ఏపీ ట్రాన్స్‌కో ప్రై‘వేటు’

AP transco into the hands of private - Sakshi

లైన్లు, సబ్‌ స్టేషన్లు, భద్రత ఇక ప్రైవేటు చేతుల్లోకి

ట్రాన్స్‌కో సిబ్బందికి ఇతర విధులు,కాదంటే వీఆర్‌ఎస్‌

కొత్త నియామకాలకు చెల్లుచీటీ 

గుట్టుచప్పుడు కాకుండా డ్రాఫ్ట్‌

టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు

ఆందోళనకు దిగితే కఠిన చర్యలు

యూనియన్లకు అధికారుల హెచ్చరికలు

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో)ను ప్రైవేటు పరం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా కూడా తయారైంది. ఇప్పటికే  ‘నిర్మించు, నిర్వహించు’ (బిల్డ్, ఆపరేట్, ఓన్‌ మెయింటెనెన్స్‌–బూమ్‌) విధానం తీసుకొస్తున్నారనే సంకేతాలు విద్యుత్‌ సిబ్బందిని కలవరపెడుతున్నాయి. కొత్తగా నిర్మించే సబ్‌ స్టేషన్లు, వేసే లైన్లపై పూర్తి పెత్తనం ప్రైవేటు వ్యక్తులకే కట్టబెట్టడం ‘బూమ్‌’ లక్ష్యం. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర నిరసన రావడంతో సర్కారు కొంత వెనక్కు తగ్గింది. కానీ బూమ్‌తో పాటు, ఇప్పటికే ఉన్న ట్రాన్స్‌కో లైన్లు, సబ్‌స్టేషన్లు, భద్రతను పూర్తిగా ప్రైవేటుకే ఇవ్వడానికి పక్కా ప్రణాళిక సిద్ధం చేయడంపై ఉద్యోగుల్లో గుబులు మొదలైంది.

ఈ విధానం వల్ల తమ ఉద్యోగాలకు మంగళం పాడే వీలుందని, ఇక ట్రాన్స్‌కోలో కొత్త ఉద్యోగాల నియామకమే ఉండదని ట్రాన్స్‌కో సిబ్బంది కలవరపడుతున్నారు. అయితే, దీన్ని ప్రతిఘటించేందుకు ముందుకొచ్చిన ఉద్యోగ సంఘాలను ముందే కట్టడి చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది సీఎం తీసుకున్న నిర్ణయమని, ఇందుకు విరుద్ధంగా ఎవరు మాట్లాడినా చర్యలు తప్పవంటూ ట్రాన్స్‌కో ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. ఫలితంగా విద్యుత్‌ ఉద్యోగ సంఘాలు నోరు విప్పేందుకు సాహసించడం లేదు. ఈ విషయమై బుధవారం విజయవాడలోని విద్యుత్‌ సౌధలో ఉద్యోగ సంఘాలతో ఉన్నతాధికారులు చర్చించారు. ప్రైవేటీకరణపై సంఘాల నేతలు తీవ్ర వ్యతిరేకత వెలిబుచ్చినట్టు తెలిసింది. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించే వీలుందనే బెదిరింపుల తర్వాత సంఘ నేతలు మౌనం వహించినట్టు తెలుస్తోంది. 

ప్రైవేటు పెత్తనమే!
ఏపీ ట్రాన్స్‌కో పరిధిలో ప్రస్తుతం 400 కేవీ సబ్‌ స్టేషన్లు పది ఉన్నాయి. 220 కేవీ సబ్‌ స్టేషన్లు 87 వరకూ ఉన్నాయి. ఈ 97 సబ్‌ స్టేషన్ల పరిధిలో విద్యుత్‌ లైన్లు కూడా ఉంటాయి. ఇవే కాకుండా కొత్తగా మరికొన్ని లైన్లు, సబ్‌ స్టేషన్లు నిర్మించే ఆలోచనలో ఉన్నారు. తొలిదశలో ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్లు, లైన్లు, ఇందులో భద్రతను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత విద్యుత్‌ పంపిణీ సంస్థల పరిధిలోని 33 కేవీ, 132 కేవీ సబ్‌ స్టేషన్లు లైన్లు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ఆలోచనలో ఉన్నారు.

ట్రాన్స్‌కో, డిస్కమ్‌లను కలుపుకుంటే మొత్తం 2,905 సబ్‌ స్టేషన్లు, లైన్లు ప్రైవేటు పరం చేయడం ప్రభుత్వ ఉద్దేశంగా కన్పిస్తోంది. ఇవన్నీ ప్రస్తుతం ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల పరిధిలో ఉండటం వల్ల నిర్మాణ, నిర్వహణ వ్యయాన్ని ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రతీ సంవత్సరం సమీక్షిస్తుంది. వ్యయం పెరిగితే విద్యుత్‌ వినియోగదారులు, ఈ రంగం నిపుణులు కమిషన్‌ ముందు అభ్యంతరాలు లేవనెత్తే వీలుంది. ప్రభుత్వ నిర్ణయం అమలులోకి వస్తే ఇక ఏపీఈఆర్‌సీతో ప్రమేయం లేకుండానే నిర్మాణ, నిర్వాహణ వ్యయాన్ని ప్రైవేటు వ్యక్తులు నిర్ణయించే వీలుంది. ఫలితంగా వాళ్ళే ఇష్టానుసారం విద్యుత్‌ ఛార్జీలు పెంచే ప్రమాదం ఉంది. 

ఉద్యోగాలన్నీ ఉష్‌ కాకీ!
ప్రస్తుతం ఉన్న సబ్‌ స్టేషన్ల పరిధిలో దాదాపు 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రైవేటీకరణ జరిగితే ఈ ఉద్యోగుల పరిస్థితి ఏమిటనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉద్యోగులను ఇతర సంస్థల్లోకి తీసుకునే వీలుందని చెబుతున్నారు. లేదా స్వచ్ఛంద పదవీ విరమణ అమలు చేసేందుకు ట్రాన్స్‌కో సిద్ధమని ఓ అధికారి తెలిపారు. వాస్తవానికి ఇప్పటికే తెలంగాణ రిలీవ్‌ చేసిన ఆంధ్ర స్థానికత గల 1,152 మంది ఉద్యోగులనే ఏపీ విద్యుత్‌ సంస్థలు తీసుకోలేదు. ప్రైవేటీకరణ వేటు పడితే రోడ్డున పడే ఉద్యోగులకు సరైన భరోసా ఉండదని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. అదీగాక ఉద్యోగ అవకాశాలున్న ఈ విభాగాలు ప్రైవేటు చేతుల్లోకి వెళ్తే ట్రాన్స్‌కోలో ఇక ఉద్యోగ నియామకాలు ఉండవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తులే ఇష్టానుసారం నియామకాలు చేపట్టే వీలుందని పేర్కొంటున్నారు.

అధికారుల తలోమాట!
అసలీ ప్రతిపాదనేమీ లేదు. అయినా ఇప్పటికే కొన్ని సబ్‌ స్టేషన్లలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు కదా! తప్పేముంది.
– విజయానంద్, ట్రాన్స్‌కో సీఎండీ 

ఇప్పటికే ఉన్న సబ్‌ స్టేషన్లను ప్రైవేటుకు అప్పగించడంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవు. కొత్తగా వచ్చే సబ్‌ స్టేషన్ల విషయంలో కసరత్తు జరుగుతోంది.
– దినేష్‌ పరుచూరి, ట్రాన్స్‌కో జేఎండీ 

కొత్త సబ్‌ స్టేషన్ల ప్రైవేటీకరణపై చర్చించాం. అయితే మెయింటెనెన్స్‌ కింద ప్రైవేటు వ్యక్తులకు ఎంత చెల్లించాలనే దానిపై స్పష్టత లేదు. 
– సుబ్రహ్మణ్యం, ట్రాన్స్‌కో డైరెక్టర్‌ (ప్రాజెక్ట్స్‌)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top