వినుడు..వినుడు విజయగాథ

Best School In East Godavari District - Sakshi

జిల్లాలోనే అత్యుత్తమంగా నిలిచిన శ్రీరామనగర్‌ మండల పరిషత్‌ పాఠశాల

దాతల సహకారంతో కార్పొరేట్‌కు దీటైన అభివృద్ధి

అందరి మన్ననలు పొందుతున్న హెచ్‌ఎం చలపతి

ప్రస్తుత పరిస్థితుల్లో పరిమిత వనరులతో అద్భుతమైన ఫలితాలు రాబట్టగలిగేవారు చరితార్థులే. వారు అందరికీ ఆదర్శప్రాయులే అవుతారు. ప్రస్తుతం అందరూ కార్పొరేటు విద్యా సంస్థలపై మొగ్గు చూపుతున్నారు. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం .. ఈ పాఠశాలల మూసివేతకు ప్రయత్నిస్తోంది. కాజు లూరు శివారు గ్రామంలో.. సమస్యల్లో కూరుకుపోయిన మండల పరిషత్‌ పాఠశాల.. ఇప్పుడు జిల్లాలోనే ఉత్తమంగా నిలిచింది. గ్రామంలోని విద్యార్థులందరూ ఆ పాఠశాల బాట పట్టారు. ఈ పాఠశాల హెచ్‌ఎం.. అందరినీ కూడకట్టుకుని, దాతల సహకారంతో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఈ పాఠశాలను అభివృద్ధి చేశారు. ప్రచారంలో ప్రైవేటు విద్యా సంస్థల కంటే మిన్నగా ఈ పాఠశాల దూసుకుపోతోంది. ఈ పాఠశాల అభివృద్ధి కథా కమామిషు ఇలా ఉంది.

కాజులూరు (రామచంద్రపురం): ప్రభుత్వ పాఠశాలలు ఉనికిని కోల్పోతున్నాయి. వీటిని అభివృద్ధి చేస్తామంటూ పాలకుల ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం పాఠశాలల పరిస్థితి దయనీయంగా ఉంటోంది. ఈ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడాన్ని సాకుగా తీసుకునే ప్రభుత్వం వాటి మూసివేతకు ప్రయత్నిస్తోంది. దీంతో ఉపాధ్యాయులే నడుం బిగించి ఈ పాఠశాలలను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే వీటిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో గ్రామాల్లో సైతం విద్యార్థులను కాన్వెంట్లలో తల్లిదండ్రులు చేర్పిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కాజులూరు శివారు శ్రీరామ్‌నగర్‌లో మండల పరిషత్‌ పాఠశాల హెచ్‌ఎం ఎస్‌ఎస్‌వీ చలపతి పలువురి దాతల సహకారంతో పాఠశాల అభివృద్ధిపథంలోకి నడిపించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచారు. ఈయన శ్రమ ఫలించడంతో ఈ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా పేరుగడించింది. ఇప్పుడు ఈ పాఠశాల వల్ల ఆ గ్రామం ప్రఖ్యాతి గాంచింది.

వినూత్న కార్యక్రమాలు
ఈ పాఠశాలలో వినూత్న రీతిలో పలు కార్యక్రమాలు చేపట్టి విద్యార్థులను ఆకర్షించే హెచ్‌ఎం ప్రయత్నాలు ఫలించాయి. క్యాలెండర్‌ వారీగా వచ్చే జాతీయ పండుగలతోపాటు విద్యార్థులను ఉత్తేజపరిచేలా కార్యక్రమాలు, చిన్నారుల ఆటపాటల కోసం ఊయల, జారుడు బల్ల ఏర్పాటు, తాబేళ్ల పెంపకానికి వీలుగా పాఠశాల ఎదుట కొలను నిర్మాణం, తరగతి గదులలో ఫర్నిచర్‌ ఏర్పాటు చేశారు. పలువురు దాతల సహకారాలతో పాఠశాలలో కంపూటర్లు సమకూర్చి ప్రొజెక్టర్‌తో విద్యార్థులకు ఆంగ్ల భాషపై తర్ఫీదు ఇస్తున్నారు. పాఠశాలలో మినరల్‌ వాటర్‌ ఏర్పాటుతోపాటు బాలబాలికలకు వేర్వేరుగా మరుగుదొడ్డి నిర్మించారు.

విరాళాలతో పాఠశాల అభివృద్ధి
గ్రామస్తుల సహకారంతో రూ.8 లక్షల విరాళం సేకరించి పాఠశాలను అభివృద్ధి చేయడం ద్వారా శ్రీరామ్‌నగర్‌ పాఠశాల జిల్లాలోనే ఉత్తమ పాఠశాలగా నిలిచింది.
పాఠశాల భవనానికి ప్రహరీ కట్టించి దానిపై ఆకర్షణీయమైన బొమ్మలు వేయించటంతోపాటు పాఠశాల ఆవరణ మొక్కలు నాటి పచ్చని వాతావరణాన్ని కల్పించారు. దాతల సహకారంతో విలువైన వస్తువులు సమకూర్చటంతోపాటు హెచ్‌ఎం తన పేరిట ‘చలపతి శిష్టాస్‌ చారిటీస్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి పాఠశాలకు చిన్న అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రతిభ కలిగిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు. పలువురు జిల్లా స్థాయి అధికారులు శ్రీరామ్‌నగర్‌ పాఠశాలకు వచ్చి స్థానికులను, ఉపాధ్యాయులను అభినందించిన సందర్భాలు అనేక ఉన్నాయి.

పెరిగిన విద్యార్థుల సంఖ్య
2013లో చలపతి మాస్టారు పాఠశాలకు వచ్చేనాటికి 30 మంది విద్యార్థులకు ఒకే ఉపాధ్యాయుడు ఉండేవారు. పాఠశాలను దశల వారీగా హెచ్‌ఎం అభివృద్ధి చేయడంతో ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 70కి పెరిగింది. ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచటంతోపాటు ప్రభుత్వ పాఠశాలల విశిష్టతను వివరిస్తూ ఇటీవల ‘ఆ గట్టునుంటావా విద్యార్థి.. ఈ గట్టుకొస్తావా’ అంటూ పాఠశాల విద్యార్థులతో చలపతి మాస్టారు చేపట్టిన వినూత్న ప్రదర్శన గ్రామస్తులను ఆకట్టుకుంటుంది.

అందరి సహకారంతోనే..
విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలో చదివితే అయ్యే ఖర్చు, ప్రభుత్వ పాఠశాలలో చదివితే కలిగే ఉపయోగాలను వివరిస్తూ ఫ్లెక్సీల ద్వారా ప్రచారం చేస్తున్నాం. ప్రైవేటు పాఠశాలలో కంటే ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతిభగల ఉపాధ్యాయులు ఉన్నారని, విద్యార్థులకు మెరుగైన విద్య లభిస్తుందని తల్లిదండ్రులకు వివరిస్తున్నాం. సహచర ఉపాధ్యాయులు, స్థానిక యువజన సంఘాలు, పలువురి దాతల సహకారాలతోనే పాఠశాలను అభివృద్ధి చేయగలిగా. మెరుగైన విద్య అందిస్తుండటంతో గ్రామస్తుల పిల్లలను ప్రైవేటు పాఠశాలలో మాన్పించి మా పాఠశాలలో చేర్పిస్తున్నారు.– హెచ్‌ఎం ఎస్‌ఎస్‌వీ చలపతి

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top