంగా విశాఖపట్నం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. విశాఖపట్నం పోర్టు ట్రస్టు, గంగవరం పోర్టు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఏ దేశం ఇక్కడ పెట్టుబడులు పెట్టినా సాదరంగా స్వాగతిస్తాం. సులభతర వాణిజ్యం అభివృద్ధి చెందాలి.
–  రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్‌

గార్మెంట్స్‌ ఎగుమతుల్లో ప్రపంచంలో రెండో స్థానం 
106 పోర్టులతో బంగ్లాదేశ్‌ ఎగుమతి, దిగుమతుల్లో భాగస్వామిగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా టాప్‌–100 పోర్టుల్లో చిట్టగాంగ్‌ పోర్టు 64వ స్థానంలో నిలిచింది. భారత్‌ నుంచి 12 శాతం దిగుమతులు సాగుతున్నాయి. కార్గోలో బంగ్లాదేశ్‌ రెండంకెల వృద్ధి సాధించింది. రెడీమేడ్‌ గార్మెంట్స్‌ ఎగుమతుల్లో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. 2018 నాటికి 34 బిలియన్‌ డాలర్ల గార్మెంట్స్‌ ఎగుమతులు జరగగా.. 2021 నాటికి 50 బిలియన్‌ డాలర్ల లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. దేశంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైరా పోర్టు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
– రియర్‌ అడ్మిరల్‌ మొజమెల్‌ హాక్, బంగ్లా పోర్టుట్రస్ట్‌ ఛైర్మన్‌

నేపాల్‌ కార్గోకు విశాఖ పోర్టు గేట్‌వే 
ఎగుమతి, దిగుమతులపై తమ దేశం కేవలం భారత్, చైనా పైనే ఆధారపడి ఉంది. భారత్‌ నుంచి ప్రస్తుతం బిర్గంజ్‌కు మాత్రమే రైలు మార్గం ఉంది. కొత్తగా భారత్‌ నుంచి బిరాట్‌ నగర్‌కు సుదీర్ఘ రైలు మార్గం ప్రతిపాదనలున్నాయి. నేపాల్‌ కార్గోకు ముఖ్యంగా విశాఖపట్నం పోర్టుతో పాటు కోల్‌కతా, హల్దియా పోర్టులు గేట్‌వేలుగా ఉన్నాయి. భారత్‌తో నాలుగు రోడ్‌ బేస్‌డ్‌ డ్రైపోర్టు మార్గాల్ని అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతున్నాం. భారత్‌తో వాణిజ్య ఒప్పందాలు మరింత మెరుగు పరచుకుంటున్నాం.
– మహేష్‌ ఆచార్య, నేపాల్‌ పరిశ్రమలు, వాణిజ్య శాఖ జాయింట్‌ సెక్రటరీ
 

అతి తక్కువ ఖర్చుతో రవాణా వ్యవస్థ    
మయన్మార్‌ పోర్టు ట్రస్టు క్రమంగా అభివృద్ధి చెందుతోంది. కంటైనర్‌ టెర్మినల్‌ అభివృద్ధి చేస్తున్నాం. లక్ష నుంచి లక్షన్నర యూనిట్ల సామగ్రిని హ్యాండిల్‌ చేసేలా రూపుదిద్దుకుంటోంది. దీని ద్వారా మయన్మార్‌ వాణిజ్యం మరింత అభివృద్ధి చెందనుంది. లోకాస్ట్‌ రవాణా వ్యవస్థను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ఎగుమతి దిగుమతుల్లో ముందుకెళ్లేందుకు ప్రాంతీయ దేశాలతో పరస్పర సహకార ఒప్పందాలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. భారత్‌తో కేవలం పోర్టు రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ సత్సంబంధాలు మరింత బలోపేతమవుతున్నాయి.
– యూనీ యాంగ్, మయన్మార్‌ పోర్ట్‌ ట్రస్ట్‌ ఎండీ

తీరం లేని రాష్ట్రాలకూ పోర్టుల కేటాయింపు 
విశాఖలో ఉన్న మేరీటైమ్‌ అండ్‌ షిప్‌ బిల్డింగ్‌ సెంటర్‌ని రూ. వెయ్యి కోట్లుతో దశలవారీగా అభివృద్ధి చేస్తున్నాం. ఇది బంగాళాఖాతం తీరదేశాలకు కీలకం కానుంది. విశాఖ వంటి అందాల నగరంలో అద్భుతమైన సదస్సు నిర్వహించడం ఆశావహం. బిమ్స్‌టెక్‌ సదస్సు విజయవంతం అవ్వడం చూస్తుంటే.. ఈ రంగం భవిష్యత్తులో ఆర్థికాభివృద్ధిలో కీలకంగా మారనుందనడంలో అతిశయోక్తి లేదు. సముద్రమార్గం, వాణిజ్య రంగాల్లో కీలక అభివృద్ధి కోసం ఆయా దేశాలు ఏకమవ్వాలి. ఇప్పటికే ఇండియా బంగ్లాదేశ్‌ కార్గో రవాణాపై పరస్పర సహకారాన్ని అందించుకుంటున్నాయి. షిప్పింగ్‌ సెక్టార్‌ ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుంటోంది. పోర్టులున్నాయి, పోర్టు టెక్నీషియన్లున్నారు. కానీ.. అప్‌గ్రేడ్‌ అవ్వలేకపోతున్నాం.

నౌకల డిజైన్, మోడల్‌ టెస్టింగ్‌ సౌకర్యాలు లేవు. దాన్ని అధిగవిుంచేందుకు మోడల్‌ టెస్టింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశాం. సాగరమాల ప్రాజెక్టుల ద్వారా పోర్టుల అనుసంధానం చేస్తున్నాం. ప్రస్తుతం 76 ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. పోర్టు, రోడ్డు, రైల్‌ కనెక్టివిటీతో పాటు కోస్టల్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్‌పైనా దృష్టి సారించాం. ప్రస్తుతం దేశంలో ఉన్న 200 పోర్టుల్లో 74 మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. మిగిలన పోర్టుల్నీ అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కార్యచరణ రూపొందిస్తోంది. తీర ప్రాంతం లేని రాష్ట్రాల ఎగుమతి దిగుమతులకు ఈ పోర్టులు అప్పగించి వాటిలోనూ కార్యకలాపాలు ముమ్మరం చేసేందుకు కృషి చేస్తాం.                        
 – కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి మన్షుక్‌ మాండవీయ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top