బిగ్‌ఫైట్ ఐఏఎస్‌లు + ఉద్యోగ సంఘాలు | Big Fight IAS + Professional Associations | Sakshi
Sakshi News home page

బిగ్‌ఫైట్ ఐఏఎస్‌లు + ఉద్యోగ సంఘాలు

Dec 1 2014 12:58 AM | Updated on Mar 21 2019 8:23 PM

బిగ్‌ఫైట్ ఐఏఎస్‌లు + ఉద్యోగ సంఘాలు - Sakshi

బిగ్‌ఫైట్ ఐఏఎస్‌లు + ఉద్యోగ సంఘాలు

జిల్లా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఐఏఎస్ అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ప్రత్యక్షయుద్ధం నెలకొంది.

సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా తొలిసారి ఐఏఎస్ అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ప్రత్యక్షయుద్ధం నెలకొంది. జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎంపీడీవోల మధ్య మొదలైన వివాదం చినికిచినికి గాలివానలా తయారైంది. శనివారం రాత్రి ఒక్కసారిగా ఎగసిన ఎంపీడీవోల ఆగ్రహం జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు దౌత్యంతో చల్లారిందని అందరూ భావించారు. అయితే కలెక్టర్ వ్యవహారశైలిపై అన్ని ఉద్యోగ సంఘాల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఆదివారం ఉదయానికి ఒక్కసారిగా లావాలా ఎగబాకింది.
 
 కలెక్టర్ భాస్కర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ బాబూరావు   నాయుడును కూడా టార్గెట్ చేస్తూ ఉద్యోగులు అల్టిమేటం జారీచేశారు. ఉద్యోగులు ఇలా కలెక్టర్, జేసీలపై బహిరంగంగా రోడ్డెక్కడం చూస్తుంటే జిల్లాలో పాలన గాడి తప్పిందన్న భావన వ్యక్తమవుతోంది. అధికారులు, ఉద్యోగులు ఎవరికి వారు పట్టువీడకుండా బలప్రదర్శనలకు దిగుతుంటే జిల్లాలో ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వాస్తవానికి ఉద్యోగులకు ఏమైనా సమస్యలొస్తే ముందుగా ప్రజాప్రతినిధులను కలిసి విన్నవించుకుంటారు. నేతలు మధ్యవర్తిగా ఉండి ఇరువర్గాల మధ్య నెలకొన్న సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తారు.
 
 గతంలో కలెక్టర్లు సంజయ్‌జాజు, సిద్ధార్ధజైన్‌ల హయాంలో కూడా అధికారులు తీవ్ర అసంతృప్తికి గురైన దాఖలాలు ఉన్నాయి కానీ ఈ స్థాయిలో ఇలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం, జిల్లాలో ఉన్న ఇరువురి ఐఎఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఎప్పుడూ జరగలేదు. రెండురోజులుగా జిల్లాలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాప్రతినిధులను లెక్కచేయకుండానే అధికారులు ఇలా తెగింపునకు సిద్ధమయ్యారా లేదా తెరవెనుక ఉండి వారే కథ నడిపిస్తున్నారా అన్న ప్రశ్నలూ తలెత్తుతున్నాయి. అవినీతి, అక్రమాలకు తావు లేకుండా ముక్కుసూటిగా ముందుకువెళుతున్న కలెక్టర్ వైఖరికి మింగుడు పడని నేతలే ఉద్యోగుల అసంతృప్తి సమస్యను రావణకాష్టంలా రగిలించారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఎవరి వాదనలు ఎలా ఉన్నా జిల్లాలో అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయలోపం వెరసి పాలన పూర్తిగా గాడి తప్పిందన్న వ్యాఖ్యలు స్వయంగా అధికార పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి.
 
 ఎవరిది పైచేయి
 ఉద్యోగుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని ప్రభుత్వం కలెక్టర్, జేసీలలో ఎవరిని బదిలీ చేసినా.. లేదా ఎవరినీ బదిలీ చేయకుండా ఉద్యోగులతో చర్చించి సమస్యను సానుకూలంగా పరిష్కరించినా... భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి సమస్య ఉత్పన్నం కాదన్న గ్యారంటీ లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వ్యవహారంలో ఎవరిది పై చేయి అవుతుందనేది ప్రస్తుతానికి ఎవరికీ అర్థం కాని పజిల్‌గానే ఉంది.  జిల్లాకు వచ్చినప్పుడల్లా  ఇక్కడి నేతలు, అధికారులపై ప్రశంసల జల్లు కురిపించే  ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు ఈ సమస్యను ఎలా కొలిక్కి తెస్తారు.. పాలనపై ప్రభుత్వానికి ఏం పట్టు ఉందని నిరూపిస్తారో చూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement