భళా బెలుం | Belum Caves Recognized as the second subterranean caves in the world | Sakshi
Sakshi News home page

భళా బెలుం

Jan 5 2020 4:32 AM | Updated on Jan 5 2020 8:45 AM

Belum Caves Recognized as the second subterranean caves in the world - Sakshi

బెలుం గుహల్లోని సుందర దృశ్యాలు

కోవెలకుంట్ల/కొలిమిగుండ్ల: భారతీయ సంస్కృతిలో గుహలకు ప్రత్యేక స్థానం ఉంది. దేవుళ్లు, దేవతలకు గుహలు నివాసమని కొందరు నమ్మితే.. మరికొందరు ప్రాచీన చరిత్రకు ఆనవాళ్లుగా గుర్తిస్తారు. అందుకే అవి పవిత్ర స్థలాలుగా, పర్యాటక స్థలాలుగా విలసిల్లుతున్నాయి. సాధారణంగా గుహలు కొండ చరియల్లో, అడవుల్లో ఎక్కువగా కన్పిస్తాయి. దీనికి భిన్నంగా సుమారు 23 ఎకరాల విస్తీర్ణంలో సాగు భూమి లోపల ఏర్పడిన గుహలు కర్నూలు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి. కొలిమిగుండ్ల మండలం బెలుం సమీపంలోని ఈ గుహలు ప్రపంచంలోనే రెండో అంతర్భూభాగ గుహలుగా, దేశంలోనే పొడవైనవిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. ఈ నేపథ్యంలో బెలుం గుహల విశేషాలు తెలుసుకుందాం. 


గుహల ఉనికిని చాటిన ఆంగ్లేయుడు 
1884వ సంవత్సరంలో హెచ్‌బీ ఫూటే అనే ఆంగ్లేయుడు మొదటిసారిగా బెలుం గుహల ఉనికిని చాటినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. తర్వాత వందేళ్ల వరకు వీటి ప్రస్తావన లేదు. 1982–1984 మధ్య కాలంలో హెచ్‌డీ గేబర్‌ అనే జర్మనీ దేశస్తుడు ఇక్కడకు వచ్చి 3,225 మీటర్ల వరకు శోధించి ఒక పటాన్ని తయారు చేశాడు. వీరికి స్థానికులైన అప్పటి రిటైర్డ్‌ ఎస్పీ చలపతిరెడ్డి, ఆయన అల్లుడు రామసుబ్బారెడ్డి పూర్తి సహకారం అందించారు.

1988లో ఆంధ్రప్రదేశ్‌ పురాతత్వ శాఖ ఈ గుహలను రక్షిత స్థలంగా ప్రకటించి కొన్నేళ్లపాటు కాపాలాదారుని నియమించింది. ఇక్కడ క్రీ.పూ. 450 సంవత్సరాల కాలం నాటి మట్టి పాత్రలో మనిషి అస్థికలు, రాతి కత్తి లభ్యం కావడంతో ఈ గుహలను కూడా ఆనాటి మానవులు నివాస స్థలాలుగా వినియోగించుకున్నట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. వీటిని అనంతపురం మ్యూజియంలో భద్రపరిచారు. 1999లో ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ బెలుం గుహలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తమ ఆధీనంలోకి తీసుకుంది. 2003 నుంచి బెలుం గుహల సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తున్నారు. సొరంగ మార్గాల్లో ఒకటిన్నర కిలోమీటర్ల పొడవున మట్టి దిబ్బలను తొలగించి నాపరాళ్లు పరిచి నడక దారిని ఏర్పాటు చేశారు. 

విశేషాలివీ
- బెలుం గుహల్లో 40 మెట్లు దిగిన తర్వాత 10 మీటర్ల లోతులో మొదలై 30 మీటర్ల లోతు వరకు రకరకాలుగా ఉన్న ఈ సొరంగాలు కొన్నిచోట్ల ఇరుకుగాను, మరికొన్నిచోట్ల విశాలమైన గదులుగాను ఉండి కొన్నిచోట్ల స్టాలక్‌టైట్లు, స్టాలగ్మైట్లు అనబడే స్ఫటికాకృతులు ఏర్పడి ఉన్నాయి.  
ఈ శిలల ఆకృతుల ఆధారంగా కొన్ని ప్రదేశాలకు వేయి పడగలు, కోటి లింగాలు, ఐరావతం, ఊడలమర్రి, మాయా మందిరం, వంటి పేర్లు పెట్టారు.  
ఇవికాకుండా ధ్యానమందిరం, మండపం, కప్పులో ఉన్న బొంగరపు గుంతలు, గుహల చివరి వరకు పోతే పాతాళగంగ అనే నీటి మడుగు అక్కడే రాతిలో మలచిన శివలింగం ఉన్నాయి. 
విద్యుద్దీప కాంతులతో ఈ సొరంగ సోయాగాలను తిలకిస్తూ లోపలికి వెళ్లే కొద్దీ మరో ప్రపంచంలో ఉన్నట్లు అనిపిస్తుంది. 
గుహల్లో ఉండే నీటికి, బెలుం గ్రామంలోని శివాలయం పక్కనే నిటారు దారులు కలిగిన రాతిబావిలోని నీటిమట్టంకు సంబంధం ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రెండు చోట్లా ఎప్పుడూ నీటి మట్టాలు సమానంగా ఉంటాయని పేర్కొంటున్నారు. 

పెరుగుతున్న సందర్శకుల తాకిడి 
ప్రతి శని, ఆదివారాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు రోజుల్లో బెలుం గుహలకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంటుంది. రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు విదేశీయులు బెలుం గుహలను సందర్శిస్తున్నారు. పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 45 ప్రకారం నామమాత్రపు రుసుం వసూలు చేస్తున్నారు. తద్వారా టూరిజం శాఖకు ఏటా రూ. 1.79 కోట్ల ఆదాయం చేకూరుతోంది. గుహల ప్రాముఖ్యత తెలియజేసేందుకు ఇక్కడ తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్‌ భాషలు తెలిసిన తెలుగు గైడ్లు అందుబాటులో ఉన్నారు. జిల్లాలో ఉన్న పర్యాటక ప్రదేశాల కంటే బెలుం గుహల నుంచి టూరిజం శాఖకు అధిక ఆదాయం చేకూరుతుండటం విశేషం. 

Advertisement
 
Advertisement
Advertisement