రగిలిన చిచ్చు | bc corporation Fife on tdp Government decision | Sakshi
Sakshi News home page

రగిలిన చిచ్చు

Dec 3 2017 8:30 AM | Updated on Dec 3 2017 8:30 AM

bc corporation Fife on tdp Government decision - Sakshi

కాకినాడ రూరల్‌: కాపులను బీసీల్లో చేర్చి 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న చంద్రబాబు సర్కారు నిర్ణయంతో చిచ్చు రగిలింది. ప్రభుత్వ నిర్ణయంపై మండిపడిన బీసీలు ఉద్యమ పథంలో కదం తొక్కారు. కాపు రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ శనివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించారు. కలెక్టరేట్‌ ఎదుట బీసీలు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్త్తతకు దారి తీసింది. వందలాదిగా కలెక్టరేట్‌కు తరలివచ్చిన బీసీలు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. టైర్లు తగులబెట్టారు. ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని కాజులూరు మండలం కోలంకకు చెందిన యువకుడు మేడిశెట్టి ఇజ్రాయిల్‌ ఆత్మహత్యా యత్నం చేశాడు. అక్కడే ఉన్న బీసీ నాయకులు స్పందించి నీరు పోయడంతో అతడు స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో కలెక్టరేట్‌వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

బీసీ ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పిస్తోందంటూ పలువురు బీసీలు మండిపడ్డారు. జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. కమిషన్‌ ఏం చెప్పిందో తేల్చకుండా కాపులకు అశాస్త్రీయంగా బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం తగదన్నారు. కేవలం కమిషన్‌ సభ్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. కాపులకు, బీసీలకు మధ్య గొడవలు సృష్టించడానికే చంద్రబాబు ప్రభుత్వం ఈ బిల్లు తేవడానికి ప్రయత్నించినట్టుందంటూ మండిపడ్డారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణం తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కాపులను బీసీల్లో కలుపుతూ ప్రభుత్వం చేసిన ప్రకటనపై న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి..
ఆందోళనలో పాల్గొన్న పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేరుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు రాష్ట్రంలోని బీసీ నాయకులంతా సమావేశమై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగజేస్తామని హెచ్చరించారు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరూ కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయాన్ని వ్యతిరేకిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో సీట్లు రావనో, మంత్రి పదవులు రావనో అనుకునేవారికి ఎమ్మెల్యే అవకుండానే బీసీలంతా బుద్ధి చెబుతారన్నారు. కాపుల ఓట్లతోనే ఎమ్మెల్యేలుగా గెలుస్తామని అనుకుంటే ఏవిధంగా చేయాలో బీసీలందరూ నిర్ణయిస్తారని అన్నారు. చంద్రబాబు ప్రకటిస్తే అయిపోయేది కాదని, దీనిని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను సహితం ఖాతరు చేయనివారికి సరైన గుణపాఠం చెబుతామని మల్లాడి స్పష్టం చేశారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి సహకరించిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు, బీసీ ఆందోళనకు సహకరించని ప్రజాప్రతినిధుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని అన్నారు.

ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ మాట్లాడుతూ, కాపులను బీసీల్లో చేర్చడానికి తాను పూర్తిగా వ్యతిరేకినని అన్నారు. చంద్రబాబు నిర్ణయాన్ని తాను వ్యతిరేకిస్తున్నానన్నారు. దేశంలో ఎవరు ఉన్నత పదవుల్లో ఉన్నా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందేనని గుర్తు చేశారు. సామాజిక, విద్యా రంగాల్లో వెనుకబాటుతనం ఉన్నవారు మాత్రమే రిజర్వేషన్లకు అనుకూలమని రాజ్యాంగం చెబుతోందని వివరించారు. రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్‌ తదితర రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు రాజ్యాంగానికి లోబడే ఉన్నాయన్నారు. ఈ ఆందోళనలో రాష్ట్ర బీసీ జేఏసీ నాయకులు చొల్లంగి వేణుగోపాల్, మాకినీడి భాస్కర్, పంపన రామకృష్ణ, కడలి ఈశ్వరి, గుబ్బల వెంకటేశ్వరరావు, కుండల సాయికుమార్, ఎ.శ్రీనివాసరావు, వాసంశెట్టి త్రిమూర్తులు, గరికిన అప్పన్న తదితరులు కూడా పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement