ఆషాడ మాసం...ప్రత్యేకతల సమాహారం

Ashada Masam .. Specialty - Sakshi

వాతావరణంలో మార్పులు

జగన్నాథుని రథయాత్ర

తెలంగాణాలో బోనాల పండగ

మహిళల్లో మెహందీ వేడుక

శుభకార్యాలకు సెలవు

కొత్త జంటలకు ఎడబాటు

విజయనగరం : ఆచార  వ్యవహారాలకు పెద్దపీటవేసే సంప్రదాయంలో ప్రతీనెలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. తొలకరి జల్లులతో ప్రకృతి శోభనందించే వేళ వచ్చేదే ఆషాడమాసం. చంద్రగమనంలో పూర్వాషాడ నక్షత్ర సమీపంలో సంచరించే సమయం కాబట్టి ఆషాడ మాసంగా పిలుచుకుంటాం. శుభకర్యాలకు అవకాశం లేకపోయినా... ఆధ్యాత్మికంగా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉన్న నెల ఆషాడం.

జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలు, తెలంగాణాలో బోనాలు పండగ, చాతుర్మాస వ్రతాలు.. ఇలా ఎన్నో స్థానిక పండగలతో నెలంతా సందడిగా సాగుతుంది. ఆషాడంలో చేసే దానం, స్నానం, జపం, పారాయణం విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు. ఆషాడంలో చేసే సముద్ర, నదీ స్నానాలు ముక్తిదాయకమని పెద్దలు చెబుతుంటారు.  ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు పొందుతారని ప్రజల విశ్వాసం.

అతివల అరచేతుల్లో అందాలు..

ఆషాడ మాసం వస్తే చాలు .. ఆడవారి అర చేతుల్లో గోరింటాకు మెరిసిపోతూ ఉంటుంది. చక్కని లేత గోరింటాకు రుబ్బి, తమ అరచేతిని ఆకాశాన్ని చేసి అందులో చందమామని, చుక్కల్ని అందంగా తీర్చిదిద్దుతారు. మెహందీ కోన్‌లు తెచ్చి జిగిబిగి అల్లికలా ముచ్చటైన ఆకృతుల్ని వేసుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు తమ చేతులు ఎర్రగా పండితే అందాల రాకుమారుడు భర్తగా వస్తాడని విశ్వసిస్తారు.

ఎర్రగా పండితే చాలు తమ చేతుల్ని అందరికీ చూపిస్తున్నప్పుడు ఆ సమయంలో వారి చేతుల కంటే సిగ్గుతో  వారి బుగ్గలే ఎర్రబడతాయి. ఇక శాస్త్రీయ పరంగా గోరింటాకు గురించి మాట్లాడుకుంటే.. ఆషాడంలో గీష్మరుతువు గడిచిపోతోంది. వర్ష రుతువు ఆరంభమవుతుంది. గ్రీష్మంలో శరీరంలో వేడి బాగా పెరుగుతుంది.  ఆషాడంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది. ఇలాంటి సమయాల్లో అనారోగ్యాలు తప్పవు.

అంతే కాకుండా నిత్యం పనుల్లో ఉండే మహిళల చేతులు, పాదాలు పగిలిపోతూ ఉంటాయి.  ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకే ఆషాడంలో గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసేశక్తి ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే, గోరింటాకు రసంలో యాంటీ బ్యాక్టీరీయా లక్షణాలు ఉంటాయి. గోరింటాకు పెట్టుకున్న చేతులతో తినే టప్పుడు నోటి ద్వారా క్రిములు వెల్లకుండా కాపాడుతుందని చెబుతుంటారు. అంతేకాదు... గోరింటాకు ఒత్తిడిని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయంట.

నవ దంపతులకు కష్టకాలం

ఆషాడమంటే అందరికీ ఇష్టమైనా.. కొత్తగా పెళ్‌లైన దంపతులకు మాత్రం ఈ మాసం వస్తుందంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తుంటారు. వివాహం అయిన తర్వాత వచ్చే తొలి ఆషాడంలో కొత్తగా అత్తారింటికి వచ్చే కోడలు, అత్తగారు ఒకే చోట ఉండకూడదని, ఒకరికొకరు ఎదురు పడకూడదని చెబుతుంటారు.  అంతే కాకుండా సాగు పనుల్లో క్షణం తీరికలేకుండా ఉంటారు. కాబట్టి కొత్త అల్లుడికి మర్యాదల విషయంలో లోటు వస్తుందనే ఉద్దేశంతో ఎడబాటుగా ఉంచుతారు.

ఇదిలా ఉండగా శాస్త్రీయ పరమైన కారణమేమిటంటే  ఆషాడంలో కొత్త దంపతుల కలయిక వల్ల గర్భం ధరిస్తే... చైత్ర, వైశాఖ మాసంలో పిల్లలు పుడతారు. అంటే ఏప్రిల్, మే నెలల్లో నవజాత శిశువులు, బాలింతలు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కనే అవకాశాలున్నాయి.  ఈ కారణంగానే ఆషాడంలో కొత్త జంటకు నెలరోజుల పాటు ఎడబాటు తప్పదు. 

విభిన్న మార్పుల వాతావరణం

ఆషాడాన్ని అనారోగ్యా మాసంగా కూడా పిలుస్తుంటారు.  విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయమిది. కాలువలు, నదుల్లో ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువుల్లోకి వచ్చి చేరే నీరు మలినంగా ఉండి మనుషులు అనారోగ్యానికి కారణమవుతుంది. కొత్తనీరు తాగడం, వర్షంలో తడవడం వల్ల  చలిజ్వరం, విరేచనాలు, తలనొప్పి మొదలైన వ్యాధులు ప్రబలుతుంటాయి.

గర్భం దాల్చిన స్త్రీలు తగు ఆహార నియమాలు పాటించాల్సిన సమయమిది.శుభకార్యాలకు సెలవుఆషాడ మాసంలో సాధారణంగా శుభకార్యాలు నిర్వహించరు.  పూర్వీకులు దీన్ని శూన్యమాసంగా భావిస్తారు.   రుతువులు ఈ మాసంతోనే  ప్రారంభమవుతాయి కాబట్టి  శుభకార్యాలకు మంచిది కాదంటారు.

అంతే కాకుండా వర్షాలు ఈ కాలంలోనే ప్రారంభమవుతాయి కాబట్టి వ్యవసాయ పనులు జోరందుకోవడం వల్ల వేరే వ్యాపకంలో ఉండరు. అందుకే  గృహప్రవేశం, నిశ్చితార్థం, వివాహం, ఉపనయనం, తదితర కార్యాలు ఆషాడంలో నిర్వహించరు.  శ్రావణమాసం వచ్చే వరకూ శుభకార్యాలు ఎక్కడా నిర్వహించకపోవడం ఆనవాయితీగా వస్తోంది.

ఆరోగ్యదాయకం.. గోరింటాకు

గోర్లకు పెట్టుకునే ఆకుగా గోరింటాకును వర్ణిస్తారు.  రైతులు వ్యవసాయం చేసే సమయమిది. మహిళలు నీటిలో చేతులు పెట్టి వ్యవసాయపనులు చేస్తుంటారు. గోళ్ల ద్వారా వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు గోరింటాకును రాత్రివేళ గోళ్లకు పెట్టుకుంటారు.

ప్రస్తుత రోజుల్లో మహిళలు గోళ్లను వదిలేసి, మిగతా చోట మాత్రమే పెట్టుకుంటున్నారు. ఆషాడ మాసంలో గోరింట పెట్టుకోవడం ప్రతి మహిళ అపురూపంగా భావిస్తుంది. ఈ మాసంలో గోరింట పెట్టుకోవడం ఆనవాయితీగా వస్తుంది ఆరోగ్యపరంగా కూడా మంచిది. అందుకే పెళ్లికి ముందు... పెళ్లి తర్వాత కూడా ఆషాడ మాసంలో కచ్చితంగా గోరింట పెట్టుకునే అలవాటు ఉంది.  

      –పి. మానస, బ్యూటీషీయన్, విజయనగరం 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top