
భెల్ మిస్టర్ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభిస్తున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, మాజీ మేయర్ సురేష్‌బాబు
కడప కార్పొరేషన్: సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని విస్తృతంగా స్ప్రే చేసేందుకు భెల్ మిస్టర్ మిషన్‌ను ఇకపై వినియోగించనున్నారు. కడప నగరపాలక సంస్థ రూ.3.54లక్షలతో కొనుగోలు చేసిన ఆ మిషన్‌ను డిప్యూటీ సీఎం అంజద్‌బాషా మాజీ మేయర్ సురేష్‌బాబుతో కలిసి మంగళవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి తాకిన ప్రదేశంలో 24 గంటలపాటు వైరస్ బతికే ఉంటుందన్నారు. సోడియం హైపో క్లోరైట్ ద్రావణం స్ప్రే చేయడం ద్వారా ఆ క్రిములను అంతమొందించవన్నారు.
ప్రధాన వీధుల్లో వేగంగా స్ప్రే చేయడానికి భెల్‌మిస్టర్ మిషన్ ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రంలోని 14 మున్సిపల్ కార్పొరేషన్‌లకు ప్రభుత్వం వీటిని సరఫరా చేసిందన్నారు. కడప నగరంలో 6 ట్రాక్టర్ల ద్వారా ఇప్పటికే స్ప్రేయింగ్ చేస్తున్నామన్నారు. అన్ని డివిజన్లలో రెండుసార్లు స్ప్రేయింగ్ పూర్తయ్యిందన్నారు. తిరుపతిలో ఉన్న నలుగురికి నెగిటివ్ వచ్చిందని, వారు కూడా త్వరలో డిశార్చి కాబోతున్నారన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ లవన్న, ఆర్‌డీఓ మాలోలా, తహసీల్దార్ శివరామిరెడ్డి, మున్సిపల్ ఇంజినీర్ కేఎం దౌలా, డీఈ కరిముల్లా పాల్గొన్నారు.